Friday, April 26, 2024
Friday, April 26, 2024

అసెంబ్లీ రసాభాస

అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య దూషణల పర్వం
తీవ్ర భావోద్వేగానికి గురైన చంద్రబాబు
టీడీపీ సభ్యులు వాకౌట్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య వ్యక్తిగత దూషణలు చోటు చేసుకోవడంతో సభ రసాభాసగా మారింది. కొంతసేపు ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థంగాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయంపై చర్చ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడారు. తమ ప్రభుత్వంలో వ్యవసాయ అభివృద్ధి కోసం చేసిన కృషిని సమగ్రంగా వివరిస్తూ, మధ్యమధ్యలో గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే హెరిటేజ్‌ కంపెనీ దోపిడీ గురించి ప్రస్తావించారు. దీనిపై టీడీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. వాటిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. కానీ స్పీకర్‌ ప్రతిపక్ష సభ్యులకు మైక్‌ ఇవ్వడానికి నిరాకరించారు. ఈలోగా కుప్పం ప్రస్టేషన్‌లో ఉన్నారంటూ అధికార పార్టీ సభ్యులు కామెంట్లు చేయగా, ప్రతిపక్ష సభ్యులు హూ కిల్డ్‌ బాబాయ్‌ అంటూ కామెంట్‌ చేశారు. ఆ తర్వాత అంబటి రాంబాబు ప్రతిపక్ష పార్టీని విమర్శిస్తుండగా, ఆయనుద్దేశించి టీడీపీ సభ్యులొకరు గంట చాలు అంటూ వ్యంగ్యంగా విమర్శించారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై చర్చించాలనుకుంటే మీ వైపు నుంచి కూడా చాలా అంశాలున్నాయని, మాధవరెడ్డి హత్య, వంగవీటి మోహన్‌ రంగా హత్య, మల్లెల బాబ్జీ ఆత్మహత్య లేఖపై కూడా చర్చిద్దామని సవాల్‌ విసిరారు. మరోవైపు మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష నేత చంద్రబాబును ఉద్దేశిస్తూ పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాగే మరికొందరు సభ్యులు కూడా చంద్రబాబును ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. దీనిపై టీడీపీ సభ్యులు తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి అధికార పార్టీ సభ్యుల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ సభ్యులు కూడా ప్రతి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. చివరకు ప్రతిపక్ష నేతకు మైక్‌ ఇచ్చేందుకు స్పీకర్‌ అనుమతించగా, చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో యోధానుయోధులతో కల్సి పనిచేశానని, కాని ఇంత దారుణ పరిణామాలు ఎన్నడూ చూడలేదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img