Friday, April 26, 2024
Friday, April 26, 2024

అది కౌరవ సభ

నా రాజకీయ జీవితంలో ఇలాంటి పరిణామాలు చూడలేదు
రెండున్నరేళ్లుగా అవమానిస్తున్నా భరించా
ఇప్పుడు నా సతీమణిని కూడా కించపరుస్తున్నారు
సభలో కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు
ఇక సభకు వెళ్లను.. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటా
మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమైన చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : శాసనసభలో శుక్రవారం జరిగిన పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గత రెండున్నర సంవత్సరాలుగా తనను అనేక విధాలుగా అవమానించినా, బూతులు తిట్టినా ప్రజల కోసం భరించానని, కానీ ఈరోజు తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు కన్నీటి పర్యంతమయ్యారు. శాసనసభలో శుక్రవారం వ్యవసాయంపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వ్యక్తిగత దూషణలు చోటు చేసుకున్నాయి. దీనిపై చంద్రబాబు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతుండగానే స్పీకర్‌ మైక్‌ కట్‌ చేశారు. దీంతో నేను ఇక ఈ సభకు రాను. మళ్లీ సీఎంగానే వస్తా.. మీకొక నమస్కారమంటూ గద్గద స్వరంతో సభ నుంచి బయటకొచ్చేశారు. దీంతో మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్‌ చేస్తూ అందరూ బయటకొచ్చారు. అనంతరం చంద్రబాబు నేరుగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో యోధానుయోధులతో కలిసి పనిచేశాను కాని ఇలాంటి గౌరవం లేని కౌరవ సభను చూడలేదన్నారు. తనను ఎంత అవమానించినా భరించానని, కానీ తన సతీమణిని కూడా కించపర్చే వ్యాఖ్యలు చేశారంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నా జీవితంలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని, భరించలేనంత ఇంత బాధ ఎప్పుడూ పడలేదన్నారు. ఆమె నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నా, తాను మూడు సార్లు సీఎంగా పనిచేసినా ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదని, కేవలం ప్రొటోకాల్‌ ఉన్న కార్యక్రమాలకు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే తనతో పాటు వచ్చిందన్నారు. ప్రజల కోసం ఇంటికి రాకుండా ఎంతకాలం పనిచేసినా నా భార్య ప్రోత్సహించిందని తెలిపారు. హుద్‌హుద్‌ సమయంలో విశాఖలో చాలా రోజులున్నా ఉన్నా ఆమె సహకరించిందన్నారు. గతంలో వైఎస్‌ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. దానిపై తాను నిలదీస్తే ఆనాడు వైఎస్‌ తప్పు ఒప్పుకొని క్షమాపణ చెప్పారని గుర్తు చేశారు. జగన్‌ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు.
ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం కూడా తన ప్రవర్తనపై ఆలోచించుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా తాను మాట్లాడుతుండగానే మైక్‌ కట్‌ చేయడం దారుణమన్నారు. నాకు పదవులు అవసరం లేదు. ఇంతకంటే రికార్డులు అవసరం లేదు. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం వ్యవహరిస్తోంది. భవిష్యత్తులోనే నాపై, నా కుటుంబ సభ్యులపై ఇంకా దాడులు కొనసాగుతాయి. ప్రజలపై దౌర్జన్యాలూ పెరుగుతాయి. ధర్మం, అధర్మం మధ్య జరిగే ఈ పోరాటంలో ధర్మాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సభలో ఒకపక్క అవమానిస్తూ, మరోపక్క మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని పరిస్థితుల్లో ఇకపై సభకు హాజరు కానని, ప్రజాక్షేత్రంలో ప్రభుత్వంపై పోరాడుతానని చంద్రబాబు అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img