Friday, April 26, 2024
Friday, April 26, 2024

జలఖడ్గం

చెయ్యేరు ఉధృతికి 12 మంది బలి.. 32 మంది గల్లంతు

జలదిగ్బంధంలో తిరుపతి
తిరుమల రాకపోకలు నిలిపివేత
కడపలో తుపాను బీభత్సం
నిలిచిన రవాణా సౌకర్యం
అనంతపురం, కర్నూలులో నీట మునిగిన పంటలు
నేడు మూడు జిల్లాల్లో సీఎం ఏరియల్‌ సర్వే

విశాలాంధ్ర బ్యూరో`తిరుపతి / కడప / కర్నూలు / అనంతపురం : భారీ వర్షాలు చిత్తూరు జిల్లాను అతలాకుతలం చేశాయి. జనజీవనం స్తంభించింది. జిల్లాలో కురిసిన కుండపోత వర్షానికి 543 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. 700 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 1221 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా ఆగిపోవడంతో అంధకారంగా మారింది. అనేక విద్యుత్‌ సబ్‌స్టేషన్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. 160 చెరువులకు గండ్లు పడ్డాయి. 220 కి.మీ మేరకు వరద ఉధృతికి రహదారులు కోతకు గురయ్యాయి. తిరుపతి రెండు రోజులుగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. నగరం మొత్తం వర్షం నీరు వాగులా ప్రవహిస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోయాయి. నగరంలోని 20 లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆ ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తిరుచానూరు వసుంధర నగర్‌లో రెండంతస్తుల భవనం స్వర్ణముఖి నదిలోకి కూలిపోయింది. తిరుమల ఘాట్‌ రోడ్‌లో కొండచరియలు విరిగి పడడంతో తిరుమల రాకపోకలను నిలిపి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జిల్లాలోనీ జలాశయాలు నిండుకుండలా మారాయి. కళ్యాణి డ్యామ్‌, ఎన్టీఆర్‌ జలాశయం గేట్లను ఎత్తివేశారు. దీంతో చంద్రగిరి మండలంలోని అనేక గ్రామాలు నీటమునిగాయి. ఎన్టీఆర్‌ జలాశయం దిగువ ఉన్న గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బంగారుపాళ్యం మండలం బలిజ పల్లి చెరువు మొరవలో గురువారం రాత్రి నలుగురు మహిళలు గల్లంతు అయ్యారు. శుక్రవారం ఉదయం ఈ ప్రదేశాన్ని పరిశీలించి, గాలింపు చర్యలు కొనసాగించాలని అధికారులను కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. ఓ మహిళ మృతదేహం లభించింది. తిరుపతి లక్ష్మీపురం వద్ద మరో వ్యక్తి గల్లంతయ్యారు. తిరుపతిలో కేంద్రాలు ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నారు. సదుం వద్ద వాగ్గేయ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వందలాది పశువులు నదిలో కొట్టుకు పోయాయి. కళ్యాణి డ్యామ్‌ గేట్లు ఎత్తివేయడంతో పేరూరు, తుమ్మలగుంట చెరువుల నుంచి పెద్ద ఎత్తున నీరు రావడంతో తిరుపతి పరిసరాల ఇళ్లలోకి నీరు చేరింది. జిల్లాలోని ఎనిమిది రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో ఉండడంతో గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. స్వర్ణముఖి నది ఉగ్రరూపం దాల్చింది. నదిలో చిక్కుకొన్న 77 మందిని పోలీసులు సహాయక బృందాలు సురక్షితంగా కాపాడగలిగాయి. తిరుపతిమదనపల్లి, తిరుపతికడప, తిరుపతిపచికాపలం, పడిపేట తదితర ప్రాంతాలకు రాకపోకలు ఆగిపోయాయి. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురవక పోగా నిండిన జలాశయాల నుంచి వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో దిగువ ప్రాంతాల వారికి ముప్పు వాటిల్లింది. జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 113 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 38 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 3178 మంది ఉన్నారు. శుక్రవారం రాత్రి మళ్లీ వర్షాలు పుంజుకోవడంతో జిల్లా వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలపై ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా ప్రద్యుమ్నను నియమించి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. కడప అతలాకుతలం జిల్లాలో తుపాను బీభత్సం సృష్టించింది. చిత్తూరు, కడప జిల్లాల మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి. విద్యుత్‌, రవాణ సదుపాయాలు పూర్తిగా నిలిచిపోయాయి. పెన్నా, కుందూ, పాపాఘ్ని, చిత్రావతి, మాండవ్య నదులతో పాటు అన్నమయ్య, పింఛ, చెయ్యేరు, మైలవరం, గండికోట, రaరికోన, వెలిగల్లు జలశాయాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాజంపేట, రాయచోటి, కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని దాదపు 15 మండలాల్లో పలు గ్రామాలు నీటమునిగాయి. పలు గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిని పెద్ద సంఖ్యలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు విద్యుత్‌, రవాణ, కమ్యూనికేషన్‌ సౌకర్యాలు లేక సతమతమమవుతున్నారు. పెద్ద ఎత్తున పంట పొలాలు దెబ్బతిన్నాయి. కడప - రేణిగుంట మార్గంలోని గుండ్లూరు వద్ద రైల్వే ట్రాక్ట్‌ దెబ్బతింది. దీంతో రాకపోకలు నిలిచి పోయాయి. అన్నమయ్య ఎర్త్‌ డ్యామ్‌ తెగడంలో మన్నూరు పోలీసుస్టేషన్‌ పరధిలోని గుండ్లూరు చెక్‌పోస్ట్‌ వద్ద ప్రధాన రహదారికి సమీపంలోని చెరువు కట్ట తెగిపోయింది. ఈ హఠాత్పరిణామంతో నీటి ఉధృతికి మూడు ఆర్టీసీ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. ప్రయాణికులు బస్సు పైకెక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. గంటపాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్‌లో తాళ్ల సాయంతో నీటిలోకి దిగి రెండు బస్సుల్లోని 30మందిని కాపాడారు. అన్నమయ్య డ్యామ్‌ పరిధిలోనే ఉన్న చెయ్యరు చెరువు ఉధృతికి రెండు గ్రామాలకు చెందిన 12మంది మృతి చెందగా, 32 మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జిల్లాలో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. కడపతోపాటు మూడు జిల్లాలో పర్యటించనున్నారు. అనంతలో కుండపోత భారీ వర్షాలతో అనంతపురం జిల్లా అతలాకుతలమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంట నీటమునగడంతో కోట్లాది రూపాయలు నష్టపోయాయి. రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. మదనపల్లికదిరి, కదిరిరాయచోటి, కదిరిపులివెందుల ప్రాంతాలకు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పుట్టపర్తి వద్ద చిత్రావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో 11 మంది కొట్టుకొని పోతుండగా హెలికాప్టర్‌ సాయంతో అనంత పోలీసులు రక్షించారు. జిల్లాకు దాదాపుగా అన్ని ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.
కర్నూలులో ఎడతెరపిలేని వర్షం
తుపాను కారణంగా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, మంత్రాలయం, డోన్‌, పత్తికొండ ప్రాంతంలో పంటలు నీట మునిగాయి. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు రోజుల నుంచి జిల్లాలో 3611 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో రుద్రవరం, బనగానలపల్లె, కోవెలకుంట్ల, నందికొట్కూరు, జూపాడుబంగ్లా, మిడుతూరు, డోన్‌, పత్తికొండ, పెద్దకడుబూరు మండలాలతోపాటు చాలా మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img