Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

ఆగని అరెస్టులు… బెదిరింపులు

ఉద్యోగులపై ఖాకీల అత్యుత్సాహం
ఉద్యమం వాయిదా వేసినా వేధింపులు
వినాయక చవితికి జైళ్లలో మగ్గేలా కుట్ర
ఉపాధ్యాయ ఎమ్మెల్సీల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఖాకీల దూకుడు తగ్గలేదు. అవే బెదిరింపులు… నిర్బంధాలు… బైండోవర్‌ కేసులు… ఉపాధ్యాయ, ఉద్యోగులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు ఉద్యమం పేరుతో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. సెప్టెంబరు 1న చలో మిలీనియమ్‌ మార్చ్‌ విజయవాడను సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రకటించినా, పోలీసులు వెనక్కి తగ్గడం లేదు. ఇంకా ఉపాధ్యాయులను, పిలుపునిచ్చిన ఉద్యోగ సంఘాల నేతలను అరెస్టు చేస్తూనే ఉన్నారు. వారిపై సెక్షన్‌ 107, 141, 149 పేరుతో బైండోవర్‌ కేసులు నమోదు చేసి, స్థానిక తహశీల్దార్ల ఎదుట ప్రవేశ పెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. వినాయక చవితి పండుగనాడు సైతం జైళ్లలో మగ్గేలా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. చాలా మంది సీపీఎస్‌ ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు తీసుకెళ్లిపోయారు. వారెక్కడ ఉన్నారో అంతు చిక్కడం లేదు. ఈ చర్యలతో అభద్రతా వాతావరణాన్ని పోలీసులు సృష్టిస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అధ్వర్యంలో 15 మంది ఉపాధ్యాయులను తహసీల్దార్‌ వేణుగోపాల్‌ ముందు ప్రవేశ పెట్టారు. హిందువులు పవిత్రంగా భావించే వినాయక చవితి పండుగ ఉందని, అవసరమైతే సెప్టెంబర్‌ 1న వస్తామని విజ్ఞప్తి చేసినా పోలీసులు మొండిగా వ్యవహరిస్తున్నారు. వివిధ జిల్లాల్లో ఉపాధ్యాయుల వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు, కార్లను సీజ్‌ చేసి, నిర్బంధాల పర్వం కొనసాగిస్తున్నారు. వారం రోజుల నుంచి ఉపాధ్యాయులను సమీప స్టేషన్లకు పిలిపించుకుని వారికి నోటీసులు జారీజేశారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు, నిర్బంధాలు పెట్టినప్పటికీ, సీపీఎస్‌ రద్దు చేసేంత వరకు తమ పోరాటం ఆగబోదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ఉపాధ్యాయుల పై బైండోవర్‌ కేసులు పెట్టడంపై ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీలు మండిపడ్డారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ, రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డికి ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, కేఎస్‌ లక్ష్మణరావు, విఠపు బాలసుబ్రహ్మణ్యం బృందం వినతిపత్రం అందజేసింది. తక్షణమే ఉపాధ్యాయుల అరెస్టులు, నిర్బంధాలను ఆపాలంటూ డిమాండ్‌ చేసింది. సాధారణ ఉపాధ్యాయులను పోలీస్‌ స్టేషన్‌లకు పిలిపించి వేధించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము సీపీఎస్‌ రద్దు కోసం నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. ఉద్యోగుల పై బెదిరింపులు, వేధింపులు ఆపాలని, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పోలీసుల చర్యలను ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న తీవ్రంగా ఖండిరచారు. సీపీఎస్‌ రద్దు కోసం సెప్టెంబరు 1న రాష్ట్ర వ్యాప్తంగా నల్ల ఫ్లక్సీలు, నల్ల బ్యాడ్జీలు, నల్ల దుస్తులతో నిరసనకు దిగాలని ఎస్టీయూ పిలుపునిచ్చింది. కాగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అరెస్టులను కార్మిక సంఘాల ఐక్య వేదిక నేతలు తీవ్రంగా ఖండిరచారు.
వాయిదా వేసినా… అరెస్టులు బాధాకరం: ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌
రాష్ట్రంలో శాంతిభద్రత రీత్యా చలో విజయవాడను వాయిదా వేసుకున్నప్పటికీ, సీపీఎస్‌ ఉద్యోగులను ఇంకా అరెస్టులు చేయడాన్ని ఏపీ సీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు అప్పలరాజు ఖండిరచారు. చలో విజయవాడను వాయిదా వేసుకున్నట్లు ఈనెల 29వ తేదీన తాము ప్రకటించామని గుర్తుచేశారు. పోలీసుల అనుమతి లేకుండా చలో విజయవాడ నిర్వహించబోమని డీజీపీకి హామీ ఇస్తున్నామన్నారు. పోలీసులు తీసుకెళ్లిన సీపీఎస్‌ ఉద్యోగులను తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఉద్యోగులపై ఎక్కడికక్కడే బైండోవర్లు చేసి పోలీసు స్టేషన్లకు తీసుకెళ్లడాన్ని విడనాడాలన్నారు. ప్రతి ఏటా సెప్టెంబరు 1న చీకటి దినగా సీపీఎస్‌ ఉద్యోగులు నిర్వహించుకుంటారని వివరించారు.
ఉద్యోగులపై వేధింపులు ఆపాలి: చంద్రబాబు
సీపీఎస్‌ ఉద్యోగుల పై వేధింపులు, కేసులు ఆపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఉద్యోగుల పై బైండోవర్‌ కేసులు, వేధింపులు నిలిపివేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు చేసి, పాత పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎస్‌) తిరిగి ప్రారంభిస్తానని సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో వాగ్దానమిచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తానని జగన్‌ ప్రకటించారని, ప్రభుత్వం వచ్చి మూడేళ్లు గడిచినా హామీ నెరవేరలేదన్నారు. అందుకే ఉద్యోగులు నిరసనల బాట పట్టారని, శాంతియుత నిరసనలు ఉద్యోగులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని పేర్కొన్నారు. సీఎం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చని కారణంగానే ఉద్యోగులు నిరసనల బాట పట్టాల్సి వచ్చిందన్నారు. శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చిన ఉద్యోగుల పై పోలీసులను ప్రభుత్వం ఉపయోగించి బైండోవర్‌ కేసులు, నోటీసులు, పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించడం తదితర రకరకాల చర్యలతో వారిని వేధింపులకు గురి చేసిందన్నారు. ఉద్యోగులు తమ శాంతియుత నిరసనను సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 11వ తేదీకి వాయిదా వేసినప్పటికీ పోలీసుల బెదిరింపులు, వేధింపులు కొనసాగడాన్ని ఖండిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img