Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆలస్యంలేదు…రెండ్రోజుల్లో వానలే వానలు

న్యూదిల్లీ: నైరుతి రుతుపవనాలు సాధారణంగానే పురోగమిస్తున్నాయి… రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రను తాకుతాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడిరచింది. మే 31- జూన్‌`7 మధ్య దక్షిణ, మధ్య అరేబియా మహాసముద్రం, కేరళ మొత్తం సహా కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ సీనియర్‌శాస్త్రవేత్త ఆర్కే జెనామణి తెలిపారు. ఇదే సమయంలో ఈశాన్య భారతదేశం మొత్తం మంచి వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. ‘రుతుపవనాల రాకలో ఎలాంటి జాప్యం లేదు. రాబోయే రెండు రోజుల్లో మహారాష్ట్రలోకి ప్రవేశిస్తాయి. తర్వాత రెండు రోజుల్లో ముంబైలోనూ వర్షాలు పడొచ్చు’ అని జెనామణి స్పష్టం చేశారు. ఈసారి నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో వర్షాలు బాగా కురుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరో రెండు రోజుల్లో బలమైన గాలులు వీయడం, మేఘాలు దట్టంగా కమ్ముకోవడం చూస్తామని పేర్కొన్నారు. గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో రుతుపవనాల్లో పురోగతి కనిపిస్తుందని ఆయన అంచనా వేశారు. నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్తముందే పలకరించాయి. సాధారణంగా జూన్‌ ఒకటిన కేరళలో ప్రవేశించే నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే వచ్చేశాయని ఐఎండీ తెలిపింది. మే 29న కేరళను రుతుపవనాలు తాకినట్లు వాతావరణ విభాగ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర తెలిపారు. అక్కడే స్థిరంగా ఉండి 4 రోజులకు కర్ణాటక, తమిళనాడును తాకాయని పేర్కొన్నారు.
15 వరకు దిల్లీకి వేడి నుంచి ఉపశమనం లేదు
దేశ రాజధాని దిల్లీ -ఎన్‌సిఆర్‌, వాయువ్య భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత వారాంతంలో కొన్ని పాయింట్లు తగ్గుతుంది కానీ జూన్‌ 15 వరకు వేడి నుంచి పెద్ద ఉపశమనం లభించే అవకాశం లేదని ఐఎండీ స్పష్టం చేసింది. తేమతో కూడిన తూర్పు గాలులు జూన్‌ 16 నుంచి ఈ ప్రాంతంలో గణనీయంగా ఉపశమనం కలిగిస్తాయని పేర్కొంది. ‘గురువారం వాయువ్య, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఉష్ణోగ్రతలో పెరుగుదల అంచనా వేయబడలేదు’ అని సీనియర్‌ శాస్త్రవేత్త ఆర్కే జెనామణి చెప్పారు. పశ్చిమ వడ గాలుల తాకిడి కారణంగా జూన్‌ 2 నుండి వాయువ్య, మధ్య భారతమంతటా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ‘ఏప్రిల్‌ చివరి వారం, మేలో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఇప్పుడు కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు తక్కువ తీవ్రతను కలిగి ఉన్నాయి. అయితే ప్రభావ ప్రాంతం దాదాపు సమానంగా ఉంటుంది’ అని ఆయన వివరించారు. జూన్‌ 12 నుంచి తూర్పు మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ముందస్తు రుతుపవనాలతో వాతావరణం చల్లబడనుంది. అయితే ఉత్తర రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణా, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తర ప్రాంతాలలో జూన్‌ 15 వరకు సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. ‘దిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో జూన్‌ 11-12 తేదీలలో ఉష్ణోగ్రతల నుంచి స్వల్ప ఉపశమనం ఉన్నప్పటికీ వారాంతంలో మేఘావృతమైన వాతావరణం ఉంటుంది కానీ వర్షాలు కురిసే అవకాశం లేదు’ జెనామణి అన్నారు. జూన్‌ 15 వరకు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌, 43 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదుకానుంది. ఈ ప్రాంతాల్లో జూన్‌ 16 నుండి తేమతో కూడిన తూర్పు గాలుల కారణంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసి, వేడి నుండి ఉపశమనం కలుగుతుందని ఆయన చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img