Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఆ ఆరోపణలు సరికాదు

ముంద్రా పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌తో మనకేం సంబంధం
డీజీపీ గౌతం సవాంగ్‌

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ముంద్రా పోర్టులో పట్టుబడిన హెరాయిన్‌తో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని ఎన్నిసార్లు స్పష్టంగా చెప్పినా నిరాధార ఆరోపణలు చేయడం తగదని డీజీపీ గౌతం సవాంగ్‌ అన్నారు. డీజీపీ హెడ్‌ క్వార్టర్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టుబడ్డ హెరాయిన్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయని, మేం కూడా ఆ సంస్థలతో టచ్‌లో ఉన్నామని తెలిపారు. అయితే ఈ వాస్తవాన్ని గుర్తించకుండా కొన్ని రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రం పరువు పోయేలా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ప్రజల్లో, యువతలో లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. ఈ తరహా విమర్శల వల్ల రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తోంది. అందుకే కొంతమందికి నోటీసులు జారీ చేస్తున్నామని తెలిపారు. ఎన్‌ఐఏ వాళ్లే కాకుండా మరికొన్ని దర్యాప్తు సంస్థలు కూడా వచ్చి విచారణ చేసుకుంటే తప్పేంటని డీజీపీ ప్రశ్నించారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇకనైనా ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. అనంతరం కౌంటర్‌ టెర్రరిస్ట్‌ ఆర్గనైజేషన్‌ 7వ జాతీయ స్థాయి ఈవెంట్‌లో మొదటి స్థానం సాధించిన ఏపీ అక్టోపస్‌ బలగాలను డీజీపీ అభినందించారు. ఏపీ పోలీసులకు, ప్రజలకు ఇది గర్వించదగ్గ రోజుగా పేర్కొన్నారు. మన గ్రేహౌండ్స్‌ బలగాలు మంచి మంచి ప్రతిభ కనబరుస్తున్నాయని, అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇకపై జిల్లా కేంద్రాల్లో సైతం అక్టోపస్‌ బలగాలు సేవలు అందించనున్నట్లు తెలిపారు. గ్రేహౌండ్స్‌, అక్టోపస్‌ బలగాలను ఇచ్చేందుకు కేంద్రం సహకరిస్తుందని, నైట్‌ ఫైరింగ్‌ విషయంలో ఏపీ అక్టోపస్‌ అత్యుత్తమ శిక్షణ ఇస్తోందని తెలిపారు. రాష్ట్రంలో వివిధ ర్యాంకుల్లో మొత్తం 500 మంది అక్టోపస్‌ ఆఫీసర్లు ఉన్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img