Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇంకెంత కాలం మోసం..

మోదీ 10 లక్షల ఉద్యోగాల ప్రకటనపై కాంగ్రెస్‌ ప్రశ్న
న్యూదిల్లీ: రానున్న ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడాన్ని కాంగ్రెస్‌ ఎద్దేవా చేసింది. ఇంకెంతకాలం ప్రజలను మోసగిస్తారని ప్రశ్నించింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, ఆ హామీ ప్రకారం గడచిన 8 ఏళ్లలో 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని కాంగ్రెస్‌ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా పేర్కొన్నారు. ‘ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ లెక్కన ఇప్పటికి 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడేమో..2024 నాటికి 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో 60 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలోనే 30 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మోసపూరిత మాటలు, ప్రకటనలు, హామీలు ఇంకెంతకాలం కొనసాగిస్తారు?’ అని సూర్జేవాలా ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగం పెరగడం, కొత్త ఉద్యోగ కల్పన లేకపోవడంపై కాంగ్రెస్‌ చాలాకాలంగా మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తోంది. వచ్చే ఏడాదిన్నర కాలంలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల నియామకాలు చేపట్టాలని వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖలను ప్రధాని మంగళవారం ఆదేశించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వశాఖల్లో మానవవనరుల పరిస్థితిపై సమీక్షించిన అనంతరం మోదీ ఈ ఆదేశాలు ఇచ్చారు. నిరుద్యోగంపై ప్రతిపక్షం పదేపదే విమర్శలు చేయడాన్ని కూడా ప్రధాని దృష్టిలో పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img