Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇక తేల్చుకుంటా: సిద్ధూ

చండీగఢ్‌: తనపై క్రమశిక్షణా చర్యలకు సంబంధించి సమాధానం చెప్పే సమయం ఇప్పుడొచ్చిందని పంజాబ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ వ్యాఖ్యానించారు. సిద్ధూపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి హరీశ్‌ చౌదరి కోరిన కొన్ని రోజుల తర్వాత ఆయన ట్విట్టర్‌ వేదికగా బుధవారం స్పందించారు. సిద్ధూ ట్వీట్‌ గందరగోళంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి హరీశ్‌ చౌదరి రాసిన లేఖకు సమాధానంగానే కనిపిస్తోంది. సిద్ధూ పార్టీకి అతీతుడిగా తనను తాను ఊహించుకుంటున్నాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలని సోనియాకు చౌదరి లేఖ రాసిన విషయం విదితమే. తనకు వ్యతిరేకంగా తరచూ మాట్లాడటాన్ని మౌనంగా వింటున్నానని, సమాధానం చెప్పే సమయం తనకు ఇప్పుడు వచ్చిందని సిద్ధూ హిందీలో ట్వీట్‌ చేశారు. సిద్ధూకు వ్యతిరేకంగా ఏప్రిల్‌ 23న సోనియాకు చౌదరి లేఖ రాశారు. ఆ లేఖ సోమవారం వెలుగుచూసింది. మౌనంగా ఉండాలని ఎన్నిసార్లు చెప్పినా గత కాంగ్రెస్‌ ప్రభుత్వంపై సిద్ధూ తరచూ విమర్శలు చేస్తున్నారని చౌదరి తెలిపారు. పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా అమరేందర్‌సింగ్‌ రాజా బాధ్యతలు చేపట్టిన రోజు సిద్ధూ పార్టీ కార్యాలయానికి వచ్చినప్పటికీ వేదికపైకి రాకుండా ఇతర నాయకులతో కలిసి కిందే కూర్చున్నారని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను క్షమించలేమని చౌదరి స్పష్టంచేశారు. సిద్ధూ రాష్ట్రంలో సమాంతర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, మాజీ ఎమ్మెల్యేలు సూర్జిత్‌సింగ్‌ ధిమన్‌, కెవాల్‌ ధిల్లాన్‌ సహా బహిష్కృత నేతలతో నిరంతరం భేటీ అవుతున్నారని ఫిర్యాదు చేశారు. తాజాగా బీహారు నుంచి తాను రాజకీయాలు ప్రారంభిస్తానని ప్రకటన చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కి శుభాకాంక్షలు తెలిపారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img