Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇతర రాష్ట్రాల్లోనూ ఈహెచ్‌ఎస్‌ సేవలు

ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట

aవిశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు జగన్‌ సర్కార్‌ తీపి కబురు అందించింది. ఆరోగ్యశ్రీ తరహాలోనే ప్రభుత్వ ఉద్యోగుల ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కార్డులపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యసేవలు పొందేందుకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈహెచ్‌ఎస్‌ వైద్య సేవలకు సంబంధించి ఉద్యోగ సంఘాలు చాలాకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఆమేరకు ఈ ఏడాది ఫిబ్రవరి 16న దీనిపై ప్రభుత్వం రాష్ట్రస్థాయి స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ నిర్ణయంలో తీవ్ర జాప్యం జరిగింది. ఆతర్వాత ఉద్యోగులు ప్రభుత్వానికి దిగ్భ్రాంతి కల్గించే రీతిలో విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించడంతో ప్రభుత్వంలో మరలా కదలిక వచ్చింది.
గత నెల 26న మంత్రుల ఉపసంఘం దీనిపై ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలతో చర్చలు జరిపి, వారి డిమాండ్లకు ఆమోదం తెలిపింది. ఆ మేరకు 203 జీవో విడుదల చేసింది. ఉద్యోగుల ఆరోగ్య బీమా కింద ఇప్పటివరకు అమలుకు నోచుకోని దాదాపు 565 వైద్య విధానాలను ఇకపై వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈహెచ్‌ఎస్‌ ద్వారా వైద్యం చేసిన బిల్లులను ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల వ్యవధిలోనే ఆటోడెబిట్‌ స్కీమ్‌ ద్వారా చెల్లింపులకు అంగీకారం తెలిపింది. దీంతో ఉద్యోగుల ఆరోగ్య బిల్లుల్ని వెంటనే చెల్లించేందుకు వీలు కలుగుతుంది. ఆస్పత్రులు కూడా ఉద్యోగులకు పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు అవకాశం దొరుకుతుంది. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు ఇస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇతర రాష్ట్రాల్లో ఈహెచ్‌ఎస్‌ కార్డుపై వైద్య సేవలు పొందేందుకు వీలుగా అనుమతి ఇచ్చారు.
ఉద్యోగ సంఘాల హర్షం

ఈహెచ్‌ఎస్‌ కార్డులపై ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యసేవలు పొందేందుకు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సుదీర్ఘకాలంగా ఈహెచ్‌ఎస్‌ అమల్లో ఉద్యోగులకు ఎదురవుతున్న సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు ముద్దాడ రవిచంద్ర, ఎంటీ కృష్ణబాబుకు ఏపీ అమరావతి జేఏసీ నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావు తదితరులు కృతజ్ఞతలు తెలియజేశారు. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మరో ఏడాది పొడిగించేందుకు వీలుగా త్వరలోనే ఉత్తర్వులు జారీ కానున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img