Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పాదయాత్రపై పోలీసు కర్కశం

ప్రదర్శకులపై లాఠీలు

. అనేకమందికి గాయాలు బ కార్మిక నాయకుల అరెస్టు
. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విరమించాల్సిందే
. అఖిలపక్ష ఉక్కు పోరాట కమిటీ నేతల డిమాండ్‌
. ప్రధానికి నిరసన సెగ తప్పదని స్పష్టీకరణ

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ… అఖిలపక్ష ఉక్కు పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ… వందలాదిమంది ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు విశాఖలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రదర్శనను మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది.

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ… అఖిలపక్ష ఉక్కు పోరాట కమిటీ చేపట్టిన ఉద్యమం ఉధృతరూపం దాల్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ రానున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ… వందలాదిమంది ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగులు విశాఖలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అయితే ప్రదర్శనను మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. విచక్షణారహితంగా లాఠీలను రaుళిపించిన పోలీసులు కార్మిక నేతలను బలవంతంగా ఈడ్చుకెళ్లి అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. అఖిలపక్ష పోరాట కమిటీ నాయకులు బుధవారం స్టీల్‌ ప్లాంట్‌ నిరసన దీక్ష శిబిరం నుంచి శాంతియుత ప్రదర్శన తలపెట్టారు. తొలుత బైక్‌ ర్యాలీ నిర్వహించాలని భావించినప్పటికీ అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దీంతో కాలి నడక ద్వారా అయినా నగరంలో ఉన్న జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు వెళతామని పోరాట కమిటీ నేతలు బయలుదేరడంతో వందలాదిమంది ఉద్యోగులు, కార్మికులు వారి వెంట నడిచారు. సరిగ్గా గాజువాక పోలీస్‌ స్టేషన్‌ జంక్షన్‌ వద్ద చేరుకోగానే వందలాది మంది పోలీసులు ప్రదర్శనను అడ్డుకున్నారు. వివక్షణారహితంగా లాటీలు రaుళిపిస్తూ… అనేకమంది పోరాట కమిటీ నాయకులను పోలీసు వాహనాల్లో ఎత్తిపడేశారు. దొరికిన వారిని దొరికినట్లు అరెస్టులు చేశారు. అందర్నీ గాజువాక పోలీస్‌ స్టేషన్‌ లో రోజంతా నిర్బంధించారు. పోరాట కమిటీ నాయకులు రామారావు కాలుకు గాయమైంది. మరి కొంతమంది ఉద్యోగులకు కూడా గాయాలయ్యాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్లు ఆదినారాయణ (ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు), మంత్రి రాజశేఖర్‌ (ఐఎన్‌టీయుసి జాతీయ నాయకుడు) కో కన్వీనర్‌ జె.అయోధ్యరాం (స్టీల్‌ సిఐటియు అధ్యక్షుడు) 68 వార్డు కార్పొరేటర్‌ బి.గంగారావు, కె.సత్యనారాయణ రావు, రామకృష్ణ, వరహాల శ్రీనువాసు రావు, డీవీ రమణారెడ్డి, నీరుకొండ రామచంద్రరావు, వైటి దాస్‌, ఎం రామారావు లతోపాటు దాదాపు 500 మంది విశాఖ ఉక్కు పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు
విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఈనెల 12న జరిగే సభలో పాల్గొంటున్న ప్రధాని నరేంద్రమోదీ విశాఖ ఉక్కు ప్రైవేటేకరణ నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించాలని కోరుతూ తలపెట్టిన తమ ప్రదర్శనను అడ్డుకోవడం అన్యాయమని పోరాట కమిటీ నేతలు మండిపడ్డారు. ప్రాణ త్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుంటే తామెలా ఊరుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ను ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులతో తమ ఉక్కు పోరాటాన్ని ఆపలేరన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ ఉద్యమాన్ని ప్రధాని దృష్టిలో పడకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అడ్డుకోవడం దారుణమన్నారు. ప్రధా మోదీచేత విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రకటన చేయించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పోరాట కమిటీ నేతలు కోరారు. గత 636 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం అన్యాయమని మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడేందుకు ప్రధానమంత్రి పర్యటన రోజు కూడా నిరసన మార్చ్‌ చేస్తామని స్పష్టం చేశారు. అనేక త్యాగాలతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను వ్యూహాత్మక విక్రమం పేరిట కేంద్రంలోని బీజేపీ పూర్తిగా అమ్మకానికి పెట్టిందని, ఈద్రోహ పూరిత చర్యకు నిరసనగా గత 635 రోజుల నుండి ఉద్యమం జరుగుతోందన్నారు. స్టీల్‌ప్లాంటు కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజానీకం ఈ ఉద్యమంలో భాగస్వాములుగా వున్నారని, అయినా కేంద్రప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష రాజకీయ పార్టీలను ప్రధాని వద్దకు తీసుకుపోయి ఒత్తిడి చేసి ప్రయివేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేయాలని రాష్ట్ర ప్రజలు ఆశిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు ప్రధానమంత్రే విశాఖ వస్తున్నందున ఇప్పటికైనా స్టీల్‌ప్లాంటు అమ్మకం ఆపించే ప్రకటన ప్రధాని ద్వారా ముఖ్యమంత్రి చేయించాలని, ఇది ఒక సదవకాశం అని తెలిపారు. అఖిలపక్ష పార్టీలను, కార్మిక, ప్రజా సంఘాల నాయకులను ప్రధాని వద్దకు తీసుకువెళ్లి ఒత్తిడి పెంచాల్సిన రాష్ట్ర ప్రభుత్వం… దీనికి భిన్నంగా కార్మికోద్యమాన్ని అణగదొక్కుతోందన్నారు.
పోలీస్‌ నిర్బంధాన్ని ఛేదించుకుంటూ నిరసన
మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనను నిరసిస్తూ అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టాయి. రైల్వే డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన తలపెట్టాయి. కాగా పోలీసులు ఈ ప్రదర్శనను అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈస్ట్‌ ఏసీపీ హర్షిత చంద్ర, సీఐలు వెంకట్రావు, సోమశేఖర్‌, శ్రీనివాస్‌ నేతృత్వంలో పోలీస్‌ బలగాలు ప్రదర్శన అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. అయినా పెద్ద ఎత్తున కార్మికులు, ప్రజలు జాతీయ రహదారిపై తరలివచ్చారు.
పోలీస్‌ నిర్బంధాన్ని ఛేదించుకుంటూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు నిరసన ప్రదర్శన చేపట్టి, అనంతరం అక్కడ సభ నిర్వహించారు. పోరాటాలు చేసి సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. అరుణోదయ ప్రజానాట్యమండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు పడాల రమణ, నాయకులు రెహమాన్‌, మన్మథరావు, కోట సత్తిబాబు, నగర సీఐటీయూ నాయకులు జగ్గునాయుడు, కుమార్‌, శ్రామిక మహిళా రాష్ట్ర నాయకురాలు మని, ఐద్వా నాయకులు పద్మ, సత్యవతి, మాజీ కార్పొరేటర్‌ ఈశ్వరమ్మ, ఇఫ్టు నాయకులు కొండయ్య, పీవోడబ్ల్యు నాయకురాలు లక్ష్మి, అరుణోదయ నాయకురాలు నిర్మల, ప్రజానాట్యమండలి నాయకులు చంటీ, ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ నాయకులు నాగభూషణం, జీవియంసి యూనియన్‌ నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img