Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉద్యోగుల సమస్యలపై ఏకతాటిపైకి

ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి

విశాలాంధ్ర`విజయవాడ (గాంధీనగర్‌) : ఇప్పటి వరకు వేర్వేరుగా ఆందోళనలు చేస్తున్న రెండు ప్రధాన జేఏసీలు ఏకతాటిపైకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వంతో తాడేపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. అందుకోసం ఏపీ జేఏసీ. ఏపీ జేఏసీ అమరావతి ఒకే వేదికను పంచుకున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల బకాయిలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అందుకోసమే తమ రెండు జేఏసీలు ఏకతాటిపైకి వచ్చాయని ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రెండు జేఏసీలు ఉద్యోగుల సమస్యలపై అవగాహనతో అంశాల వారీగా ముందుకు సాగుతాయని చెప్పారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదన్నారు. పెన్షన్లు అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఏ బకాయిలు, పీఆర్సీ పెండిరగ్‌లో ఉన్నాయని, వీటిపై సీఎస్‌తో చర్చిస్తామన్నారు. సానుకూల నిర్ణయం రాకపోతే ఉమ్మడి సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఉద్యోగులు కరోనాతో మరణిస్తే మట్టి ఖర్చులకు కూడా నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఒకలాగా, ఖర్చులు మరోలా చేస్తున్నారని విమర్శించారు. 11వ పీఆర్సీ 39 నెలలుగా పెండిరగ్‌లో ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల పట్ల ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు ఆయనను పక్కదోవ పట్టిస్తున్నారని, దీనివలన ఉద్యోగులు నష్టపోతున్నారన్నారు. ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందించి కరువుభత్యం బకాయిలు చెల్లించడానికి అంగీకరించి ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఇంతవరకూ చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారన్నారు. డీఏ బకాయిలు విడుదల చేయకపోవడం వలన పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. వారం రోజులలోపు సీపీయస్‌ రద్దు చేస్తామన్న హామీని అమలు చేయాలన్నారు.
రెండు జేఏసీల నాయకులు జి.హృదయరాజు, వైవీ రావు, ఏపీ ఎన్‌జీవో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి, ఫ్యాప్టో చైర్మన్‌ సీహెచ్‌ జోసెఫ్‌ సుధీర్‌బాబు, హెడ్‌మాస్టర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, నాయకులు కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, సీతారామరాజు, కె.భానుమూర్తి, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img