Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎందుకీ నిర్లక్ష్యం?

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల అస్వస్థతకు కారణమేమిటి?
. చాలీచాలని వైద్య సిబ్బందితో సేవలు ఎలా?
. మరో 30 మంది విద్యార్థులకు తీవ్రమైన కడుపు నొప్పి
. అయినా క్యాంపస్‌లోనే వైద్యం బ కలుషితమైంది నీరా, ఆహారమా…

విశాలాంధ్ర`ఎచ్చెర్ల: శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ నిర్లక్ష్యపు నీడలో ఉంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని ఎస్‌ఎం పురం కొండ పై ఉన్న ఈ క్యాంపస్‌లోని అనేక మంది విద్యార్థులు రెండు, మూడు రోజులుగా కడుపునొప్పి, వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తొలుత గురువారం కొంతమంది విద్యార్థులకు కడుపునొప్పి రావడంతో క్యాంపస్‌లోనే ప్రాథమిక వైద్యం అందించారు. మళ్లీ శుక్రవారం కూడా మరికొంతమంది విద్యార్థులు ఇదే లక్షణాలతో ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడంతో ఆందోళన చెలరేగింది. శనివారం ఉదయం మరో 30 మంది విద్యార్థులు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ నీరసించిపోయారు. కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లి నడవడానికి కూడా వీల్లేని పరిస్థితిలో ఇబ్బంది పడ్డారు. అయితే క్యాంపస్‌ అధికారులు ఈ విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. ఇంత జరుగుతున్నా విద్యార్థులకు ఇదే క్యాంపస్‌లోనే వైద్యం అందించడం అనేక విమర్శలకు తావిచ్చింది. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడే విధంగా వ్యవహరించే ట్రిపుల్‌ ఐటీ అధికారుల చర్యలను అందరూ తప్పు పడుతున్నారు.
4,200 మంది విద్యార్థులకు ఒకే వైద్యురాలు
ఇక్కడ క్యాంపస్‌లో పీయూసీ రెండేళ్లు, ఇంజినీరింగ్‌ 1, 2 సంవత్సరాల విద్యార్థులు కలుపుకొని మొత్తం 4,200 మంది విద్యార్థులు ఉన్నారు. ఇంతమంది విద్యార్థులకు ఒకే ఒక వైద్యురాలు ఉండడం గమనార్హం. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నచోట ఒక్కరితోనే వైద్యం ఎలా అందిస్తున్నారో ట్రిపుల్‌ ఐటి అధికారులకే ఎరుక. అత్యవసర సమయాల్లో వైద్యం మృగ్యమేనని దీనిని బట్టి అర్థమవుతోంది. అది కూడా క్యాంపస్‌లో రెసిడెంట్‌ డాక్టర్‌ కూడా లేకపోవడం శోచనీయం. వైద్య సిబ్బంది (ఏఎన్‌ఎం, నర్సులు) తోనే వైద్య సేవలు అందించడం ఎంతవరకు సబబు అని అనేక మంది ప్రశ్నిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా వైద్యులను నియమించక పోవడాన్ని ట్రిపుల్‌ ఐటీ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఆర్జీయూకేటి చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి క్యాంపస్‌ను శుక్రవారం సందర్శించినప్పటికీ విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని ఆయనకు చెప్పకుండా గోప్యంగా ఉంచారన్న విషయం ఇప్పుడు గుప్పుమంది.
అసలు విద్యార్థుల అస్వస్థతకు కారణాలు ఏమిటో?
ట్రిపుల్‌ ఐటీలో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడం జిల్లాలో పెద్ద సంచలనమైంది. ఈ విషయాన్ని ట్రిపుల్‌ ఐటీ అధికారులు ఎంత గోప్యంగా ఉంచాలనుకున్న ఈ విషయం శనివారం పత్రికల్లో ప్రచురితం కావడంతో జిల్లా యంత్రాంగం తీవ్రంగా స్పందించింది. జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లట్కర్‌, ఆర్డీవో బి.శాంతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.మీనాక్షి, తహశీల్దార్‌ టి.సత్యనారాయణ, ఎచ్చెర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ వి.కిషోర్‌ కుమార్‌ తదితరులు ఇక్కడ క్యాంపస్‌ ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్యాంపస్‌లో వైద్యులు, రెవెన్యూ అధికారులు ఉంటుండగానే కొంతమంది విద్యార్థులు తీవ్రమైన కడుపునొప్పితో విలవిల్లాడిపోవడం కనిపించింది. పరిస్థితి విషమించకుండా నలుగురు విద్యార్థులను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఇంకా 30 మంది విద్యార్థులకు క్యాంపస్‌లోనే వైద్యం అందిస్తున్నారు. విద్యార్థుల అస్వస్థతకు కారణం ఏమిటన్నది అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. మూడు రోజులుగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నప్పటికీ, దీనికిగల కారణాన్ని గుర్తించలేకపోయారు. నీటి కాలుష్యమా? లేదా ఆహారం ఏమైనా కలుషితమైందా? అనే కోణంలో పరీక్షలు నిర్వహించనున్నారు. కొంతమంది విద్యార్థులు చపాతీ తినడం వల్ల, గుడ్లు తీసుకోవడం వల్ల ఈ విధంగా జరిగిందేమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్యాంపస్‌లో బాలురకు, బాలికలకు వేరువేరుగా నిర్వహిస్తున్న రెండు మెస్‌ల్లో కూడా ఆహారం తీసుకున్న విద్యార్థులకు ఈ విధంగా జరగడంతో కారణాన్ని ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.
ట్రిపుల్‌ ఐటీని సందర్శించిన కలెక్టర్‌
ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ను కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లట్కర్‌ శనివారం సందర్శించారు. తరగతి గదులను, మెస్‌, హాస్టల్‌ గదులను ఆయన పరిశీలించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. ఆహారం కలుషితమైందేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందిస్తామని, ఈ విషయంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలను ట్రిపుల్‌ ఐటీ అధికారులు అన్వేషించి నిర్లక్ష్యానికి బాధ్యులను గుర్తించాలన్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంతవరకు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తామని కలెక్టర్‌ చెప్పారు. కాగా అంతమంది విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావును డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.మీనాక్షి ప్రశ్నించారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది అనారోగ్యానికి గురయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యులకు తెలియజేసి వారి సాయాన్ని తీసుకోవాలన్నారు. క్యాంపస్‌లో శుక్రవారం సాయంత్రం కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం అందించామని శ్రీకాకుళం క్యాంపస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు తెలిపారు. అస్వస్థతకు గల కారణాలను అన్వేషిస్తున్నామని, కొంతమంది విద్యార్థులకు స్థానికంగా సేవలు అందించినట్లు చెప్పారు. మరికొంతమందిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం విచారకరమని, ఇందుకు గల కారణాలను గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌, ప్రొఫెసర్‌ కె.సి.రెడ్డి తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img