Friday, April 26, 2024
Friday, April 26, 2024

కిలో @ 150..!

ఆకాశాన్నంటిన టమాటా ధర
తెలుగు రాష్ట్రాల్లో రూ.100 దాటేసిన వైనం
అధిక వర్షాలతో దెబ్బతిన్న పంట
ధర ఉన్నా దిగుబడి లేక నిరాశలో రైతన్న

విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. నిత్యావసర వస్తువులకు తోడు కూరగాయలు ధరలు సైతం భారీగా పెరిగిపోవడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు. కూరగాయలు ఏం కొనాలన్నా కిలో రూ.60 పైనే పలుకుతోంది. టమాటా ధరలు కూడా వంద రూపాయలు దాటేశాయి. ఇటీవల సెంచరీ కొట్టిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గడం ద్వారా సామాన్యులకు కొంత ఉపశమనం కలిగినప్పటికీ టమాటా ధరలు మాత్రం ఆల్‌టైం రికార్డును బ్రేక్‌ చేస్తున్నాయి. సాధారణంగా శీతాకాలంలో కేజీ రూ.20 నుంచి 30 మధ్య ఉండే టమాటా ధర ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో రూ.100 దాటేసింది. హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతోంది. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో టమాటా ధర ఏకంగా రూ.140కు చేరింది. నవంబర్‌ నెల మొదట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉంది. అయితే కేవలం 20 రోజుల్లోనే టమాటా రేటు ఆకాశాన్నంటింది. దీనికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో ఏటా లక్షా 43 వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అందులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనే పండుతుంది. అయితే ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట తీవ్రంగా దెబ్బతినడం, రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, వంతెనలు ధ్వంసం కావడంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొంటున్నారు. దీంతోపాటు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. దీంతో మార్కెట్‌లో టమాటాలకు డిమాండ్‌ మరింత పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మరో నెల రోజుల వరకు ధర తగ్గడం కష్టమంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు వస్తున్న టమాటా మహారాష్ట్రలోని సోలాపూర్‌, కర్ణాటకలోని చిక్‌బల్లాపూర్‌, ఛత్తీస్‌గడ్‌లోని అనేక ప్రాంతాల నుంచి మాత్రమే వస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో తగ్గిన సాగు
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : టమాటా పంటను జిల్లాలోని పత్తికొండ, ఆలూరు నియోజకవర్గంలో అధికంగా పండిస్తారు. ఖరీఫ్‌లో సుమారు 60 వేల ఎకరాల్లో టమాటాను రైతులు సాగు చేస్తారు. ఖరీఫ్‌లో పెద్దఎత్తున టమాటా పత్తికొండ, ప్యాపిలి మార్కెట్‌కు దిగుబడి తరలివస్తుంది. అక్కడ నుండి ముంబై, హైదరాబాద్‌ తదితర పట్టణాలకు తరలి వెళుతుంది. ఖరీఫ్‌లో టమాటాను సాగు చేసిన సమయంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు పంటను రోడ్లపై పోసి నిరసనలు తెలియచేయడంతోపాటు కనీసం రోజువారి కోత కూలీలు కూడా రాకపోవడంతో పశువులకు వదిలి వేసిన సంఘటనలు కోకోల్లాలు. 30 కేసులు ఉన్న టమాటాను రూ.300 నుంచి రూ.500 వరకు అమ్ముకోవడం రైతులకు కష్టమయ్యేది. అయితే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మదనపల్లె ప్రాంతంలో టమాటా సాగు చేయకపోవడంతో తాజాగా డిమాండ్‌ పెరిగింది. దీంతోపాటు పత్తికొండ ప్రాంతంలో కూడా రబీ సీజన్‌లో ఈ పంటను రైతులు పెద్దగా సాగు చేయకపోవడం వలన టమాటాకు గిరాకీ పెరిగింది. నాడు ధరలు లేక రోడ్డుపై పోసిన రైతులే నేడు మార్కెట్‌కు వెళ్లి కిలో రూ.70 నుంచి రూ.80 ధరకు కొనుగోలు చేయవలసి వస్తోంది. నేడు గంట టమాటా ధర రూ.3,600 పలకడంతో రైతుల్లో ధరలు ఉన్నాయనే ఆనందం ఒకపక్క, తమ వద్ద దిగుబడులు లేవనే ఆందోళన నెలకొంది. దీంతో టమాటా సాగు చేసే రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img