Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

కూటమికి బదిలీ ఫీవర్‌

. సీఎస్‌, డీజీపీపై వరుస ఫిర్యాదులు
. అయినా పట్టించుకోని కేంద్ర ఎన్నికల సంఘం
. వీరే కొనసాగితే పోలింగ్‌ నిర్వహణపై నీలినీడలు
. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థుల్లో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా సాగాలంటే సీఎస్‌, డీజీపీని తక్షణమే బదిలీ చేయాలని కూటమి అభ్యర్థులు వరుస ఫిర్యాదులు చేస్తున్నా కేంద్ర ఎన్నికల సంఘం స్పందించడం లేదు. బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకుంటే వైసీపీ అరాచకాలను అడ్డుకోవచ్చని, కేంద్ర ప్రభుత్వం తమకు అండగా నిలుస్తుందని టీడీపీ, జనసేన పార్టీ నేతలు భావించారు. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి సొంత జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌ రెడ్డి, ఇన్‌ఛార్జ్‌ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వీరిద్దరిని తక్షణమే బదిలీ చేస్తే తప్ప రాష్ట్రంలో ఎన్నికలు సక్రమంగా, సజావుగా సాగే అవకాశం లేదని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి కలిసి వేర్వేరుగా కూడా ఫిర్యాదులు చేశారు. రాష్ట్రంలో సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాకు కూడా వారిపై ఫిర్యాదు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు అయితే వీరిద్దరితో పాటు వైసీపీకీ ఏకపక్షంగా, అనుకూలంగా పనిచేసే మొత్తం 22 మంది ఐపీఎస్‌ అధికారులపై ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి అందజేశారు. కనీసం ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాతైనా వీరిద్దరినీ బదిలీ చేస్తారని కూటమి నేతలు ఆశతో ఎదురు చూశారు. రోజులు గడుస్తున్నా, పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్నా వారిపై బదిలీ వేటు పడకపోగా, ఉన్నతాధికారులు గతంలో వలే యదేచ్ఛగా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుండడంపై కూటమి నేతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల విజయవాడలో జరిగిన సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనలో టీడీపీ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై అక్రమ కేసు బనాయించాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి మరో రెండు ఫిర్యాదులు చేశారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని, పోలీసుల అరాచకాలను అడ్డుకోవాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో చిలకలూరిపేటలో జరిగిన కూటమి ఉమ్మడి సభ నిర్వహణ సందర్భంగా జరిగిన పోలీస్‌ వైఫల్యాలపై సైతం సీఈసీ స్పందన నామమాత్రంగానే ఉందన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో కొందరు జిల్లా ఎస్పీలపై మాత్రమే సీఈసీ చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంది. అయితే డీజీపీని, సీఎస్‌ను మార్చకపోవడం వల్ల వారిస్థానంలో మరలా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించేవారినే జవహర్‌ రెడ్డి సిఫార్సు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. సీఎస్‌ను, డీజీపీని మార్చకుండా కిందిస్థాయి అధికారులను మార్చడం వల్ల ఉపయోగం లేదని కూటమి నేతలు పేర్కొంటున్నారు. మరో నాలుగు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనుండగా, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర పరిస్థితులపై ఏమాత్రం స్పందించడం లేదన్న ఆవేదన కూటమి అభ్యర్థుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సీఎస్‌, డీజీపీనే కొనసాగిస్తే పోలింగ్‌ సక్రమంగా జరగడం కష్టమేనన్న ఆందోళన వారిలో స్పష్టంగా కనపడుతోంది. ఇదే విషయమై కూటమి అభ్యర్థులు చర్చించుకుంటున్నారు. ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీని భౌతికంగా తాము కలుపుకున్నప్పటికీ వారి ఆత్మ వైసీపీతోనే ఉందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఆడుతున్న డబుల్‌ గేమ్‌ వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్‌, డీజీపీని తక్షణమే బదిలీ చేసి, వారి స్థానంలో నిజాయితీపరులైన ఉన్నతాధికారులను నియమించి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img