Friday, April 26, 2024
Friday, April 26, 2024

గవర్నరుపై ప్రత్యక్షయుద్ధం

. రాష్ట్రవ్యాప్తంగా ఎల్డీఎఫ్‌ ప్రచారోద్యమం
. ‘విద్య పరిరక్షణ’ కరపత్రాల పంపిణీ
. 15న లక్ష మందితో రాజ్‌భవన్‌ వద్ద నిరసన

తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఆరీఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ‘కాషాయ’ అజెండాతో వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలకు దిగుతూ తన వైఖరిని ఏ మాత్రం మార్చుకోకపోవడంతో లెఫ్ట్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ (ఎల్డీఎఫ్‌) మంగళవారం గవర్నర్‌కు వ్యతిరేకంగా ప్రచారాందోళనను చేపట్టింది. గవర్నర్‌ అక్కసు గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచింది. ‘ఎడ్యుకేషన్‌ ప్రొటెక్షన్‌ సొసైటీ’ (విద్య పరిరక్షణ సమాజం) పేరిట ఈ కరపత్రాలను ఎల్డీఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు పంచిపెట్టారు. సంఫ్‌ు పరివార్‌ కీలుబొమ్మగా గవర్నర్‌ ఉన్నట్లు వ్యాఖ్యానించారు. ఆయనకు రాజ్యాంగం గురించి కనీస అవగాహన లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్నత విద్య పరిరక్షణ కోసం ఖాన్‌కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం తక్షణావశ్యమని ఎల్డీఎఫ్‌ పిలుపునిచ్చింది. గవర్నర్‌కు వ్యతిరేకంగా తలపెట్టిన వరుస నిరసనల్లో కరపత్రాల పంపిణీ భాగమేనని ఎల్డీఎఫ్‌ వర్గాలు తెలిపాయి. ఈనెల 15న రాజ్‌భవన్‌ ఎదుట నిరసన సభలో లక్ష మందికిపైగా పాల్గోనున్నట్లు వెల్లడిరచాయి. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ త్రిస్సూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘ధర్నాలు, సమావేశాలను రాష్ట్రంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల ఆవరణలో నిర్వహిస్తాం. నిరసన సభ రాజ్‌భవన్‌ ఎదుట జరుగుతుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర రాజధానిలో ఇటువంటి సభ జరగలేదు. ప్రజల మద్దతుతోనే గవర్నర్‌ను అడ్డుకోగలుగుతాం. అందుకే రాష్ట్ర ప్రజలకు పరిస్థితులను తెలియజేస్తూ కరపత్రాల పంపిణీ చేపట్టాం. గవర్నర్‌ వైఖరి రాజ్యాంగ విరుద్ధం… చట్ట వ్యతిరేకం. ప్రస్తుతమున్న చట్టాలు, రాజ్యాంగానికి అనుగుణమైన వైఖరిని గవర్నర్‌ కలిగివుండాలన్నదే మా డిమాండు’ అని అన్నారు. చాన్సలర్‌ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించేంత వరకు విశ్రమించేది లేదని చెప్పారు. ఈ కార్యసాధనలో ఎల్డీఎఫ్‌ను ఎవరూ ఆపలేరన్నారు. ‘మీడియాలోని ఓ వర్గంతో మాట్లాడనన్న గవర్నర్‌ తీరు ఆక్షేపణీయం. ఇది ఫాసిస్టు, నిరంకుశ వైఖరి. రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను అవమానించేలా ఉన్నది’ అని గోవిందన్‌ వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img