Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గాంధీ, పటేల్‌ కలల భారత నిర్మాణమే ధ్యేయం : మోదీ

రాజ్‌కోట్‌ : తమ ఎనిమిదేళ్ల పాలనలో మహాత్మాగాంధీ, సర్దార్‌ పటేల్‌ కలలు కన్న భారతదేశ నిర్మాణానికి నిజాయితీగా కృషిచేసినట్టు ప్రధాని మోదీ అన్నారు. బీజేపీ హయాంలో పేదల గౌరవాన్ని కాపాడే కసరత్తు జరిగిందన్నారు. దేశం సిగ్గుపడేలా ఈ ఎనిమిదేళ్లలో ఒక్క పనీ చేయలేదని చెప్పుకున్నారు. గుజరాత్‌, రాజ్‌కోట్‌ జిల్లాలోని అట్కోట్‌ పట్టణంలో 200 పడకల బహుళ వసతుల ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. పేదలు, దళితులు, గిరిజనులు, మహిళలు సాధికారత సాధించాలని మహాత్మాగాంధీ కోరుకున్నారన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం జీవితంలో భాగం కావాలని, స్వదేశీ(లోకల్‌) పరిష్కాలాధారిత ఆర్థిక వ్యవస్థ ఉండాలని తమ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మోదీ అన్నారు. ‘సబ్‌ కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ సబ్‌ కా విశ్వాస్‌ సబ్‌ కా ప్రయాస్‌’ నినాదంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. దేశాభివృద్ధికి కొత్త దిశను చూపామన్నారు. ఎనిమిదేళ్లలో పేదల కోసం ఎంతో చేశామని, పక్కా ఇళ్లు ఇచ్చామని, ఉచిత వైద్యం అందించామని, కోవిడ్‌ కాలంలో ఆహార ధాన్యగారాలను వారి కోసం తెరిపించామన్నారు. జన్‌ధన్‌ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసినట్లు మోదీ వెల్లడిరచారు. కోవిడ్‌ వాక్సిన్‌లు ప్రతి భారతీయుడికి ఉచితంగా అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పేదరికం గురించి పుస్తకాల్లోగానీ టీవీ ద్వారాగానీ తెలుసుకోలేదని ప్రత్యక్షంగా చూశానన్నారు. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం వల్ల గుజరాత్‌ అభివృద్ధితో కొత్తశిఖరాలకు చేరుకుంటోందన్నారు. 2014కి ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తాము (గుజరాత్‌ సీఎంగా తానున్నప్పుడు) పంపే అభివృద్ధి ప్రాజెక్టు ఫైళ్లను తిరస్కరించేదని, అభివృద్ధి ప్రాజెక్టులను ఓర్వలేకపోయేదని మోదీ విమర్శించారు. రాజ్‌కోట్‌లోని గ్రామీణ ప్రాంతంలో 200 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినందుకుగాను పాటిదార్‌ వర్గాన్ని మోదీ ప్రశంసించారు. అయితే ఇది రోగులు లేకుండా ఖాళీగా ఉండాలని ఆయన కాంక్షించారు. అనారోగ్యానికి తావులేని జీవనశైలి ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డిసెంబరులో గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img