Friday, April 26, 2024
Friday, April 26, 2024

గిరిజన విశ్వవిద్యాలయం
గిరగిరా

. ఇప్పటికే మారిన విద్యాసంస్థ ఏర్పాటు ప్రదేశం
. అరకొర నిధులు కేటాయించిన కేంద్రం
. భూములిచ్చిన రైతాంగం పరిహారం కోసం ప్రదక్షిణలు
. భవన నిర్మాణాలపై అయోమయం

విశాలాంధ్ర`విజయనగరం/ మెంటాడ/దత్తిరాజేరు: గిరిజన విశ్వవిద్యాలయ నిర్మాణం అరకొర నిధులతో నత్తనడక నడుస్తోంది. ఇటీవల కేంద్రం బడ్జెట్‌ కేటాయింపుల్లో రెండు తెలుగు రాష్ట్రాల గిరిజన విశ్వవిద్యాల యాలకు కేవలం రూ.37.67 కోట్లు కేటా యించడం విశ్వవిద్యాలయాల ఏర్పాటుపై కేంద్రానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. మరోవైపు విశ్వవిద్యాలయానికి భూములిచ్చిన రైతాంగం తమకు రావాల్సిన సొమ్ముకోసం అధికారులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం కొత్తవలస నుంచి కుంటినవలస వరకు మారిన తీరు కూడా రాజకీయాలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో కొత్తవలస మండలం రెల్లి గ్రామం వద్ద గిరిజన విశ్వవిద్యాలయం నిర్మించాలని 2015లో తలపెట్టారు. అందుకు అనుగుణంగా 2015లో 525 ఎకరాలను సేకరించారు. విశాఖపట్నం, అరకు, విజయనగరం ప్రాంతాలకు కేంద్రబిందువుగా ఉండే కొత్తవలస దగ్గర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం అటు గిరిజనులకు, ఇటు ఇతర ప్రాంతాల నుంచి విశ్వవిద్యాలయానికి వచ్చే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అప్పటి ప్రభుత్వం భావించింది. ఇక విశ్వవిద్యాలయ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం రెండు విడతలుగా రూ.11 కోట్లు మంజూరు చేసింది. ప్రహరీ గోడ పనులకు అప్పటి మంత్రి సుజయ్‌ కృష్ణ రంగారావు శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం అందించిన నిధులతో విశ్వ విద్యాలయ ప్రహరీ మాత్రమే నిర్మించగలిగారు. భూములిచ్చిన వారికి ప్రత్యామ్నాయం చూపారు. ప్రహరీ అనంతరం ఇతరత్రా పనులు కూడా జరుగుతాయని అంతా భావించారు. అయితే ప్రహరీ నిర్మాణం తరువాత ఎన్నికలు రావడం, పాలకులు మారడంతో విశ్వవిద్యాలయం చిరునామా కూడా అనూహ్యంగా మారిపోయింది. గిరిజనులకు అందుబాటులో ఉండేలా విశ్వవిద్యాలయం నిర్మిస్తామని, సాలూరు నియోజక వర్గంలోని పాచిపెంట, మెంటాడ ప్రాంతాల్లో స్థలాలను పరిశీలించారు. చివరకు మెంటాడ మండలం కుంటినివలస దగ్గర విశ్వవిద్యాలయం నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని భావించడంతో భూ సేకరణ చేపట్టారు. మొత్తం 561.91 ఎకరాలకు మెంటాడ మండలం కుంటినివలస పంచాయతీ చినమేడపల్లి రెవెన్యూకు సంబంధించిన 120 మంది రైతుల నుంచి 224.01 ఎకరాలు సేకరించారు. ఇందులో 70.52 ప్రభుత్వ భూమి, 79.89 ఎకరాలు డి పట్టా భూములు, 73.60 జిరాయితీ భూములున్నాయి. డి పట్టా భూములకు రూ.7.5 లక్షల నుంచి 9 లక్షల వరకు, జిరాయితీకి రూ.12 లక్షల వరకు పరిహారంగా అందించేందుకు నిర్ణయించారు. భూములిచ్చినవారికి మొదటి విడతగా రూ.5 కోట్ల 25 లక్షలు చెల్లించారు. దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూ నుంచి 337.87 ఎకరాలు సేకరించారు. 192.04 ఎకరాల ప్రభుత్వ భూమి, 128.83 ఎకరాల డి పట్టా, 17 ఎకరాల జిరాయితీ భూమి ఉంది. మొత్తం రెండు మండలాల్లోని ప్రభుత్వ భూమిని మినహాయిస్తే సుమారు 300 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది. ఇంకా రైతులకు 26 కోట్ల 10 లక్షల రూపాయలకు వరకు చెల్లించాల్సి ఉంది. తమకు రావాల్సిన పరిహారం కోసం రైతులు అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో విశ్వవిద్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ మెంటాడ మండలంలో గిరిజన విశ్వవిద్యాలయానికి భూ సేకరణ, భవన నిర్మాణాలు వంటి ప్రక్రియలు ఎప్పటికి పూర్తవుతాయో, గిరిజన విశ్వవిద్యాలయం భౌతికంగా ఎప్పటికి దర్శనమిస్తుందనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండడంతో భవిష్యత్‌ రాజకీయ పరిణామాల ప్రభావం విశ్వవిద్యాలయంపై ఎలా ఉంటుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ఏదిఏమైనా వీలైనంత త్వరగా విశ్వవిద్యాలయ నిర్మాణం పూర్తి చేసుకోవాలని జిల్లా వాసులు ఆకాంక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img