Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు

. సహాయ నిరాకరణ ప్రారంభిస్తున్నా
. నాతో పనిచేయాలని గుర్తుపెట్టుకోండి
. యూనిఫామ్‌ సిగ్గుపడుతోంది
. అనపర్తి సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు

విశాలాంధ్ర`అనపర్తి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా చివరి రోజు పర్యటనలో పోలీసుల ఆంక్షలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అనపర్తి దేవిచౌక్‌లో బహిరంగ సభకు గురువారం అనుమతి ఇచ్చిన పోలీసులు, తీరా ఏర్పాట్లు చేసుకున్నాక అనుమతిలేదన్నారు. చంద్రబాబును అనపర్తి రానీయకుండా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. సామర్లకోట పర్యటన ముగించుకుని అనపర్తి బయల్దేరిన చంద్రబాబును బలభద్రపురం దాటాక అడ్డగించారు. రోడ్డుకు అడ్డంగా బస్సును నిలిపారు. పోలీసులు కూడా రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఆగ్రహించిన చంద్రబాబు వాహనంపైకెక్కి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కాలినడకన అనపర్తి బయల్దేరారు. లక్ష్మీనర్సాపురం వద్ద పోలీసులు మరో బస్సును రోడ్డుకు అడ్డంగా ఉంచారు. వాటన్నింటినీ లెక్క చేయని చంద్రబాబు, సెల్‌ఫోన్‌ లైట్‌ వెలుతురులోనే ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ అనపర్తి చేరుకున్నారు. పోలీసులకు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు ప్రకటించారు.
గ్రావెల్‌ సూర్యనారాయణ ఖబడ్దార్‌..
దేవీచౌక్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో టీడీపీ కార్యకర్తల సెల్‌ఫోన్‌ లైట్ల వెలుతురులో చంద్రబాబు ప్రసంగం కొనసాగించారు. ‘ఎన్నో అవమానాలు భరించా. ఇంకా భరిస్తా మీకోసం. ఈరోజు అనపర్తికి వస్తానంటే ముందుగా అనుమతి ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన ఆర్డర్‌ కాపీ కూడా నాచేతిలోనే ఉంది. జగ్గంపేట, పెద్దాపురం వెళ్తే పోలీసులు సహకరించారు. అనపర్తికి వస్తే గ్రావెల్‌ సూర్యనారాయణ ఉన్నారు. ఖబడ్దార్‌ గ్రావెల్‌ సూర్యనారాయణ. నాతో పెట్టుకుంటున్నావ్‌.. జాగ్రత్తగా ఉండు. తమాషా అనుకోవద్దు. నేను తమాషా రాజకీయాలు చేయట్లేదు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం పోరాడుతున్నా. ఆ సైకో చెప్పినట్లు వింటే తర్వాత మీరు (పోలీసులు) నా దగ్గరే పనిచేయాలి గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పనులు చూసి ఆ యూనిఫామ్‌ సిగ్గుపడుతోంది. మీరంతా 22ఏళ్లు నా దగ్గర పనిచేసేవాళ్లే గుర్తుపెట్టుకోండి. సీఎం కావాలని నేను పాదయాత్ర చేయట్లేదు. అనపర్తి నుంచి సహాయ నిరాకరణ ప్రారంభించా’ అని చంద్రబాబు ప్రకటించారు. ‘‘పోలీసుల తీరు సరిగా లేదు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలన్నీ సమీక్ష చేసి మిమ్మల్ని కూడా జైల్లో పెట్టిస్తా. అక్రమాలకు పాల్పడిన పోలీసులనూ వదిలిపెట్టను. నేను అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగం ప్రకారం ఇక్కడికి వచ్చా. జగన్‌ పాదయాత్రను మేం ఎప్పుడైనా అడ్డుకున్నామా? అప్పుడు లేని ఆంక్షలను ఇప్పుడెందుకు పెడుతున్నారు. మాజీ సీఎంపై పోలీసులు వ్యవహరించిన తీరు బాగాలేదు. నేను పాకిస్తాన్‌ నుంచి వచ్చానా? ఎందుకు అడ్డుకుంటున్నారు? టీడీపీ కార్యకర్తలను కొట్టడం పోలీసులకు మంచిది కాదు. ఈ సైకో సీఎం.. పోలీసుల మెడపై కత్తిపెట్టారు’’ అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img