Friday, April 26, 2024
Friday, April 26, 2024

చట్టం వారికి చుట్టం!

. అధికార పార్టీ అక్రమాలకు అధికారుల వత్తాసు
. జీవీఎంసీ ఆదాయానికి గండి
. పేదలకు ఓ న్యాయం…పెద్దలకు మరో న్యాయమా?
. మండిపడుతున్న విపక్షాలు

విశాలాంధ్ర బ్యూరో -విశాఖపట్నం: అధికారం ఉండగా తామేది చేసినా అడ్డుకునే వారే ఉండరన్న రీతిలో విశాఖ వైసీపీ ప్రజా ప్రతినిధుల వ్యవహార శైలి ఉందని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. నిబం ధనలు, చట్టాలు, జీవోలు కేవలం పేదలకు మాత్రమే వర్తిస్తాయా అంటూ సామాన్య ప్రజలు, విపక్షాల నేతలు పెదవి విరుస్తున్నారు. అధికార బలంతో నిబంధనలు ఉల్లంఘించి అడ్డదారిలో కొంతమంది వైసీపీ ప్రజాప్రతిని ధులు చేపడుతున్న పనులకు అధికారులు వత్తాసు పలకడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహా విశాఖ నగరంలో పేదలపై చెత్త చార్జీలు, ఇంటి పన్నుల భారం వేసిన వైసీపీ ప్రభుత్వం… తమ ప్రజాప్రతినిధులకు మాత్రం నిబంధనలు అమలు చేయకుండా జీవీఎంసీ కి రావలసిన ఆదాయానికి గండి కొడుతున్నారని విశాఖ నగర ప్రజలు, విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. సాక్షాత్తు నగర మేయర్‌ హరి వెంకట కుమారి భర్త పేరు మీద ఉన్న భవనానికి ఇంటి పన్ను విధించ డంలో జీవీఎంసీ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ ప్రేమను చాటుకున్నారు. నివాస ప్రాంతంలో కమర్షి యల్‌ భవనానికి అనుమతులు లేకపోయినా 16 వార్డు ఇసుక తోటలో మేయర్‌ భర్త గొలగాని శ్రీనివాసరావు పేరిట 240 గజాల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం (వసుదేవ్‌ కల్యాణ మండపం) ఇటీవల నిర్మించారు. అయితే రూ. 67 వేలు ఈ భవనానికి కమర్షియల్‌ ఇంటి పన్ను వేయాల్సి ఉన్నప్పటికీ కేవలం రూ.1130 ఇంటి పన్ను వేసి జీవీఎంసీ రెవెన్యూ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు. ఇదే వార్డులో కమర్షియల్‌ భవనాలకు అనుమతి లేదని నిర్మించిన అపూర్వ కల్యాణ మండపాన్ని అధికారులు సీజ్‌ చేశారు. మేయర్‌ భర్త… ఇంటి నిర్మాణం కోసం ప్లాన్‌ తీసుకొని, ఆపై అనధికార అంతస్తు నిర్మించు కొని, జీవీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టారని, వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన 22వ వార్డు కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ సోమవారం స్పందన లో జీవీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ భవన నిర్మాణానికి అనేకమంది అధికారులు, బిల్డర్ల ద్వారా బెదిరించి భవన నిర్మాణ సామాగ్రిని కూడా దండుకున్నారని, చివరికి అగ్నిమాపక శాఖ అధికారుల నుంచి కల్యాణ మండపానికి ఫైర్‌ సేఫ్టీ పరికరాలను ఉచితంగా సమకూర్చుకున్నారని మూర్తి యాదవ్‌ ఆరోపించారు. ఇక 22 వార్డులో ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ ఓ భవనం నిర్మించారని, ఆ భవనానికి 1లక్ష 40 వేలు భవన నిర్మాణ అనుమతుల ఫీజులు కట్టాల్సి ఉన్నప్పటికీ కేవలం 10 వేలు మాత్రమే కట్టి చేతులు దులుపుకున్నారని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.4 కోట్లు వెచ్చించి నూతనంగా నిర్మించుకున్న కమిషనర్‌ భవనా నికి పక్కనే ఉన్న సీబీసీఎన్‌ సీ 18, 380 గజాల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా పనులు సాగుతుంటే కనీసం పట్టించుకోకపోవ డం చర్చనీయాంశమైంది. సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన 3600 గజాలు స్థలాన్ని కూడా ఆక్రమించుకొని నిర్మాణాలు సాగిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. క్రైస్తవ సంఘాలను బెదిరించి , ఆ స్థలాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, మాజీ స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జీ వెంకటేశ్వరరావు దొడ్డి దారిలో రూ. 63 కోట్లు విలువ చేసే టీడీఆర్‌లు పొందారని కూడా కమిషనర్‌ కు కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఫిర్యాదు చేయడం తీవ్ర దుమారాన్ని రేపింది. 20 వార్డు లో వైసీపీ నేత సెల్లార్‌ లో రెండు ఫ్లాట్లు నిర్మించి రూ.40 లక్షలు చొప్పున అమ్ముకున్నప్పటికీ జీవీఎంసీ ప్లానింగ్‌ అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై వార్డు కార్పొరేటర్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేయడం చూస్తుంటే ఇలా అధికార పార్టీకి అడుగడుగునా అధికారులు అండదండగా నిలుస్తున్నారని తేటతెల్లమవుతోంది. జీవో 119 ప్రకారం, హైకోర్టు ఆదేశాల ప్రకారం పార్కింగ్‌ సెల్లార్‌ లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అయినప్పటికీ అధికార పార్టీ నేతలకు కోర్టు ఆదేశాలు, జీవోలు, నిబంధనలు వర్తించవా అంటూ సామాన్య ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అదే పేదవాడు 60 గజాల్లో చిన్నపాటి ఇల్లు నిర్మించుకుంటే సవాలక్ష నిబంధనల పేరిట ముప్పతిప్పలు పెట్టే మున్సిపల్‌ అధికారులు అధికార వైసీపీ నేతలకు వత్తాసు పలకడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాలను అమలు చేయవలసిన ప్రజాప్రతినిధులే ఇలా చట్టాలను తమకు చుట్టాలుగా మార్చుకొని స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నా రని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ నగర మేయర్‌ భర్త నిర్మించిన కల్యాణ మండపానికి పన్ను విధింపులో అక్రమాలు జరిగాయని, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనుచరగణం అనుమతులు లేకుండా సీబీసీఎన్‌సీలో పనులు చేపట్టారని, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్‌ యాదవ్‌ భవన నిర్మాణానికి ఫీజులు చెల్లించలేదని, 22 వార్డులో వైసీపీ నేత పీతల గోవింద్‌ బిల్డర్‌ అవతారం ఎత్తి… గతంలో కూల్చివేసిన సెల్లార్లో ఫ్లాట్లను పునర్నిర్మానం చేపట్టి అమ్ముకోడానికి జీవీఎంసీ అధికారులు సహకరించారని ఆరోపిస్తూ సోమవారం జీవీఎంసీ కమిష నర్‌కు స్పందనలో జనసేన కార్పొరేటర్‌ మూర్తి యాదవ్‌ ఫిర్యాదు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img