Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి

ప్రభుత్వాల నిర్లక్ష్యంపై ఏపీయూడబ్య్లూజే రాష్ట్రవ్యాప్త నిరసనలు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : జర్నలిస్టుల సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఐజేయూ పిలుపు మేరకు శనివారం ఏపీయూడబ్ల్యూజే అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు విజయవంతంగా జరిగాయి. మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌ నుంచి కొత్త వంతెన సెంటర్‌ వరకు మోటారు బైక్‌లపై ర్యాలీగా వెళ్లి అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందు జనార్థన్‌, విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం గత సంవత్సరం రద్దుచేసిన 44 చట్టాలలో వర్కింగ్‌ జర్నలిస్ట్‌ యాక్ట్‌ను చేర్చడం దుర్మార్గమన్నారు. దీనికంటే మెరుగైన చట్టం రూపొందించడానికి నియమావళి రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రప్రభుత్వం చెప్పినప్పటికీ… ఇప్పటివరకూ ఎటువంటి కదలిక లేదన్నారు. ఈ చట్టం లేకపోవడం వల్ల జర్నలిస్టులు తమ హక్కులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిరదన్నారు. జర్నలిస్టులను కోవిడ్‌-19 ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి రూ.50 లక్షల బీమా అమలు చేయాలని డిమాండు చేశారు. జర్నలిస్టులకు పెన్షన్‌ స్కీమ్‌ అమలుతో పాటు చిన్నపత్రికలకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని, కరోనాతో మృతి చెందిన జర్నలిస్టులకు రూ.5లక్షల పరిహారం చెల్లింపు జీవోను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేక సమీక్షా సమావేశం తక్షణమే నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే కృష్ణా అర్బన్‌ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో మొత్తం 12 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మహాత్మాగాంధీ విగ్రహానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, కార్యవర్గసభ్యులు అలుగుల సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ప్రెస్‌క్లబ్‌ అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు దూసనపూడి సోమసుందర్‌, వానపల్లి సుబ్బారావు పాల్గొనగా, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ద్విచక్ర వాహన ర్యాలీ, అనంతరం మహాత్మాగాంధీకి అందజేసిన వినతిపత్రం కార్యక్రమంలో ఐజేయూ జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితుడు నల్లి ధర్మారావు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎన్‌.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img