Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘హిజాబ్‌’ను పెద్దది చేయొద్దు

సరైన సమయంలో విచారణకు సిద్ధం : సుప్రీం

హిజాబ్‌ వివాదంపై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వివాదంపై తాజా ఓ విద్యార్థిని అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.దీనిపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ పిటిషన్‌ వేశారు. విద్యాసంస్థల్లో వస్త్రధారణపై విధించిన ఆంక్షలపై తుది నిర్ణయం వెలువడే వరకు విద్యార్థులు మతపరమైన దుస్తులు ధరంచవద్దంటూ కర్ణాటక హైకోర్టు సూచించింది. ఈ ఉత్తర్వులను సదరు విద్యార్థిని సుప్రీంలో సవాలు చేశారు. తమకు 15 నుంచి ప్రాక్టికల్‌ పరీక్షలు ఉన్నాయని, విద్యాసంస్థల్లో తమకు ఆటంకం లేని ప్రవేశం ఉండేలా చూడాలని ఆమె తన పిటిషన్‌లో సుప్రీంను అభ్యర్థించారు. కాగా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీం నిరాకరించింది. దీనిపై సరైన సమయంలో విచారణ చేపడతామని పేర్కొంది. దీనిని జాతీయస్థాయి సమస్యగా మార్చవద్దని న్యాయవాదులకు సూచించింది. దీన్ని దిల్లీ వరకు తీసుకురావడం సరైనదేనా అని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతానికి హిజాబ్‌ అంశంపై కర్ణాటక హైకోర్టును విచారణ చేయనివ్వండి. దేశ పౌరులు అందరి ప్రాథమిక హక్కులను కాపాడేందుకే మేము ఇక్కడ ఉన్నాం. సరైన సమయంలో తప్పకుండా వాదనలు వింటాం. దీన్ని ఇప్పుడే పెద్దది చేయకండి’’ అని పేర్కొన్నారు. ఇదే అంశంలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ కర్ణాటక హైకోర్టు ఇంకా ఆదేశాలు (తుది) ఇవ్వకుండా.. సుప్రీం కోర్టులో ఎలా సవాలు చేస్తారు? అని ప్రశ్నించారు. ‘‘హైకోర్టును తేల్చనీయండి. దీన్ని రాజకీయం, మతపరం చేయవద్దు’’అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img