Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జేపీసీనే మేము కోరేది

పార్లమెంట్‌ మొదటి అంతస్తులో భారీ బ్యానర్‌
విపక్షాల ఆందోళన

న్యూదిల్లీ : అదానీ అంశంలో ఉమ్మడి పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో విచారణ జరిపించాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుపట్టాయి. ఇదే డిమాండ్‌తో మంగళవారం పార్లమెంటు భవనం మొదటి అంతస్తులో ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంలో జేపీసీనే మేము కోరేది అంటూ పెద్దపెట్టున సభ్యులు నినాదాలు చేశారు. పార్లమెంటు మొదటి అంతస్తు నుంచి కింది వరకు పెద్ద బ్యానర్‌నూ ఏర్పాటు చేశారు. టీఎంసీ ఎంపీలు పార్లమెంటు కాంపెక్స్‌లో విడిగా ఆందోళన నిర్వహించారు. అదానీ వ్యవహారంలో ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారవేత్త గౌతం అదానీకి మోదీ ప్రభుత్వం మద్దతిస్తోందని, అందుకే జేపీసీకి ఆదేశాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ అదానీని వెంటనే అరెస్టు చేయాలని టీఎంసీ డిమాండ్‌ చేసింది. ప్రతిపక్షాల ఉమ్మడి ధర్నాలో కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఆర్జేడీ, శివసేన (యూబీటీ), జేడీయూ, ఐయూఎంఎల్‌, ఆప్‌, ఎండీఎంకే సభ్యులు పాల్గొన్నారు. అదానీ వ్యవహారంలో దర్యాప్తునకు జేపీసీని ఏర్పాటు చేసేంత వరకు తమ పోరు కొనసాగుతుందని ప్రతిపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. అంతకుముందు విపక్ష నేత మల్లికార్జున ఖడ్గే చాంబర్‌లో ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంటులో అదానీ వ్యవహారంరాహుల్‌ క్షమాపణల కోసం అధికారవిపక్షాల పోటాపోటీ డిమాండ్‌ క్రమంలో ఉభయ సభలలో వాయిదాల పర్వం కొనసాగింది. ‘ఉదయం రాజ్యసభలో ఖడ్గేకు మాట్లాడేందుకు చైర్మన్‌ అనుమతిచ్చారు. ఆయన లేచి నిలబడిన వెంటనే బీజేపీ ఎంపీలు నినాదాలు మొదలుపెట్టారు. దీంతో సభను చైర్మన్‌ వాయిదా వేశారు. మోదీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే ప్రతిష్ఠంభనకు పరిష్కారం ఎలా సాధ్యం’ అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ట్విట్టర్‌లో (సభ వాయిదా పడిన తర్వాత) పేర్కొన్నారు. అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదికలో అదానీ సంస్థలపై చేసిన ఆరోపణల మీద నిజనిజాలు బహిర్గతం కావాలంటే ఒక్క జేపీసీతోనే సాధ్యమని ప్రతిపక్షాలు నొక్కిచెబుతున్నాయి. ఇదిలావుంటే టీఎంసీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఒంటరిగా ఆందోళన నిర్వహించి అదానీ అరెస్టుకు డిమాండ్‌ చేశారు. టీఎంసీ ఎపీ డెరెక్‌ ఓ బ్రెయిల్‌ మాట్లాడుతూ ‘అదానీని అరెస్టు చేయాలి. రూ.లక్ష కోట్ల కుంభకోనంలో అదానీని రక్షించేందుకు మోదీ యత్నిస్తున్నారు. పార్లమెంటులో ఈ అంశంపై చర్చకు అనుమతి ఇవ్వకపోవడానికి ఇదే కారణం. ఈ వ్యవహారాన్ని సొంతంగా విచారించాలని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని బీజేపీయేతర పది రాష్ట్రాలకు టీఎంసీ సూచించింది’ అని అన్నారు. అదానీ వద్దకు ఎల్‌ఐసీ`ఎస్‌బీఐ డబ్బు ఎలా వెళ్లింది… అదానీ ప్రజా ధానాన్ని ఎలా వినియోగించారన్నది సభలో మోదీ వివరణ ఇవ్వాలని టీఎంసీ ఎంపీ సుదీప్‌ బందోపాధ్యాయ డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img