Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టిడ్కో, జగనన్న ఇళ్లపై ఉగాది తర్వాత మహోద్యమం

. సీఎం రాజ్యాంగ వ్యతిరేక చర్యలు
. ధర్నాకు వస్తుంటే అరెస్టులా?
. మోదీకి సీఎం జగన్‌ ఊడిగం: నారాయణ విమర్శ
. డీజీపీ వైఖరి దుర్మార్గం: రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టిడ్కో, జగనన్న కాలనీ ఇళ్ల సమస్యలను జగన్‌ ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉగాది తర్వాత మహా ఉద్యమం చేపడతామని, ఇదే ప్రధాన అజెండాగా ప్రభుత్వం మెడలు వంచేంత వరకు సీపీఐ నాయకత్వం పోరాడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు. పూర్తయిన టిడ్కో ఇళ్ల పంపిణీ, జగనన్న ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇందుకోసం జగన్‌ సర్కారుకు ఈ నెల 15వ తేదీని డెడ్‌లైన్‌గా విధించింది. టిడ్కో ఇళ్లు, జగనన్న లబ్ధిదారుల సమస్యలపై విజయవాడ ధర్నాచౌక్‌లో సీపీఐ రాష్ట్ర సమితి గురువారం మహాధర్నా నిర్వహించింది. పోలీసుల అరెస్టులు, గృహనిర్బంధాలను సైతం ఎదుర్కొని వివిధ జిల్లాల నుంచి పెద్దఎత్తున లబ్ధిదారులు, సీపీఐ శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు ధర్నాచౌక్‌కు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. జగన్‌ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. ధర్నా సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అధ్యక్షత వహించారు. నారాయణ మాట్లాడుతూ ప్రజా సమస్యల కోసం, పేదలకు ఇళ్ల కోసం ధర్నాకు వస్తున్న సీపీఐ నేత రామకృష్ణను పోలీసులు అడ్డుకోవడాన్ని తప్పుపట్టారు. తాము దోపిడీదారులం కాదని స్పష్టంచేశారు. అవినీతిపరులు జగన్‌ ప్రభుత్వంలోనే ఉన్నారని ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లను ప్రజాధనంతో నిర్మించారని, అవి ప్రజల సొత్తు అని, అయినా సీఎం జగన్‌ ఆ ఇళ్లను లబ్ధిదారులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడెందుకు దగా చేస్తున్నదని నిలదీశారు. సెంటు, సెంటున్నర ఇంటి స్థలం చాలదని తానే ఆనాడే చెప్పానని, వాస్తవాలు మాట్లాడిన తనపై వైసీపీ మంత్రులు దురుసుగా వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. మీరిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తుంటే లబ్ధిదారులపైన, సీపీఐ శ్రేణులపైన పోలీసులను ప్రయోగించి అణచివేయిస్తారా? అని మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వానికి ఏడాదే సమయం ఉందనీ, ఈలోగా 30లక్షల ఇళ్లు కట్టించి లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్‌ చేశారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి మద్దతిచ్చినప్పుడు మంచివాళ్లమైన తాము జగన్‌ను వ్యతిరేకిస్తుంటే చెడ్డవాళ్లమయ్యామా అని నారాయణ ప్రశ్నించారు. ప్రతి 50 ఇళ్లకూ వైసీపీ నలుగురిని కేటాయించిందని, రాబోయే రోజుల్లో నలుగురు ఒకవైపు, మిగిలిన 46 మంది ఒకవైపు నిలబడి జగన్‌ను గద్దెదించడం ఖాయమని హెచ్చరించారు. కేవలం సంక్షేమ పథకాలే ప్రభుత్వాలను నిలబెట్టలేవనీ, రాజకీయం, రైతు సమస్యలు వంటి అనేక అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. 2014లో వంటగ్యాస్‌ ధర రూ.400 ఉండగా, మోదీ అధికారంలోకి వచ్చాక రూ.1150కిపైగా పెరిగిందని నారాయణ విమర్శించారు. భారీగా పెరిగిన వంటగ్యాస్‌ ధరపై కేంద్రాన్ని నిలదీసే దమ్ము జగన్‌కు లేకపోయిందన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే…కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్‌…ఇప్పుడు మోదీకి ఊడిగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి పదేపదే అన్యాయం చేస్తున్న కేంద్రానికి జగన్‌ ఎందుకు వంతపాడుతున్నారని నిలదీశారు. మూడు రాజధానుల ప్రకటనతో అభివృద్ధి పూర్తిగా దూరమైందని, పరిశ్రమలు తెలంగాణకు తరలిపోయాయని చెప్పారు. కేసీఆర్‌కు మేలు చేసేలా జగన్‌ మూడు రాజధానుల నిర్ణయముందని వ్యాఖ్యానించారు. రామకృష్ణ మాట్లాడుతూ విజయవాడ ధర్నాకు పోలీసులు అనుమతిచ్చి రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దుర్మార్గమన్నారు. అనుమతిచ్చి కూడా ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, ఆయన రాష్ట్రానికి డీజీపీయేనా అని ప్రశ్నించారు. జీవో నంబరు`1 అడ్డుపెట్టుకుని డీజీపీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని, ఈ జీవో వచ్చాక రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చారని మండిపడ్డారు. జగనన్న ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అడగడానికి వస్తుంటే అరెస్టు చేయిస్తారా? అని ధ్వజమెత్తారు. పోలీస్‌లు అధికార పార్టీకి తాబేదార్లుగా మారారని, రాష్ట్రంలో పోలీస్‌ అరాచకాలను ఆపేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆయన విజ్ఞప్తి చేశారు. మార్చి 15లోగా టిడ్కో ఇళ్లు ఇవ్వకపోతే వాటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని సీపీఐ సూచించినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇసుక, సిమెంట్‌ ధరలు పెరిగిపోయాయని, మీరిచ్చే లక్షా 80 వేలతో ఇళ్లు ఎలా కట్టించుకుంటారని నిలదీశారు. ఇళ్లు కట్టుకోకుంటే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామని హెచ్చరించడాన్ని తప్పుపట్టారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పిస్తామని హామీ ఇచ్చిందని, అందులో భాగంగా 2006 నుంచి నారాయణ నేతృత్వంలో వందల, వేలాది కేంద్రాల్లో నివేశన స్థలాల ఆక్రమణ ఉద్యమం చేపట్టామని గుర్తుచేశారు. ప్రభుత్వ పోరంబోకు భూములు ఆక్రమించి…అటు సాగుకు, ఇటు ఇళ్ల స్థలాలకు పంపిణీ చేసిన ఘన చరిత్ర సీపీఐకే ఉందని నొక్కిచెప్పారు. సెంటు భూమిలో ఇళ్లను నిర్మించడం సాధ్యమేనా?, వాటిని కట్టుకోకుంటే రద్దు చేస్తామని బెదిరించడం తగునా అని ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ జగనన్న ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు కూడా చాలవని స్వయానా ఓ జిల్లా కలెక్టరు చెప్పారంటే… సీపీఐ డిమాండ్‌ చేస్తున్న రూ.5లక్షలు ఎక్కువేమీ కాదని, ఇది న్యాయమైనదన్నారు. ప్రతి పేదవాడికీ ఇంటిని నిర్మించి ఇస్తామని నాడు పాదయాత్రలో జగన్‌ హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జల్లి విల్సన్‌ మాట్లాడుతూ సీపీఐ నిత్యం పేదల పక్షాన నిలుస్తోందని, ఇళ్ల స్థలాలు, భూపోరాటంలో పార్టీ ఎప్పుడూ అగ్రభాగాన ఉంటుందని స్పష్టంచేశారు. పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతోనే తాము ఉద్యమిస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే వారికి పక్కా ఇళ్లు కేటాయించాలన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయినా ఇంకా పేదలకు గూడు లేకపోవడం దారుణమన్నారు. ఇళ్ల కోసం పేదలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, జగనన్న కాలనీ ఇళ్లను ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులకు టిడ్కో ఇళ్ల కేటాయింపులో ప్రభుత్వం జాప్యం చేస్తోందని మండిపడ్డారు. ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, పి.హరినాథ్‌రెడ్డి, జి.ఈశ్వరయ్య, జంగాల అజయ్‌కుమార్‌, రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆర్‌.రవీంద్రనాథ్‌, దోనేపూడి శంకర్‌, కె.రామాంజనేయులు, టి.మనోహర్‌నాయుడు, పి.దుర్గాభవాని, ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌.కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారుల నుంచి సేకరించిన అర్జీలను నారాయణ, రామకృష్ణకు జి.కోటేశ్వరరావు తదితరులు అందజేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.చంద్రనాయక్‌, పెంచలయ్య, నజీర్‌ తదితరుల బృందం జగనన్న ఇళ్ల సమస్యలపై పాటలు పాడారు. జగన్న ఇళ్ల కాలనీలు, లబ్ధిదారుల ఇబ్బందులపై బృందం చిన్న స్కిట్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img