Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

దద్దరిల్లిన పుట్టపర్తి

టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ

. అభివృద్ధి… అక్రమాలపై పరస్పరం సవాళ్లు
. రాళ్లు, టెంకాయలు, చెప్పులు విసురుకుంటూ దాడులు
. రెండు వర్గాల వాహనాలు ధ్వంసం
. యుద్ధ వాతావరణంతో బిక్కుబిక్కుమంటున్న జనం
. పల్లె, దుద్దుకుంట మధ్య రాజకీయ వేడి

విశాలాంధ్రబ్యూరో– అనంతపురం: పుట్టపర్తి ఒక్కసారిగా దాడులతో దద్దరిల్లింది. టీడీపీ, వైసీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నారు. దీంతో ప్రశాంత పుట్టపర్తి ప్రాంతంలో భయానక వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి వర్గీయులు పరస్పరం రండిరా… దమ్ముంటే తేల్చుకోండి రా… అంటూ అవినీతి అక్రమార్జన పైన చర్చకు సిద్ధం అంటూ పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. రాళ్లు, చెప్పులు, టెంకాయలు విసురుకుంటూ దాడులు చేసుకోవడంతో పుట్టపర్తిలో యుద్ధ వాతావరణం ఏర్పడిరది. సత్యమ్మగుడి వద్ద ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకవైపు వైసీపీ వర్గీయులు, మరోవైపు టీడీపీ వర్గీయులు సత్యమ్మ గుడి దగ్గర రాళ్లు, చెప్పులు, టెంకాయలు విసురుకుంటున్న సందర్భంలో రెండు వర్గాల వారి వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎన్నికల సమయం ఇంకా ఉన్నప్పటికీ పుట్టపర్తిలో రాజకీయ వేడి ముందే రగులుకుంది. వైసీపీ వర్గీయులు తొడలు కొట్టి మీసాల మెలేసి… రండిరా తేల్చుకుందాం అంటూ పిలుపు ఇవ్వడం, మీ అవినీతి అక్రమాల చిట్టా ఇదిగో చేతిలో ఉందంటూ టీడీపీ వర్గీయులు అవినీతి ఎమ్మెల్యే… అంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంతలో పోలీసులు రావడం… రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో ఒకింత వైసీపీకి అనుకూలంగానూ టీడీపీకి వ్యతిరేకంగానూ వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ధర్నాకు దిగారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళనకర పరిస్థితి ఏర్పడిరది. లోకేశ్‌ యువగళం పాదయాత్ర సందర్భంగా ఓడీసీ బహిరంగ సభలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలను ప్రస్తావించిన నేపథ్యంలో శ్రీధర్‌ రెడ్డి తీవ్రంగా స్పందించి తాను చేసిన అభివృద్ధి గురించి మీడియాకు వివరించారు. పట్టణంలోని సత్యమ్మ గుడి దగ్గరకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రావాలని, ఇద్దరం ప్రమాణం చేద్దామని లేదా టీడీపీ కార్యాలయం వద్దకు రావాలా, లోకేశ్‌ పాదయాత్ర క్యాంపునకు రావాలో చెప్పాలని సవాలు చేశారు. దీంతో మాజీ మంత్రి పల్లె శనివారం సత్యమ్మ గుడి వద్దకు రావాలని… పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు అభివృద్ధి చేశారో, ఎవరు దోచుకోన్నారో తేల్చుకొందామని ప్రతి సవాలు చేశారు. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య కుంపటి రాజుకుంది. అయితే శుక్రవారం రాత్రి పోలీసులు నియోజకవర్గంలో పోలీస్‌ యాక్ట్‌ 30 విధించామని, ఎవరు సత్యమ్మ గుడి వద్దకు రాకూడదని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయం వద్ద పల్లెను, ఇతర ముఖ్య నాయకులను శనివారం ఉదయమే గృహ నిర్బంధం చేశారు.
అయితే పోలీసుల కళ్లు గప్పి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి వాహనం టీడీపీ కార్యాలయం ముందు నుంచి కేకలు వేసుకుంటూ సత్యమ్మ గుడి వద్దకు చేరుకుంది. దీంతో టీడీపీ కార్యాలయంలో నిర్బంధంలో ఉన్న పల్లె రఘునాథ రెడ్డి కార్యాలయం వెనుక వైపు పైకప్పు నుంచి క్రింద ఉన్న షెడ్డు పైకి దూకి కారులో సత్యమ్మ గుడికి చేరుకున్నారు. దీంతో అక్కడ వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు చెప్పులు, రాళ్లు, టెంకాయలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. రెండు వర్గాల వాహనాల అద్దాలు పగిలాయి. పోలీసులు అక్కడికి చేరుకొని రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. ఇదంతా పోలీసుల వైఫల్యమే అంటూ వైసీపీ నాయకులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలీస్‌ స్టేషన్‌ ముందు, అనంతరం సత్యమ్మ గుడి వద్ద పల్లె రఘునాథ రెడ్డితో పాటు నాయకులు బైఠాయించి నినాదాలు చేశారు. ఆ తరువాత రెండు వర్గాల వారు పార్టీ కార్యాలయాలకు చేరుకున్నారు. ప్రస్తుతం ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయాందోళన నడుమ పుట్టపర్తి నివురుగప్పిన నిప్పులా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img