Friday, April 26, 2024
Friday, April 26, 2024

దర్యాప్తు సంస్థలకు సహకరిస్తా: ఎమ్మెల్సీ కవిత

ఈడీ నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ
ముందస్తు అపాయింట్ మెంట్లు ఉన్నాయని వివరణ
న్యాయ సలహా తీసుకుంటానని వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ కోసం ఈ నెల 9న ఢిల్లీకి రమ్మంటూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి నోటీసులు వచ్చాయని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అయితే, ముందస్తు అపాయింట్ మెంట్లు ఉండడంతో ఈడీ నోటీసులపై ఎలా స్పందించాలనే విషయంపై న్యాయ సలహా తీసుకోనున్నట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు చాలా కాలంగా పెండింగ్ లో ఉందని, దానిని వెంటనే పాస్ చేయాలనే డిమాండ్ తో ఢిల్లీలో ధర్నా తలపెట్టిన విషయాన్ని కవిత గుర్తుచేశారు.ఈ నెల 10న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు గతంలోనే ప్రకటించినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కాలేనని ఎమ్మెల్సీ చెప్పారు. ఈడీ నోటీసులపై తెలంగాణ ముఖ్యమంత్రి, తన తండ్రి కేసీఆర్ తో చర్చించేందుకు కవిత ప్రగతిభవన్ కు వెళ్లనున్నట్లు సమాచారం. లిక్కర్ స్కాంతో తనకెలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. అయితే, విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని ఆమె తేల్చిచెప్పారు. చట్టాన్ని తాను గౌరవిస్తానని, అయితే ముందస్తు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరతానని తెలిపారు.ఈడీ నోటీసులకు తాను భయపడబోనని, బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ తలవంచదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారు విచారణ సంస్థలను వాడుకుంటోందని విమర్శించారు. మరోవైపు, ఈడీ నోటీసుల నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కవిత ఇంటికి వెళ్లే దారులను మూసేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img