Friday, April 26, 2024
Friday, April 26, 2024

‘దిశ’ ఎన్‌కౌంటర్‌ బూటకం

సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక

ఊహించని ట్విస్టులు.. బయటపడిన దిగ్భ్రాంతికర విషయాలు
హైకోర్టుదే నిర్ణయం: సుప్రీం

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హైదరాబాద్‌కు చెందిన ‘దిశ’ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ వ్యవహారంలో ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు కేసును హైకోర్టుకు బదిలీ చేసింది. ఈ క్రమంలో సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదిక ద్వారా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ‘‘దిశ ఎన్‌కౌంటర్‌ బూటకం. పోలీసులే మాన్యువల్‌కు విరుద్ధంగా విచారణ జరిపారు. ప్రజల ఆగ్రహాన్ని కట్టడి చేసేందుకే నిందితులను పోలీసులు కాల్చి చంపారు. తక్షణ నాయ్యం కోసమే ఎన్‌కౌంటర్‌ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కాకుండా విచారణ పేరుతో వేరే అధికారులు వారిని వేధింపులకు గురి చేశారు. పోలీసులు గాయాలతో ఆసుపత్రిలో చేరడం ఓ కట్టుకథ’’ అని నివేదికలో పేర్కొన్నట్టు నిందితుల తరఫు లాయర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికను ఆయన మీడియాకు అందించారు.
ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ శుక్రవారం ముగిసింది. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించడం కుదరదని, దీనిని తెలంగాణ హైకోర్టుకు బదిలీచేస్తున్నామని, ఇక హైకోర్టే తదుపరి చర్యలను నిర్ణయిస్తుందని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై నివేదికను సీల్డ్‌ కవర్‌లో త్రిసభ్య దర్యాప్తు కమిషన్‌ సమర్పించగా దానిని విచారించింది. దోషులను సిర్పూర్కర్‌ కమిషన్‌ గుర్తించిందని, ఇక ఏ చర్య తీసుకోవాలన్న ప్రశ్న మిగిలిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణలో గోప్యంగా ఉంచాల్సిన అంశాలు ఏమీ లేవని, నివేదికను బహిర్గతం చేయొచ్చు అని పేర్కొంది. కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, దీనిని తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. తదుపరి ఏం చేయాలో హైకోర్టు నిర్ణయిస్తుందని సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్‌ సూర్యకాంత, జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం పేర్కొంది. నివేదికను సీల్డ్‌ కవర్‌లో ఉంచాలన్న సీనియర్‌ న్యాయవాది శ్యామ్‌ దివాన్‌ వాదనలను తోసిపుచ్చింది. ‘ఎన్‌కౌంటర్‌ కేసులో గోప్యంగా ఉంచాల్సినది ఏమీ లేదు. కమిషన్‌ దోషులను గుర్తించింది. ఈ వ్యవహారాన్ని హైకోర్టుకు సిఫార్సు చేస్తున్నాం. కేసును తిరిగి హైకోర్టుకు బదిలీ చేస్తున్నాం. మేము పర్యవేక్షించలేం. సమగ్ర నివేదిక అందింది. తగు విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదే ప్రశ్న. వారు (కమిషన్‌) కొన్ని సిఫార్సులు చేశారు. నివేదిక ప్రతిని ఇరుపక్షాలకు అందజేయాలని కమిషన్‌ కార్యాలయాన్ని ఆదేశిస్తున్నాం’ అని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అంతకుముందు ధర్మాసనం ఈ నివేదికను న్యాయవాదులతో పంచుకోవడానికి నిరాకరించింది. ధర్మాసనంలోని న్యాయమూర్తులకు ప్రతులు అందించాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘ముందుగా ఈ నివేదిక పరిశీలించనివ్వండి..’ అని సీజేఐ రమణ అన్నారు. గతేదాడి ఆగస్టు 3న నివేదిక సమర్పణకుగాను సిర్పూర్కర్‌ కమిషన్‌ గడువును ఆరు నెలల పాటు పొడిగించింది. బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి రేఖా సొండూర్‌ బాల్డోటా, సీబీఐ మాజీ డైరెక్టర్‌ డీఆర్‌ కార్తికేయన్‌ కూడా ఈ కమిషన్‌లో సభ్యులుగా ఉన్నారు. కమిషన్‌ తన నివేదికను సమర్పించేందుకు ఇప్పటికి మూడుసార్లు గడువు పొడిగించింది. కోవిడ్‌ మహమ్మారి కారణంగా విచారణ సాధ్యపడలేదు. ఇదిలావుంటే, 2019 డిసెంబరు 6న ఈ కమిషన్‌ను నియమించినప్పుడే తెలంగాణ హైకోర్టులో విచారణను, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలతో నిజానిజాలు తెలుసుకునేందుకు విచారణకు ఆదేశాలిచ్చింది. న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ ఒక పిటిషన్‌ను, ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది మరొక పిటిషన్‌ను దాఖలు చేసి ఎన్‌కౌంటర్‌పై స్వతంత్ర విచారణకు అభ్యర్థించారు. ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసు అధికారులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని విన్నవించారు. నిందితులు ఎదురు కాల్పుల్లో మరణించారని, క్రైమ్‌ సీన్‌ రిక్రీయేట్‌ క్రమంలో ఉదయం 6.30గంటలకు ఈ ఘటన జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసు విచారణ సుప్రీంకోర్టు చేపట్టింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సిర్పూర్కర్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్‌కౌంటర్‌ ఫొటోలు, వీడియోలతో పాటు అప్పటి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీస్‌ అధికారులు, గాయపడిన పోలీసులకు వైద్యం చేసిన వైద్యులను, నిందితుల కుటుంబ సభ్యులు, దిశ తల్లిదండ్రులను కమిషన్‌ విచారించింది. ఫోరెన్సిక్‌ నివేదికలను పరిగణనలోకి తీసుకుది. సమ్రగ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. దీనిపై సుప్రీంకోర్టులో వాదనలు జరిగిన అనంతరం కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. 2019 నవంబరు 27న ఎన్‌హెచ్‌ 44 వద్ద పశువుల వైద్యురాలు దిశ (27)పై అత్యాచారం, హత్య కేసులో నిందితులు చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్‌, ఆరిఫ్‌ అరెస్టు అయ్యారు. సీన్‌ రిక్రేట్‌ సమయంలో నలుగురు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 10 మంది పోలీసు అధికారులలో వి. సురేందర్‌, కె. నరసింహా రెడ్డి, షేక్‌ లాల్‌ మధర్‌, మహ్మద్‌ సిరాజుద్దీన్‌, కొచ్చెర్ల రవి, కె. టంకటేశ్వరులు, ఎస్‌. అరవింద్‌ గౌడ్‌, డి.జానకిరామ్‌, ఆర్‌. బాలు రాథోడ్‌, డి.శ్రీకాంత్‌ ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img