Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశభద్రతపై రాజీ వద్దు….

కేంద్రానికి సుప్రీం సూచన
పెగాసస్‌పై నోటీసు జారీ
విచారణ పదిరోజులకు వాయిదా

న్యూదిల్లీ : దేశభద్రత విషయంలో రాజీ పడాల్సి వచ్చే సమాచారాన్ని వెల్లడిరచాల్సిన అవసరం లేదంటూ పెగాసస్‌పై పిటిషన్ల విచారణలో కేంద్రానికి సుప్రీం కోర్టు సూచించింది. పెగాసస్‌ వివాదంపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించింది. వీటిపై కేంద్రప్రభుత్వ వైఖరిని కోరుతూ నోటీసు జారీచేసింది. తదుపరి విచారణను పది రోజులకు వాయిదా వేసింది. సోమవారం ఇచ్చిన అఫిడవిట్‌ పరిమితంగా ఉందని, అది సమగ్రంగా ఉంటుందని భావించామని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీరమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. దేశ భద్రతకు విఘాతం కలుగుతుందనుకునే వివరాలేమీ ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణ నాటికి ఈ వ్యవహారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిర్ణయిస్తామని వెల్లడిరచింది. కేంద్రప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. సోమవారం దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన వైఖరిని కేంద్రం స్పష్టంచేసిందన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్నది తప్ప చెప్పేందుకు ఏమీ లేదని అన్నారు. ఇది సున్నితమైన అంశమన్న ఆయన ఈ వ్యవహారంలో సున్నితంగానే వ్యవహరించాలని కోరారు. పెగాసస్‌ వంటి స్పైవేర్‌లను ప్రభుత్వం వినియోగిస్తుందో లేదో చెప్పేస్తే దేశభద్రతకు విఘాతం కలుగుతుందని, శత్రువులు ` ఉగ్రవాదులు తమ మాధ్యమాలను, సాఫ్ట్‌వేర్‌లను మార్చేసుకుంటారని మెహతా వెల్లడిరచారు. త్రిసభ్య ధర్మాసనం స్పందిస్తూ రక్షణశాఖగానీ ఇతర శాఖలుగానీ దేశభద్రత కోసం ఎటువంటి విధానాలను అనుసరిస్తారో తెలుసుకోవాలని అనుకోవడం లేదని చెప్పింది. అటువంటి సమాచారాన్ని కోరడం లేదని తెలిపింది. దీనికి మెహతా.. జర్నలిస్టుల తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలను ప్రస్తావించారు. పెగాసస్‌ను కేంద్రం వాడుతోందో లేదో చెప్పాలంటున్నారని తెలిపారు. ‘రేపు వేరొక వెబ్‌ పోర్టల్‌ ఏదో సైనిక పరికరాలను అక్రమ చర్యలకు వాడుతున్నారని చెప్పిందే అనుకోండి ఎవరో ఒకరు పిటిషన్‌ దాఖలు చేస్తారు. మిలటరీ పరికరాల వినియోగంపై అఫిడవిట్‌ దాఖలు చేయమని నేను కేంద్రానికి సూచిస్తే విధినిర్వహణలో విఫలమవుతాను’ అని మెహతా అన్నారు.
ఈ వ్యవహారంలో దర్యాప్తును పిటిషనర్లు కోరుతున్నందున నిష్పాక్షిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని, ఇందులో ప్రభుత్వ అధికారులు ఎవ్వరూ ఉండరని, ఈ కమిటీ నివేదికను నేరుగా సుప్రీంకోర్టుకు అందిస్తుందని చెప్పారు. దీనికంటే పారదర్శకంగా ఇంకేం ఉంటోందో తెలియదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఈ వ్యవహారంలో వాదనలు వద్దని అనుకుంటున్నామని పేర్కొంది. పిటిషనర్ల తరపు కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ దేశ భద్రతకు విఘాతం కలిగించే వివరాలేమీ తమకు అక్కర్లేదని అన్నారు. దీంతో తదుపరి విచారణను పది రోజుల తర్వాత జరుపుతామన్న ధర్మాసనం.. కేంద్రానికి నోటీసు కూడా జారీచేసింది. ఎడిటర్స్‌ గిల్డ్‌ సహా పెగాసస్‌పై స్వతంత్ర దర్యాప్తును కోరే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తుండటం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img