Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాడు`నేడు మలిదశ – మనబడికి రూ.4,535 కోట్లు

రాష్ట్రవ్యాప్తంగా 12,663 పాఠశాలల అభివృద్ధి
18,498 అదనపు తరగతిగదుల నిర్మాణం
తక్షణమే టెండర్లు పిలవాలని సీఎం జగన్‌ ఆదేశం

అమరావతి : నాడునేడు రెండో విడత మనబడి కార్యక్రమం కింద రూ.4,535 కోట్లతో 12,663 పాఠశాలలు అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. విద్యాశాఖలో నాడు-నేడుతో పాటు ఫౌండేషన్‌ స్కూళ్లపై క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నాడు`నేడు కింద స్కూళ్ల అభివృద్ధి ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైనదన్నారు. ఈ కార్యక్రమం అమలులో ఎక్కడా నిర్లక్ష్యం కానరాకూడదని అధికారులను హెచ్చరించారు. రెండోవిడత కార్యక్రమానికి తక్షణమే టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారు. నూతన విద్యావిధానం అమలుపై అన్నిరకాలుగా సిద్ధం కావాలన్నారు. పాఠ్యపుస్తకాల ముద్రణ నాణ్యతను పెంచాలని, కనీసం మూడో తరగతి నుంచి సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌కు సంబంధించి ముందుగా వేయి స్కూళ్లను చేస్తున్నామని అధికారులు తెలియజేయగా, అన్నిరకాల స్కూళ్లు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. మూడో విడతలో నాడు-నేడు కింద 24,900 స్కూళ్లు అభివృద్ధి చేయాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.7821 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. నాడు- నేడు పనులకు సంబంధించి సచివాలయంలో 12వేల మందికి శిక్షణ ఇవ్వనున్నామని, అనంతరం పేరెంట్స్‌ కమిటీలకు శిక్షణ ఇవ్వనున్నట్టు అధికారులు తెలిపారు. స్కూళ్లలో శుభ్రత, టాయిలెట్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, లేనిపక్షంలో ఇంత డబ్బు ఖర్చుపెట్టిన తర్వాత నిర్లక్ష్యం చేస్తే మళ్లీ పూర్వపుస్థితికి వెళ్లిపోతామన్నారు. స్కూళ్లలో ఎలాంటి మరమ్మతులు వచ్చినా, ఏదైనా సమస్యలు వచ్చినా వెంటనే చేయించడానికి కంటిన్జెన్సీ ఫండ్‌ ఒకటి ప్రతి స్కూల్లో ఉంచాలని, దీనిపై ఎస్‌ఓపీలను తయారు చేయాలని సీఎం చెప్పారు. స్వేచ్ఛ కార్యక్రమం కింద పాఠశాలల్లో ఆడపిల్లలకు శానిటరీ నాప్‌కిన్స్‌ పంపిణీ, అక్టోబరు మధ్యంతరంలో కార్యక్రమం ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌, మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ.మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ (ఎస్‌సీఈఆర్‌టీ) బి.ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img