Friday, April 26, 2024
Friday, April 26, 2024

పుదుచ్చేరిలో సీపీఐ జాతీయ సమావేశాలు ప్రారంభం

పుదుచ్చేరి: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి సమావేశాలు శనివారం పుదుచ్చేరిలో ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు శనివారం అక్కినేని వనజ అధ్యక్షతన జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఆదివారం ప్రారంభమయ్యే జాతీయ సమితి సమావేశాలలో 150 మంది సమితి సభ్యులు పాల్గోనున్నారు. సమావేశాలు నాలుగు రోజులు జరగనున్నాయి. తొలిరోజు పార్టీ కార్యదర్శివర్గం, కార్యవర్గం సమావేశాలు జరిగాయి. పుదుచ్చేరికి రాష్ట్రహోదా, గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల పాత్రపై సెమినార్‌ ఆదివారం సాయంత్రం జరుగుతుంది.
పుదుచ్చేరిలో జాతీయ సమితి సమావేశాలు తొలిసారి జరుగుతుండటంతో పార్టీ పుదుచ్చేరి శాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేంద్రపాలిత ప్రాంతంలో పార్టీ మరింత బలోపేతం కావడానికి ఈ సమావేశాలు దోహదపడతాయని పుదుచ్చేరి శాఖ కార్యదర్శి ఏఎం సలీం అన్నారు. పుదుచ్చేరికి రాష్ట్రహోదా డిమాండ్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యత వచ్చేలా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోనున్నట్లు చెప్పారు. సెమినార్‌లో సీపీఎం, డీఎంకే, వీకేసీ ప్రముఖ నేతలు పాల్గొంటారని తెలిపారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవి ద్వారా కేంద్రప్రభుత్వం ఏ విధంగా కేంద్ర పాలిత ప్రాంత హక్కులను హరిస్తున్నదో జాతీయ నాయకులకు వివరించే అవకాశం లభించిందన్నారు. గవర్నర్ల పాత్రపై జాతీయ సమితి తీర్మానించనుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img