Friday, April 26, 2024
Friday, April 26, 2024

పునరావాసం, పరిహారం ముఖ్యం

. పోలవరం నిర్వాసితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం
. సీపీఎం రౌండ్‌టేబుల్‌ సమావేశం విమర్శ
. రివర్స్‌ టెండరింగ్‌తో సాధించిందేమిటి: రామకృష్ణ

విశాలాంధ్ర`విజయవాడ: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు పునరావాసం కల్పించటం, పరిహారం చెల్లించటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని వక్తలు డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితు లకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ జూన్‌లో వర్షాలు వస్తే ముంపు సమస్య ముందుగా పోలవరం వద్దనే ప్రారంభమవు తుందన్నారు. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్వాసితులకు 30వేల కోట్ల రూపాయలు, ప్రాజెక్టు నిర్మాణానికి 15వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. మొత్తం 45వేల కోట్ల రూపాయలను ఏడాదికి రూ.15వేల కోట్లు చొప్పున కేటాయిస్తే సమస్య ఉండేది కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రం వద్ద సాగిలపడటం వల్ల పోలవరం పూర్తి కాలేదని ధ్వజమెత్తారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా సాధించింది ఏమిటో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతి లేకపోయినా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు అభ్యంతరం చెపుతున్నా మోదీ ప్రభుత్వం కర్నాటక ఎన్నికల దృష్ట్యా ఎగువ భద్ర డ్యామ్‌కు రూ.5,300 కోట్లు కేటాయించిం దన్నారు. ఏపీకి 8,900 కోట్లు కేటాయించటం లేదన్నారు. డయాఫ్రం వాల్‌ సొట్టగా ఉన్నా, చక్కగా ఉన్నా డిజైన్‌కు తగిన ట్టుగా నిర్మించుకోగల సత్తా మన ఇంజినీర్లకు ఉందన్నారు.
జాతీయస్థాయి ఉద్యమం అవసరం: గిడుగు రుద్రరాజు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నాయని పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో యూపీఏ ప్రభుత్వం పేర్కొన్న విధంగా నిర్వాసితులకు న్యాయం జరగటం లేదని, అందువల్ల దీనిపై జాతీయస్థాయిలో ఉద్యమం చేపట్టాలన్నారు. ప్రాజెక్టు అంటే కేవలం సిమెంటు నిర్మాణం మాత్రమే కాదని, అక్కడి ప్రజలతో అనుబంధం కలిగి ఉంటుందన్నారు. ప్రత్యేకహోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీకి కొమ్ముకాసే వారిని ఉద్యమంలోకి రాకుండా జాగ్త్రత పడాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పోలవరం, రంపచోడవరం ప్రాంతాలను కలిపి పోలవరం జిల్లాగా ఏర్పాటు చేసి నిర్వాసితులకు, ఆయా ప్రాంతాల్లోని గిరిజనులకు న్యాయం చేస్తామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించిన తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. కేంద్రంగానీ, రాష్ట్రం గానీ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గురించే మాట్లాడుతున్నాయి తప్ప నిర్వాసితుల పునరావాసం గురించి స్పందించకపోవడం శోచనీయమ న్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాలను మార్చవద్దని డిమాండ్‌ చేశారు. పోలవరం సాధన సమితి అధ్యక్షులు అక్కినేని భవానీ ప్రసాద్‌ మాట్లాడుతూ పోలవరం ఎత్తు తగ్గించకూడదన్నారు. పూర్తిస్థాయిలో నిర్మాణం జరగాలని, నిర్వాసితులందరికీ పునరావాసం కల్పించటం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వటం సమగ్రంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శాసనమండలి సభ్యులు వెంకట్రావ్‌, షేక్‌ సాబ్జి మాట్లాడుతూ వరదల సమయంలో ముంపు ప్రాంతాల ప్రజల జీవన స్థితిగతులను వివరించారు. ముంపు మండలాల వారికి సరైన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రైతుసంఘం నాయకులు యెర్నేని నాగేంద్రనాథ్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కె.పొలారి, సీపీఐ(ఎంఎల్‌) లిబరేషన్‌ నాయకులు హరినాథ్‌, ఎంసీపీఐ నాయకులు ఖాదర్‌భాష, ఎస్‌యూసీఐ నాయకులు సుధీర్‌, ఎంఎల్‌ పార్టీ నాయకులు వీరబాబు తదితరులు ప్రసంగించారు. పోలవరం ముంపు బాధితులు తమ కష్టాలను నాయకులకు, మీడియాకు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img