Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పోలవరం నిర్వాసితులకు తక్షణమే పునరావాసం

ప్రాజెక్టుపై పాలకుల నిర్లక్ష్యం
పార్లమెంటు సమావేశాల్లోనే నిధులు కేటాయించాలి
దిల్లీలో రెండు రోజుల ధర్నాలో నేతల డిమాండ్‌

అమరావతి : పోలవరం జాతీయ ప్రాజెక్టు సత్వర నిర్మాణంతోపాటు నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీకి కేంద్రం పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని, పార్లమెంట్‌ సమావేశాలు ముగిసేలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీల నేతలు డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితులపై కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం, టీడీపీ. నిర్వాసితుల కమిటీ, ఆదివాసీ సంఘాల సంయుక్త అధ్వర్యంలో దిల్లీలో రెండు రోజులపాటు పెద్దఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. జంతర్‌మంతర్‌లో చందా లింగయ్య అధ్యక్షతన బుధవారం నిర్వహించిన ధర్నాలో సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా, కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌, ఏపీ కార్యదర్శి పి.మధు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, రామ్మోహన్‌నా యుడు, కాంగ్రెస్‌ ఎంపీ జయకుమార్‌, టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ, సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు తాటిపాక మధు, డేగా ప్రభాకర్‌, సీపీఎం రాష్ట్ర నాయకులు, బి.వెంకట్‌, మంతెన సీతారాం, టి.అరుణ్‌, నిర్వాసితుల నాయకులు జుత్తుక కుమార్‌, ఎలిశెట్టి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డి.రాజా మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేంత వరకూ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఇందుకోసం పార్లమెంటు లోపలా, బయటా ఉద్యమిస్తామని, ప్రాజెక్టు కోసం త్యాగం చేసే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. బృందాకరత్‌ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల పట్ల పాలకులకు చిత్తశుద్ధి లేదన్నారు.
ఢల్లీిలోని ఏపీ భవన్‌ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌, గిరిజన సంఘాల కన్వీనర్‌ చందా లింగయ్య, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ల్యక్షంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాఫర్‌ డ్యాం పూర్తయినందువల్ల 95 గ్రామాలు నీటమునిగాయని, కానీ నిర్వాసితులకు మాత్రం ఇప్పటివరకు పునరావాసం కల్పించలేదన్నారు. దిక్కుతోచని స్థితిలో వారంతా కొండ ప్రాంతాలకు చేరి తలదాచుకుంటూ దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తొలినుంచీ కేంద్రం వైఖరి సరిగా లేదన్నారు. ప్రాజెక్టు పూర్తి కోసం 2013-14 అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని, పెరిగిన అంచనా వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం చెప్పడం దుర్మార్గమన్నారు. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినందువల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. నిర్వాసితులకు ఆర్‌ Ê ఆర్‌ ప్యాకేజీ కింద రూ.33వేల కోట్లు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని రామకృష్ణ స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం నిర్వాసితులకు పునరావాసం, ప్యాకేజీ ఇవ్వకుండా బాధితుల తరలింపు కార్యక్రమాన్ని బలవంతంగా చేపట్టడాన్ని ఖండిస్తున్నామన్నారు. పోలీసు, రెవెన్యూ అధికారుల బెదిరింపులతో నిర్వాసితులను బలవంతంగా గ్రామాల నుండి ఖాళీ చేయించడం సరికాదన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపే పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం, పునరావాసం, ప్యాకేజీలపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో బంద్‌కు పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. చందా లింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వాల తీరువల్ల రెండు రాష్ట్రాల్లోని నాలుగు లక్షలమంది ఇబ్బందులకు గురవుతున్నారని, అందులో అత్యధికులు గిరిజనులేనన్నారు. నిర్వాసితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీన వైఖరిని తప్పుబట్టారు. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే పునరావాసం కల్పించి, ప్యాకేజీ ఇచ్చిన తరువాతే గ్రామాలను ఖాళీ చేయించాలన్నారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img