Friday, April 26, 2024
Friday, April 26, 2024

పోలవరం సమస్యలపై దిల్లీకి అఖిలపక్షం

. తీసుకెళ్లే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
. ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేయాలి
. లేకుంటే చరిత్రహీనులవుతారు
. సీపీఐ రెండో రోజు దీక్షల్లో నారాయణ, రామకృష్ణ హెచ్చరిక
. ఆందోళనకు విపక్షాల సంఫీుభావం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నరేంద్రమోదీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లోక్‌సభలో ఒక విధంగా, రాజ్యసభలో మరోవిధంగా సమాధానం చెపుతూ రాష్ట్ర ప్రజల్ని దగా చేస్తున్నదని అఖిలపక్ష నేతలు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు 41.5 మీటర్లకు కుదిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా జాతీయ ప్రాజెక్టుగా పూర్తిస్థాయిలో నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ అధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు నిర్వహించిన దీక్షలు మంగళవారం సాయంత్రం ముగిశాయి. ఈ దీక్షలను గుంటూరులో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, విజయవాడలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించగా, టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్‌, జనసేన పార్టీ నేతలు దీక్షా శిబిరాలను సందర్శించి సంఫీుభావం తెలియజేశారు. గుంటూరులో నారాయణ మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత అనేక ఆటంకాలు ఎదురైనప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూనుకున్నారన్నారు. కానీ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం కేంద్రానికి ఊడిగం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ తండ్రి ఆశయాలకు పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ప్రాజెక్టు కాస్తా బ్యారేజ్‌ అవుతుందని, అలా చేయాలని చూస్తే ఈ ప్రభుత్వాలకు ప్రజలే పంగనామాలు పెడతారని హెచ్చరించారు. ఒకే తరహా రాజకీయం చేస్తున్న బీజేపీ, వైసీపీలు పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎందుకు కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై అఖిలపక్షం అధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి చేయమంటే… ఒక్కడే మోదీ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి రావడం జగన్‌ పనిగా మారిందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. విజయవాడలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే అంశాలపై సీఎం స్పందించాలని డిమాండ్‌ చేశారు. తన తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టును తాను పూర్తి చేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం జగన్‌…మాట నిలబెట్టుకోవాలన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే చరిత్రహీనుడిగా జగన్‌ మిగులుతారని హెచ్చరించారు. పోలవరానికి నిధులు రాబట్టి ప్రాజెక్టు పూర్తి చేయటం ముఖ్యమంత్రి ఒక్కడివల్ల అయ్యే పనికాదని, అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లాలని సీఎం జగన్‌కు సూచించారు. రైతుసంఘాల నాయకులతో చర్చించి పోలవరం పూర్తిస్థాయి నిర్మాణం చేయాలనే డిమాండ్‌తో దిల్లీస్థాయిలోనూ భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గేటు కూడా పెట్టని వారు ప్రాజెక్టు నిర్మిస్తారా: దేవినేని ఉమ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ టీడీపీ అధికారంలో ఉండగా పోలవరం కోసం ఐదేళ్లలో రూ.68 వేల కోట్లు ఖర్చుచేసి 71 శాతం పనులు పూర్తి చేసినట్లు చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత డ్యామ్‌సైట్‌లో 15 నెలల పాటు ఎలాంటి పనులు చేయకుండా గాలికొదిలేశారన్నారు. కేంద్ర జలమండలి(సీడబ్ల్యూసీ), హైదరాబాద్‌ ఐఐటీ వారు వచ్చి చెప్పేవరకు పోలవరం ప్రాజెక్టు పరిస్థితి సీఎంకుగానీ, అధికారులకుగానీ తెలియదన్నారు. పులిచింతల, గుండ్లకమ్మకు గేట్లు పెట్టలేని వారు పోలవరం ఎలా నిర్మించగలరని ప్రశ్నించారు. సీపీఐ చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందన్నారు.
పూర్తిస్థాయి నిర్మాణానికి చర్యలు: గిడుగు రుద్రరాజు
ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన చట్టం ద్వారా పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఏర్పాటు చేస్తే టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కేంద్రం 10 శాతం నిధులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించటం ద్వారా గతంలో పేర్కొన్న నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేకుండా తప్పించుకుంటున్నారని చెప్పారు. పూర్తిస్థాయిలో పోలవరం నిర్మించటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
గిరిజనులకు అన్యాయం: బాబూరావు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ గిరిజనులకు పునరావాసం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. 138 అడుగుల ఎత్తు నీరు వస్తేనే పోలవరం కాంటూరు ముంపుకు గురైయిందని గుర్తు చేశారు. 18ఏళ్లు నిండిన ప్రతి గిరిజనుడికి నష్టపరిహారం ఇస్తానన్న జగన్‌ వాగ్దానం ఏమైయిందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్లు బాగుపడాలని, గిరిజనులకు అన్యాయం చేయటమే ప్రభుత్వాల పనిగా ఉందని విమర్శించారు.
డ్యాన్సులేసే వారు డ్యామ్‌లు కడతారా: పోతిన మహేశ్‌
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్‌ మాట్లాడుతూ 41 మీటర్ల ఎత్తుకు కుదిస్తే జీవనాడి చచ్చిపోతుందన్నారు. పోలవరం అంచనాలను పదేపదే కేంద్రం ఎందుకు సవరిస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. డ్యాన్సులేసే వారు మంత్రులుగా ఉంటే డ్యామ్‌లు ఎలా నిర్మిస్తారని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు జగన్‌ అమ్ముడుపోయాడనే అనుమానం కలుగుతుందన్నారు. ఎత్తు తగ్గిస్తే బ్యారేజీగా కూడా పోలవరం ఉపయోగపడదన్నారు.
ఎత్తు తగ్గించే హక్కు ఎవరికీ లేదు: భవానీప్రసాద్‌
రైతు సంఘం నాయకులు అక్కినేని భవానీప్రసాద్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే హక్కు ఎవరికీ లేదని, కానీ ఇది బీజేపీ ప్రభుత్వం కుట్ర అని అభివర్ణించారు. రాష్ట్రంలో నీటి వనరులను సద్వినియోగం చేసుకోవటం, వ్యవసాయం అభివృద్ధి, పరిశ్రమల అవసరాలు తీర్చటం కోసం పోలవరాన్ని డిజైన్‌ చేశారని వివరించారు. పోలవరం పూర్తిస్థాయిలో నిర్మాణం రాజకీయ పక్షాల ఐక్య ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందన్నారు.
ఎన్టీఆర్‌ జిల్లా, విజయవాడ నగర కార్యదర్శులు సీహెచ్‌ కోటేశ్వరరావు, జి.కోటేశ్వరరావు అధ్యక్షతన విజయవాడ లెనిన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యులు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గసభ్యులు దోనేపూడి శంకర్‌, పెన్మెత్స దుర్గాభవాని, నగర, జిల్లా నేతలు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ రాష్ట్రకార్యదర్శివర్గసభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన దీక్షలో పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు ప్రసంగించారు.
కర్నూలులో
రెండవ రోజులు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నిరసన దీక్షలు జరిగాయి. కర్నూలులో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామాంజనేయులు, నంద్యాలలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎన్‌.రంగనాయుడు దీక్షలు ప్రారంభించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, దీనిని ఎత్తు తగ్గిస్తే మినీ ప్రాజెక్టుగా మారుతుందన్నారు. యథావిథిగా ప్రాజెక్టు ఎత్తు కొనసాగించి ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని వారు డిమాండ్‌ చేశారు.
ఏలూరులో
ఏలూరు కలెక్టరేట్‌ వద్ద రెండో రోజు దీక్షల్లో సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి ఉప్పులూరి హేమశంకర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు బాడిస రాము, మైసాక్షి వెంకటాచారి, సన్నేపల్లి సాయిబాబు, జమ్మి శ్రీను, కారం ధారయ్య, బత్తుల వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
భీమవరంలో
భీమవరంలో జిల్లా కలెక్టరేట్‌ వద్ద సీపీఐ అధ్వర్యంలో దీక్షలు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాద్‌, కళింగ లక్ష్మణరావు, సికిలే పుష్పకుమారి, నెక్కంటి క్రాంతి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
అమలాపురంలో: అమలాపురంలో సీపీఐ అధ్వర్యంలో కలెక్టరేట్‌లో వినతిపత్రం సమర్పించారు. పెద్దిరెడ్డి రాము, శీలం వెంకటేశ్‌, నిమ్మకాయల శ్రీనివాసరావు తదితరులు నాయకత్వం వహించారు.
రాజమహేంద్రవరంలో
స్థానిక కలెక్టరేట్‌ వద్ద జరిగిన సీపీఐ ధర్నాలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, జిల్లా సహాయ కార్యదర్శి, జట్ల లేబర్‌ యూనియన్‌ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు, నగర కార్యదర్శి వి. కొండలరావు, సీపీఐ నిడదవోలు కార్యదర్శి ఎం. ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

జగన్‌ మౌనం వీడాలి: జల్లి విల్సన్‌
పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ బాపట్ల కలెక్టరేట్‌ రోడ్‌లో సామూహిక దీక్ష చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నీటి సామర్థ్యం తగ్గించే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తిస్థాయి 45.72 మీటర్ల నీటిమట్టంతో నిర్మించి ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను తీర్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నిస్తే, ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఎత్తు తగ్గిస్తామన్నా నోరు మెదపకపోవడం దారుణమని, ఇకనైనా ఆయన మౌనం వీడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img