Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఫిబ్రవరిలో గగన్‌యాన్‌ తొలి ప్రయోగం-ఇస్రో

న్యూదిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గగన్‌యాన్‌ తొలి ప్రయోగం జరుగుతుందని ఇస్రో తెలిపింది. ఒకదాని తర్వాత ఒకటిగా పరీక్షలను క్రమంగా నిర్వహిస్తామని భారతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) సీనియర్‌ అధికారి గురువారం తెలిపారు. చినూక్‌ హెలికాప్టర్‌, సీ`17 గ్లోబ్‌మాస్టర్‌ రవాణా విమానాన్ని క్రూ మాడ్యూల్‌ పరీక్షల్లో వాడాలని భావిస్తున్నట్లు ఇస్రో హ్యూమన్‌ స్పేస్‌ ఫ్లైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఆర్‌.ఉమామహేశ్వరన్‌ అన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ఈ క్రూ మాడ్యుల్‌లోనే వ్యోమగాములను మూడు రోజులు అంతరిక్షంలో గడుపుతారని తెలిపారు. భారతీయ అంతరిక్ష సదస్సులో ఉమామహేశ్వరన్‌ మాట్లాడారు. భూమి చుట్టూ తిరిగే క్రమంలో క్రూ సర్వీస్‌ మాడ్యూల్‌లో వ్యోమగాములకు అనుకూలమైన జీవావరణం ఉండేలా వాతావరణ నియంత్రణ వ్యవస్థ డిజైన్‌ను ఇస్రో పూర్తి చేసిందన్నారు. వచ్చే ఏడాది డిసెంబరులో మానవరహిత అంతరిక్ష నౌకాయానానికి ముందు 17 వేర్వేరు పరీక్షలను నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధమైనట్లు తెలిపారు. 2022లో గగన్‌యాన్‌ మిషన్‌ను చేపడతామని 2018, ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి మోదీ ప్రకటించారుగానీ కోవిడ్‌ కారణంగా మిషన్‌ ఆలశ్యమైంది. 2024 చివరిలో లేదా 2025 ఆరంభంలో భారతీయ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్పేస్‌ కాప్య్సూల్‌ బయట ఉష్ణోగ్రత 2000 డిగ్రీల సెల్సియస్‌కుపైగా నమోదయ్యే అవకాశముంది. కాబట్టి వ్యోమగాములకు అనుకూలమైన పరిస్థితులు, ఉష్ణోగ్రత ఉండేలా క్రూ మాడ్యూల్‌, వాతావరణ నియంత్రణ వ్యవస్థ తయారీ జరుగుతోంది. ఇది సవాళ్లభరితంగా సాగుతోంది. వ్యోమగాములు కూర్చొనే, ఎగిరేందుకు ఏర్పాట్లు పూర్తి కాగా మరో ఆరు నెలల్లో క్రూ మాడ్యూల్‌ సిద్ధమవుతుందని ఉమామహేశ్వరన్‌ చెప్పారు. ప్రాణ వాయువు అందిస్తూ బొగ్గుపులుసు వాయువును బయటకు పొందుతూ, తేమ లేకుండా ఉష్ణోగ్రతలు తగిన విధంగా ఉంటూ అగ్ని ప్రమాదాలకు తావు ఇవ్వని క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానంతో క్రూ మాడ్యుల్‌ రూపుదిద్దుకుంటున్నదని అన్నారు. వాతావరణ నియంత్రణ వ్యవస్థను దేశీయ పరిజ్ఞానంతో తయారు చేయాలని ముందే నిర్ణయించినట్లు తెలిపారు. ‘మనకు సామర్థ్యం ఉన్నాగానీ తయారీ కాస్తంత ఎక్కువ సమయం పడుతోందని చెప్పారు. డిజైన్‌ మొత్తం పూర్తి అయిందని, ఇప్పుడు అది సురక్షితమని నిరూపించాల్సి ఉందని అన్నారు. నలుగరు వ్యోమగాములను ఎంపిక చేయగా వారికి రష్యాలో ప్రాథమిక శిక్షణ పూర్తి అయిందని, తదుపరి శిక్షణను బెంగళూరులోని వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో వారు పొందుతున్నారని ఉమామహేశ్వరన్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img