Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఫీజు నియంత్రణ ఎక్కడ?

జాడలేని కమిషన్లు


. పాఠశాల, ఉన్నత విద్యలో దోపిడీ
. సీబీఎస్‌ఈ సిలబస్‌ పేరుతో భారీ ఫీజులు
. చట్టాలు అలంకారప్రాయం
. వేలాది కోట్ల ఖర్చు వృథా… ప్రయోజనం శూన్యం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పాఠశాల, ఉన్నత విద్యలో అధిక ఫీజుల నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన కమిషన్లు నిర్వీర్యంగా మారుతున్నాయి. సీఎం జగన్‌ ఆశయం మేరకు పాఠశాల, ఉన్నత విద్యా పరిరక్షణ కోసం ఫీజు రెగ్యులేటరీ, మానటరింగ్‌ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. వాటికి ప్రత్యేకంగా కార్యాలయాలు, చైర్మన్‌, పాలకవర్గాలు, అధికారులను నియమించారు. వారికి లక్షల కొద్దీ వేతనాలు కేటాయిస్తున్నారు. మూడున్నరేళ్లలో ఫలితాలు మాత్రం నిరాశాజనకంగానే ఉంటున్నాయి. పాఠశాల విద్యలో ఫీజుల నియంత్రణ కోసం తీసుకొచ్చిన 53, 54 జీవోలను సైతం అమలు చేయించలేకపోయారు. ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యం తరపున అసోసియేషన్లు కోర్టును ఆశ్రయించడంతో అవి నిర్వీర్యమయ్యాయి. 202223 విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ, ఇంతవరకు ఫీజు నియంత్రణపై కదలిక లేదు. ఆయా చైర్మన్ల అధ్వర్యంలో ఒక్క సమావేశం కూడా జరగలేదు. ఇదే అదునుగా కార్పొరేట్‌/ప్రైవేట్‌ విద్యా సంస్థలు ఇష్టానుసారంగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌తో వివిధ కార్పొరేట్‌ విద్యా సంస్థలను నడుపుతూ భారీగా ఫీజులు దండుకుంటున్నప్పటికీ, కమిషన్ల చైర్మన్లు చర్యలు చేపట్టడం లేదు. శాసనసభ సాక్షిగా చేసిన చట్టాల ఆధారంగా ఏర్పడిన కమిషన్లు నీరుగారిపోతున్నాయి. దీని కార్యకలాపాల అమలు కోసం విద్యార్థి, యువజన సంఘాలు, ఏపీ పేరెంట్స్‌ అసోసియేషన్‌ ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినప్పటికీ కదలిక లేదు. పెద్దఎత్తున ప్రజాధనం వినియోగించి ఏర్పాటు చేసిన ఈ చట్టాల వల్ల ఉపయోగం ఏమిటనేదీ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న విద్యాసంస్థలను ఆ కమిషన్లు నియంత్రించలేక పోయాయి. మూడున్నరేళ్ల నుంచి ప్రభుత్వం కల్పించిన అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ పదవులు అనుభవిస్తున్నారుగానీ, పర్యవేక్షణకు ముందుకు వెళ్లకపోవడం పై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టాల అమలుకు అధికారులు సైతం ఎవరూ ముందుకు రావడం లేదు.
అనుమతుల్లేకుండా కార్పొరేట్‌ కళాశాలలు
ఇంటర్మీడియట్‌ బోర్డు అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా కార్పొరేట్‌ విద్యా సంస్థలు జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాయి. బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా లక్షల రూపాయల ఫీజుల దోపిడీ చేస్తున్నాయి. బోర్డు పాఠ్యాంశాలను బోధించకుండా ఇంటర్‌ మొదటి సంవత్సరం నుంచే జేఈఈ`మెయిన్స్‌, అడ్వాన్స్‌, ఎంసెట్‌, నీట్‌ కోచింగ్‌ కేంద్రాలను నడుపుతున్నారు. అర్హతలేని అధ్యాపకులతో బోధన కొనసాగిస్తున్నారు. అపార్టుమెంట్లు, దుకాణాల సముదాయాల్లో కళాశాలలను ఏర్పాటు చేసినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్లు నిద్రావస్థలో ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్‌ ప్రవేశాల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం, కేవలం ఎంపీసీ, బైపీసీ గ్రూపులనే నడపడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎంపీసీ, బైపీసీకి రకరకాల పేర్లతో జేఈఈ, నీట్‌ కోచింగ్‌ ఇస్తూ, లక్షలాది రూపాయల ఫీజును దోచుకుంటున్నారు. ఒకే గ్రూపును వివిధ రకాల పేర్లతో నిర్వహించడం వల్ల విద్యార్థుల మధ్య వివక్షత, వ్యత్యాసాలు వస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన కార్పొరేట్‌ కళాశాలలు ఇదే విధానాన్ని అవలంభిస్తూ, విద్యను వ్యాపారమయం చేస్తున్నాయి.
175 కళాశాలల రద్దు అమలయ్యేనా?
రాష్ట్రంలోని 175 ప్రైవేటు జూనియర్‌ కళాశాలల అనుమతులు రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంత వరకు అమలవుతుందనేదీ ప్రశ్నార్థకంగా మారింది. గతంలో విజయవాడ బెంజిసర్కిల్‌ దగ్గర కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలకు అనుమతులు రద్దు చేసినప్పటికీ, అధికారులతో లోపాయీకారి ఒప్పందం కుదర్చుకుని, దానిని యథాతథంగా నడుపుతున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్య, జేఈఈ, నీట్‌ పోటీ పరీక్షలకు శిక్షణావకాశాలు లేనందునే… విద్యార్థులు, తల్లిదండ్రులు కార్పొరేట్‌ కళాశాలల వైపు చూస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు జేఈఈ, నీట్‌, ఎంసెట్‌ పోటీ పరీక్షలకు ఉన్నతమైన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చట్టపరమైన, న్యాయపరమైన విధానంతో ముందుకెళ్లాలి. విద్య పేరుతో దోపిడీ చేస్తున్న విద్యా వ్యాపారుల అక్రమాలను అరికట్టాల్సి ఉంది. ఇప్పటికైనా సీఎం జగన్‌ స్పందించి పాఠశాల, ఉన్నత విద్య ఫీజు నియంత్రణ కమిషన్ల కార్యకలాపాలు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img