Friday, April 26, 2024
Friday, April 26, 2024

అమెరికాలో కార్మిక సంఘాల పునరుజ్జీవనం

. నామమాత్రపు వేతనాలపై సిబ్బందిలో అసంతృప్తి
. యూనియన్లలో చేరేందుకు దిగ్గజ సంస్థల ఉద్యోగుల ఆసక్తి
. 200 స్టార్‌బక్స్‌ అవుట్‌లెట్లలో సంఘాల ఏర్పాటు

వాషింగ్టన్‌ : ప్రపంచ వ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు, మహత్తర పోరాటాల ద్వారా హక్కులు, పని గంటల తగ్గింపు సాధనకు దోహదం చేసింది అమెరికా చికాగోలోని హేగ్‌ మార్కెట్‌లో 1860, మే 1 కార్మికుల సమ్మె. ఆనాటి సమ్మెపై పోలీసులు కాల్పులు జరిపి ఆరుగురి ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకు మేడే జరుపుకుంటూ ఇప్పటికీ కార్మికులు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాలు జరుపుతూనే ఉన్నారు. అయితే కార్మికుల హక్కులను, సాధించుకున్న సౌకర్యాలను తుంగలో తొక్కడానికి అనేక దేశాలలో మితవాద, మతవాద ప్రభుత్వాలు పాలనలోకి రావడం విచారకరం. ఉద్యమాలకు నాంది పలికిన అమెరికాలో కార్మిక యూనియన్లు మళ్లీ ప్రభవిస్తున్నాయి. అక్కడ గంటల ప్రకారం పనులు చేస్తూ చదువుకోవడం వల్ల యూనియన్ల్లు ఏర్పాటు చేయడం కష్టంగా మారింది. ఇప్పుడు ప్రపంచ వాణిజ్య మార్కెట్లను ముంచెత్తుతున్న గూగుల్‌, అమెజాన్‌ లాంటి దిగ్గజాలైన సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులు యూనియన్లలో చేరడానికి ఇష్టపడుతున్నారు.
గత డిసెంబర్‌ నుంచి దేశవ్యాప్తంగా 200 స్టార్‌బక్స్‌ అవుట్‌లెట్స్‌లో కార్మికులు, ఉద్యోగులు యూనియన్లు ఏర్పాటు చేసుకున్నారు. ఒక్లహోమిలోని యాపిల్‌ స్టోర్‌లో పది రోజుల క్రితం 71 శాతం మంది యూనియన్‌లో చేరడానికి ఓటు వేశారు. ఆ తర్వాత మేరీలాండ్‌లోని యాపిల్‌ స్టోర్‌లోనూ యూనియన్‌ ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. 1965 తర్వాత ఈ సంస్థల బ్రాంచిలున్న అనేకచోట్ల 71 శాతం మంది కార్మికులు యూనియన్లు ఏర్పాటులో నిమగ్నమయ్యారు. 1930లలో ప్రపంచాన్ని కల్లోలపరిచిన మహామాంద్యం అనంతరం అనేక దశాబ్దాల తర్వాత అత్యంత వేగంగా యూనియన్లు ఏర్పాటు కావడం విశేషం. 2021 తర్వాత యూనియన్ల ఏర్పాటు ప్రక్రియ 58 శాతం పెరిగింది. ఆధునిక కాలంలో స్థాపిస్తున్న నూతన సంస్థల్లో పనిచేస్తున్న వారే యూనియన్ల ఏర్పాటుకు ప్రధానంగా ముందుకు వస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌ పరిధిలోని స్టాటెన్‌ దీవిలో అతిపెద్ద అమెజాన్‌ గిడ్డంగిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులు యూనియన్‌ ఏర్పాటు చేసుకోవడంతో కార్పొరేట్‌ బాస్‌లు కళ్లుతెరుచుకొని సమావేశమై ఈ పరిణామాలను చర్చించారు.
ఇప్పుడెందుకు ఈ పరిణామం: కాలేజీల్లో చదువుకుంటూ వివిధ సంస్థల్లో పనిచేస్తున్న వారు యజమానులు అపారంగా లాభాలు పొందుతూ, తమకు అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని గ్రహించి యూనియన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నత విద్య చదువుతున్న వారు తమకు ఇంత తక్కువ వేతనాలివ్వడం ఏమిటని ఆగ్రహం చెందుతున్నారు. కోవిడ్‌19 మహమ్మారి కూడా పని చేస్తున్న వారిలో అభద్రతకు దారితీసింది. కంపెనీల యజమానులు రోజు రోజుకూ అపార సంపన్నులవుతూ, అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, దిగువ తరగతి పనిచేస్తున్న వారు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని వివిధ అధ్యయనాలు వెల్లడిరచాయి. కోవిడ్‌ కాలంలో భద్రతా సౌకర్యాలు, కనీసం మాస్కులు కూడా కల్పించలేదని అమెజాన్‌ గిడ్డంగిలో కార్మికులంతా వాకౌట్‌ చేశారు. ఉన్నత విద్యాలయాల్లో విద్యార్థులు మంచి వేతనాలు, గౌరవం, అవసరమైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం లేదని నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్‌ మహమ్మారి కాలంలో వేలాది మందిని పనుల నుంచి తొలగించడం, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్న తర్వాత తక్కువ వేతనాలివ్వడంపై ఆగ్రహం చెందుతున్నారని సిటీ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌లో పని చేస్తున్న కార్మికవర్గంపై అధ్యయనం చేస్తున్న రత్‌మిల్క్‌మని తెలిపారు. 1970 తర్వాత అమెరికాలో ఉత్పాదకత అపారంగా పెరిగినప్పటికీ వేతనాలు పెద్దగా పెరగలేదు. ప్రభుత్వం అమలుచేస్తున్న విధానాలే ఇందుకు కారణం. 19792021 మధ్య కాలంలో గంటకు ఆర్థికపరంగా ఆదాయం 62.5 శాతం పెరగగా, వేతనాలు మాత్రం 15.9 శాతం మాత్రమే పెరిగాయని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ దుస్థితికి విధానపరమైన నిర్ణయాలే కారణం. యూనియన్ల ఏర్పాటు ద్వారానే వేతనాలు, హక్కులు సాధించుకోవచ్చన్న అభిప్రాయాన్ని కార్మికులు, ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img