Friday, April 26, 2024
Friday, April 26, 2024

బడ్జెట్‌ సంపన్న వర్గాలకేనా?

కేంద్ర వైఖరికి నిరసనగా 10న కేంద్ర కార్యాలయాల ఎదుట నిరసనలు

. నిరుద్యోగ యువత, రైతులు, సామాన్యులకు దగా
. ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది?
. అదానీకి మోదీ, జగన్‌ ఊడిగం
. ప్రధాని జాతికి క్షమాపణ చెప్పాలి
. జగనన్న, టిడ్కో ఇళ్లపై నేడు నిరసనలు
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : కేంద్ర బడ్జెట్‌లో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, రైతులకు సబ్సిడీ, ధరల నియంత్రణ లేకుండా కేవలం సంపన్న వర్గాలకే పెద్దపీట వేయడాన్ని నిరసిస్తూ ఈనెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట సీపీఐ అధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. సీపీఐ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ నిరసనలు జరుగుతాయన్నారు. విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం రామకృష్ణ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీకి అప్పనంగా దోచిపెడుతున్నాయని, అన్ని విధాలా ఆయనకు సహకరిస్తున్నాయని మండిపడ్డారు. పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ సామాన్యులను మరింత ఇబ్బంది పెట్టేలా ఉందని, వారిపై ఏ మాత్రమూ కనికరం చూపలేదన్నారు. బడ్జెట్‌లో ప్రధాన సమస్యలపై ప్రస్తావనే లేదని, దేశ వ్యాప్తంగా పెరిగిన ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే, వాటి నియంత్రణపై చర్యలు శూన్యమని, వాటిపై స్పందించలేదని తెలిపారు. నాడు ప్రధాని మోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారన్నారు. ఎరువులపై సబ్సిడీ ఎత్తివేశారని, గిట్టుబాటు ధరలు లేవని ధ్వజమెత్తారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం… బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నిరుద్యోగులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా దగా చేసిందని, కేవలం కార్పొరేట్‌ వర్గాల ఆస్తులు పెంచేలా, సంపన్నులకు మేలు కలిగేలా బడ్జెట్‌ ఉందని విమర్శించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, అప్పుల బారి నుంచి, ఆత్మహత్యల నుంచి కాపాడాతమంటూ ఘనంగా చెప్పిన మోదీ… ఈ బడ్జెట్‌లో వారికోసం ఎలాంటి చర్యలు లేవన్నారు. 2023 వచ్చాక కూడా రైతుల సంక్షేమానికి కృషి చేయలేదని, దాదాపు రూ.50 వేల కోట్ల ఎరువుల సబ్సిడీ కోత విధించారని, ప్రత్తి పండిరచే రైతులకు గిట్టుబాటు ధర ప్రస్తావనే లేదని, కేంద్రం సామాన్యుల సమస్యలపై మౌనం దాల్చిందని తప్పుపట్టారు. పేదరికం తగ్గింపునకు బడ్జెట్‌లో ప్రస్తావించలేదన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌నూ కేంద్రం పదేపదే దగా చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, అక్కడ నిధులు కేటాయిస్తోందని విమర్శించారు. విభజన హామీలు, ఏపీకి ప్రత్యేక హోదా తదితర అంశాల్లోనూ రాష్ట్రానికి కేంద్రం అడుగడుగునా అన్యాయం చేస్తోందన్నారు. విభజన చట్టంలో ఉన్న విశాఖ రైల్వే జోన్‌, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు నిధులు లేవని దుయ్యబట్టారు. విశాఖ రైల్వే జోన్‌ కోసం రూ.170 కోట్లు కేంద్రం కేటాయించాల్సి ఉండగా గత సంవత్సరం బడ్జెట్‌లో రూ.50 లక్షలు కేటాయించగా ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయించారని వివరించారు. ఈ కేటాయింపులతో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటెలా సాధ్యమని, అసలు విశాఖ రైల్వే జోన్‌ ఉన్నట్టా?, లేనట్టా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఉన్న కరవు ప్రాంతాలు గుర్తుకువచ్చిన కేంద్రానికి ఆంధ్ర ప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలు గుర్తులేకపోవడం దుర్మార్గమన్నారు. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెల్లడయ్యాక ప్రపంచం అంతా చర్చిస్తుంటే… ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మాత్రం అంతా బాగానే ఉందని, దాని ప్రభావం భారత్‌పై ఏ మాత్రమూ ఉండబోదని చెప్పడం విచాకరమన్నారు. ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ షేర్ల ధరలు తగ్గిపోయినట్లు స్పష్టమవుతోందని, అదానీ కంపెనీలన్నీ దివాలా తీస్తున్నాయని వివరించారు. ఆంధ్రాలో అదానీ కంపెనీకి భూములిచ్చిన రైతులంతా వాటిపై వెనక్కి వస్తున్నారన్నారు. సీఎం జగన్‌ సైతం పూర్తి స్థాయిలో అదానీ అడుగులకు మడుగులొత్తారని, జగన్‌ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో అగ్రిమెంట్లు అన్నీ అదానీకే చేశారని ధ్వజమెత్తారు. బలవంతంగా దౌర్జన్యం చేసి కృష్ణపట్నం పోర్టును అదానీకే అప్పగించారని, థర్మల్‌ ప్రాజెక్టునూ ఆయనకే కట్టబెట్టారని, ప్రభుత్వానికి చెందాల్సిన గంగవరం పోర్టునూ అదానీకే కైవసం చేశారని వివరించారు. అదానీ డేటా సెంటర్‌ పేరుతో వందల కోట్ల విలువైన 130 ఎకరాల భూములను కట్టబెట్టారని వివరించారు. సోలార్‌ ఎనర్జీ పేరుతో వేలాది ఎకరాలను అనంతపురం జిల్లాలో ఆయనకే కట్టబెట్టారన్నారు. అదానీ దొంగ కంపెనీలతో మొత్తం ప్రపంచాన్నే మోసగిస్తున్నారని మండిపడ్డారు. నాడు రూ.8 వేల కోట్ల ఆర్థిక ఆరోపణలపై సత్యం రామలింగరాజు జైలుకు వెళ్లారని, అదానీపై మాత్రం లక్షల కోట్ల రూపాయల స్కామ్‌ బయటపడినా చర్యలు లేవని, ప్రధాని మోదీ ఎందుకు నోరు తెరవడం లేదని ప్రశ్నించారు. ప్రపంచంలోనే మూడేళ్లలో రూ.10 లక్షల కోట్ల ఆస్తిని కూడబెట్టిన వారెవరైనా ఉన్నారా? ఏ కంపెనీ అయినా ఉందా? అని కేంద్రాన్ని నిలదీశారు. అదానీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గులేకుండా మద్దతిస్తున్నాయని అన్నారు. భారతదేశం అంటే అదానీ, ప్రధానేనా?, 140 కోట్ల మంది ప్రజానీకం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పేదవారికి అన్నీ చేస్తున్నామంటూ చెబుతున్న జగన్‌… వారికి ఒక గూడు కూడా కట్టి ఇవ్వలేక పోతున్నారని, లక్షా 80 వేల రూపాయలతో లబ్ధిదారులు ఎలా ఇళ్లు కట్టించుకుంటారంటూ ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్‌ ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. ట్రాక్టరు ఇసుక రూ.8 వేలకు, లారీ ఇసుక రూ.40 వేలకు పెరిగిందని తెలిపారు. ఇంకా పేదల ఇళ్లు ఎక్కడ కట్టుకుంటారని ప్రశ్నించారు. ఇసుక, సిమెంట్‌ ఉచితంగా ఇవ్వాలని, ప్రతి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. టిడ్కో ఇళ్లు పూర్తయి పాడైపోతున్నప్పటికీ లబ్ధిదారులకు ఇవ్వకుండా నాశనం చేస్తున్నారని విమర్శించారు. జగనన్న ఇళ్ల సమస్యలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కట్టిన వేలాది టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 6న తలపెట్టిన నిరసనకు పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ రెడ్డి, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img