Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేంద్ర ఉద్యోగులకు 4శాతం డీఏ పెంపు?

న్యూదిల్లీ: కోటి మంది ఉద్యోగులు, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. ప్రస్తుతం అంగీకరించిన ఫార్ములా ప్రకారం కరువు భత్యాన్ని మరో నాలుగు శాతం పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 38 శాతంగా ఉన్న డీఏను 42 శాతానికి పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని లేబర్‌ బ్యూరో ప్రతి నెలా పారిశ్రామిక రంగ కార్మికుల కోసం వినియోగదారుల ధరల సూచీని రూపొందిస్తుంది. దీని ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏ నిర్ణయిస్తారు. ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి శివ గోపాల్‌ మిశ్రా ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ 2022 డిసెంబరు సీపీఐ`ఐడబ్ల్యూ 2023 జనవరి 31న విడుదలైందని చెప్పారు. డీఏ పెంపు 4.23గా ఉండాలని లెక్కలు చెబుతున్నాయన్నారు. అయితే దశాంశ స్థానాల్లో ఉన్నదానిని పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించదని తెలిపారు. అందువల్ల డీఏ 4 శాతం పెరగవచ్చునని చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయాల శాఖ డీఏ పెంపు ప్రతిపాదనలను సిద్ధం చేసి, ఆ పెంపు వల్ల భరించవలసిన పర్యవసానాలను వివరిస్తుందని, దీనికి సంబంధించిన నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోదం కోసం పంపిస్తారన్నారు. డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటే, ఆ పెంచిన డీఏ 2023 జనవరి 1 నుంచి వర్తిస్తుంది. 2022 సెప్టెంబరు 28న డీఏ సవరణ జరిగింది. అది 2022 జులై 1 నుంచి అమలవుతోంది. అఖిల భారత వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ఈ మదింపు చేశారు. 2022 జూన్‌తో ముగిసిన 12 నెలల నెలవారీ ధరల సగటు ఆధారంగా ఈ డీఏ నిర్ణయించారు. అప్పుడు కూడా నాలుగు శాతమే పెంచారు. పెరిగే ధరల భారానికి పరిహారంగా డీఏను ప్రభుత్వం చెల్లిస్తుంది. కొంతకాలంలో జీవన వ్యయం పెరుగుతూ ఉంటుంది. ఇది సీపీఐ-ఐడబ్ల్యూలో వెల్లడవుతుంది. డీఏను సంవత్సరంలో రెండుసార్లు సవరిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img