Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

‘మన్యం’ అభివృద్ధి పట్టదా..?

గిరిజన పంచాయతీల్లో కానరాని రోడ్డు, రవాణా సౌకర్యం
ఆసుపత్రులకు డోలీల్లోనే గర్భిణులు, బాలింతల తరలింపు
వందలాది కుటుంబాలకు అందని పథకాలు

చింతపల్లి : స్వాతంత్య్రం సిద్ధించి 70 ఏళ్ల పైబడినప్పటికీ విశాఖ ఏజెన్సీ మారుమూల పంచాయతీలు నేటికీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం, కుడుముసారి, తమ్మేంగుల, అంజలి శనివారం, ఎర్రబొమ్మల, గొందిపాకల పంచాయతీలలోని సుమారు 120 గ్రామాలలో అనేక కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు నోచుకోవడం లేదంటే అతిశయోక్తి కాదు. అనేక గ్రామాలలో నేటికీ రహదారి, రవాణా సౌకర్యాలు లేవు. ఈ దుస్థితికి పాలకులు, అధికారుల వైఫల్యం అనడంలో సందేహం లేదు. అత్యవసర సమయాల్లో గర్భిణులు, బాలింతలకు, దీర్ఘకాలిక రోగులకు, సీజనల్‌ వ్యాధిగ్రస్తులను వైద్య సేవల కోసం సుమారు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరం కర్రల మంచాలు, డోలీల సహాయంతో ప్రధాన రహదారి వరకు మోసుకొచ్చి అక్కడ నుంచి అంబులెన్స్‌ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రులకు తరలిస్తున్న దృశ్యాలు తరచూ కనిపిస్తున్నాయి. మన్యం ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు పొందాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. లేదంటే ఆయా కుటుంబాలు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు నోచుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. మారుమూల గ్రామాలకు సెల్‌ సంకేతాలు అందక కొంతమంది, వేలిముద్రలు పడక మరికొంతమంది, వివిధ కారణాలతో వృద్ధులకు, వితంతువులు, ఒంటరి మహిళలకు, మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా వంటి పథకాలు అందని పరిస్థితి నెలకొంది. బయోమెట్రిక్‌ వేసేందుకు పెద్ద పెద్ద వాగులు, వంకలు దాటుతూ సెల్‌ సంకేతాలు అందే అటవీ ప్రాంతాలకు వలంటీరు బయోమెట్రిక్‌ వేసేందుకు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో విశాఖ మన్యంలోని మారుమూల గ్రామాలలో రహదారి, రవాణా సౌకర్యాలతో పాటు సెల్‌ సంకేతాలను అందుబాటులోకి తీసుకురావాలని గిరిజన ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img