Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మూసేవాలా హంతకుల ఎన్‌కౌంటర్‌

అమృత్‌సర్‌ సమీపంలో భీకర కాల్పులు

అమృత్‌సర్‌: ప్రముఖ పంజాబీ గాయకుడు, కాంగ్రెస్‌ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు గ్యాంగ్‌స్టర్లను పంజాబ్‌ పోలీసులు బుధవారం ఎన్‌కౌంటర్‌ చేశారు. అమృత్‌సర్‌ సమీపంలోని భక్నా గ్రామంలో గ్యాంగ్‌స్టర్లు, పోలీసులు మధ్య భీకర కాల్పులు జరిగాయి. నాలుగు గంటలు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌ ముగిసిందని, ఇద్దరు ముఠా నాయకులను మట్టుబెట్టినట్లు పంజాబ్‌ డీజీపీ గౌరవ్‌ యాదవ్‌ తెలిపారు. మృతులను జగ్‌రూప్‌ సింగ్‌ రూపా, మన్‌ప్రీత్‌ సింగ్‌గా గుర్తించారు. వీరిద్దరూ మూసేవాలా హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో నిందితులు, అనుమానితులను పట్టుకునేందుకు గ్యాంగ్‌స్టర్‌ నిరోధక టాస్క్‌ఫోర్స్‌ కొంతకాలంగా ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగానే భక్నా గ్రామంలో గాలింపు చేపట్టగా గ్యాంగ్‌స్టర్లు కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు ఇద్దరిని హతమార్చారు. వారి నుంచి ఏకే 47, తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఏడాది మే 29న సిద్ధూ మూసేవాలా దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. స్నేహితులతో కలిసి సిద్ధూ మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా..కొందరు అడ్డగించి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సిద్ధూ అక్కడికక్కడే మృతిచెందారు. ముఠా కక్షల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. సిద్ధూ హత్య వెనుక గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ హస్తం ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో ఇప్పటివరకు చాలామందిని అరెస్టు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img