Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోదీ పాలనకు స్వస్తి పలుకుదాం

ప్రజాస్వామ్యం, లౌకిక వ్యవస్థలను కాపాడుకుందాం
. రాష్ట్రంలో జగన్‌ అరాచక పాలన బ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ
. ఎర్రజెండాలతో ఎరుపెక్కిన గోదావరి తీరం
. రాజమహేంద్రవరంలో కదంతొక్కిన కార్మికులు

విశాలాంధ్ర-రాజమహేంద్రవరం: దేశాన్ని తిరోగమనం వైపు తీసుకెళుతూ…ప్రజాస్వామ్య వ్యవస్థను సర్వనాశనం చేస్తున్న బీజేపీని ఓడిరచేంత వరకూ పోరాడతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ స్పష్టంచేశారు. 137వ మేడేను పరిస్కరించుకొని సీపీఐ, రాజమండ్రి జట్లు లేబర్‌ యూనియన్‌, ఏఐటీయూసీ అధ్వర్యంలో రాజ మండ్రిలో భారీ ప్రదర్శన, బహిరంగ సభను సోమవారం నిర్వహించారు. మెరక వీధిజెట్ల లేబర్‌ యూనియన్‌ కార్యాలయం నుండి ప్రారంభమైన కార్మిక ప్రదర్శన మెయిన్‌ రోడ్డు, మసీద్‌ సెంటర్‌, సీపీఐ కార్యాలయం, బైపాస్‌ రోడ్డు, అశోక థియేటర్‌, ఆజాద్‌ చౌక్‌, జాంపేట, సోమలమ్మ గుడి సెంటర్‌ మీదుగా కూరగాయల మార్కెట్‌ వరకు ప్రదర్శన జరిగింది. వేలాదిమంది కార్మికులు ఎర్రచొక్కాలు ధరించి… అరుణపతాకాలు చేబూని ర్యాలీలో పాల్గొన్నారు. సీపీఐ ప్రదర్శనతో గోదావరి తీరం ఎరుపెక్కింది. అనంతరం జరిగిన బహిరంగ సభకు జట్లు లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు కె.రాంబాబు అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ 9 ఏళ్ల మోదీ పాలనలో పేదలకు చేసిందేమీ లేదని విమర్శించారు. వంటగ్యాస్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను నిర్వీర్యం చేసిందన్నారు. ప్రభుత్వం రంగ సంస్థలను బడా కార్పొరేట్‌శక్తులకు కట్టబెట్టిందని ఆరోపించారు. 32 మంది ఆత్మబలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను అదానీకి కట్టబెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని మోదీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశంలో 21 రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి వచ్చాయని, మోదీ సర్కారును ఓడిరచే వరకు కమ్యూనిస్టుల పోరాటం ఆగదని రామకృష్ణ స్పష్టంచేశారు. రాష్ట్రంలో జగన్‌ తుగ్లక్‌ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దళితులు, ఆదివాసీలు, బహుజనులపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. అయినా ముఖ్యమంత్రికి చలనం లేదన్నారు. దళితులను హత్య చేసిన ఎమ్మెల్సీని జగన్‌ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. ప్రశ్నించే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీపై కక్షతో ఆమె భర్త, మామను అక్రమంగా అరెస్తు చేసి జైలుకు పంపారని మండిపడ్డారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. జట్లు సంఘానికి సీపీఐ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిట్టూరి ఆశయాలను ప్రతి కార్మికుడు ముందుకు తీసుకువెళ్లాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ మేడే చరిత్రను గుర్తుచేశారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను నాలుగు లేబర్‌ కోడ్లుగా విభజించి కార్మికులకు మోదీ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని మండిపడ్డారు. పాలకుల అనాలోచిత విధానాల కారణంగా సంఘటిత, అసంఘటిత కార్మికులు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు, ఆటో, హమాలీ, భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని గుర్తుచేశారు. పాలకులు కార్మికుల శ్రమను దోచుకుంటున్నారన్నారు. దేశ సంపదను బడాకార్పొరేట్‌లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అదానీ, అంబానీపై ఉన్న ప్రేమ సామాన్య, మధ్యతరగతి ప్రజలపైనా, కార్మికవర్గంపైనా ఎందుకు లేదని ప్రశ్నించారు. లౌకిక, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సభలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు, ఏఐటీయూసీ రాష్ట్ర కోశాధికారి బీవీ కొండలరావు, సీపీఐ నగర కార్యదర్శి వి.కొండలరావు, జట్లు సంఘం కార్యదర్శి సప్పరమణ, పెంటి దేముడు, వెంకటరావు, కాళ్ల అప్పలనాయుడు, నల్ల రామారావు, కె.జ్యోతి, రాజు తదితరులు ప్రసంగించారు.
వాడవాడలా అరుణపతాకాల ఆవిష్కరణ
మేడేను పురస్కరించుకుని సీపీఐ కార్యాలయం వద్ద అరుణపతాకాన్ని రామకృష్ణ ఆవిష్కరించారు. కూరగాయల మార్కెట్‌ వద్ద, అక్కినేని వనజ, జట్ల సంఘం కార్యాలయం వద్ద తాటిపాక మధు సీపీఐ జెండాలు ఆవిష్కరించారు. ఐరన్‌, అపరాలు అయిల్‌, రాజ్‌మహల్‌, పేపర్‌మిల్లు, టోల్‌ గేట్‌, ఆసుపత్రి, భవననిర్మాణం, కొత్తపేట, ఆనంద్‌నగర్‌, తడితోట తదితర సెంటర్లలో జెండా ఆవిష్కరణలు జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img