Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మోదీ’ బండ బాదుడు

. వంటగ్యాస్‌ రూ.50 పెంపు
. వాణిజ్య సిలిండర్‌పై రూ.350
. సామాన్యుడి నెత్తిన పిడుగు

న్యూదిల్లీ : మోదీ సర్కార్‌ బండ బాదుడు కొనసాగిస్తోంది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో స్తబ్దుగా ఉండే బీజేపీ ప్రభుత్వం ఆ ఎన్నికలు పూర్తవగానే ధరల పెంపుతో ప్రజలపై విరుచుకుపడుతోంది. గ్యాస్‌ సిలిండర్‌ ధరలు బుధవారం మరోసారి పెరిగాయి. వంట గ్యాస్‌ ధర సిలిండర్‌కు రూ.50 పెరిగింది. వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.350.50 పెంచింది. దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇది భారీ పెరుగుదల. మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన కొద్ది రోజులకే గ్యాస్‌ ధరలు పెంచడంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్‌ ప్రకారం దిల్లీలోని 14.2 కిలోల వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర ఇప్పుడు రూ.1,053 నుంచి రూ.1,103కి చేరింది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌) 14.2 కిలోల సబ్సిడీ లేని ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.1,103గా పేర్కొంది. ఉజ్వలయేతర వినియోగదారులకు ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీని చెల్లించదు. వంట గ్యాస్‌ రీఫిల్‌లను కొనుగోలు చేయడానికి వారు చెల్లించాల్సిన రేటు ఇది.
ఇక ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత కనెక్షన్‌ పొందిన 9.58 కోట్ల మంది పేదలకు ప్రభుత్వం సిలిండర్‌కు 200 రూపాయల సబ్సిడీ చెల్లిస్తుంది. వాటి ధర సిలిండర్‌కు రూ.903. కాగా, చివరిసారిగా జులై 4, 2022న గ్యాస్‌ సిలిండర్‌ ధరను సవరించారు. తాజా పెంపుతో ఎల్‌పీజీ ఇప్పుడు ముంబైలో 14.2 కిలోల సిలిండర్‌పై రూ.1,102.50, కోల్‌కతాలో రూ.1,129, చెన్నైలో రూ.1,118.50గా ఉంది. స్థానిక పన్నులను బట్టి రాష్ట్రానికి రాష్ట్రానికి రేట్లు మారుతూ ఉంటాయి. అలాగే, హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్‌పీజీ ధరను 19 కిలోల సిలిండర్‌కు రూ.350.5 మేర పెంచడంతో దాని ధర రూ.2,119.5కి చేరింది. ఈ పెరిగిన రేట్లతో చూస్తే తెలుగు రాష్ట్రాలలో సిలిండర్‌ ధర రూ.50 మేర పెరగడంతో మొత్తంగా రూ.1155కు చేరింది. హైదరాబాద్‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1155 కాగా.. ఆంధ్ర ప్రదేశ్‌లో ధర రూ.1161కి చేరింది.
ఇది నిజంగానే సామాన్యుడి నెత్తిన పెనుబారంగా మారనుంది. సిలిండర్‌ ధర పెరిగినా కూడా సబ్సిడీ రావడం లేదు. గతంలో సిలిండర్‌ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది కానీ ఇప్పుడు సబ్సిడీ కూడా ఎత్తివేయడంతో సామాన్యుల నెత్తిన పిడుగు పడినట్లయింది. ఒక సంవత్సరం క్రితం రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత వాణిజ్యపరమైన ఎల్‌పీజీ రేట్లు ఎక్కువ లేదా తక్కువ ఖర్చుతో సమానంగా పెరిగాయి. వాణిజ్య ఎల్‌పీజీ ధరలు చివరిసారిగా జనవరిలో సిలిండర్‌కు రూ.25 చొప్పున పెంచారు. హోలీకి ముందు ప్రభుత్వం ఇంధన రేట్లను, ముఖ్యంగా దేశీయ ఎల్‌పీజీని పెంచిందని ప్రతిపక్షం విమర్శించింది. మోదీ ప్రభుత్వ హయాంలో సామాన్యులు ద్రవ్యోల్బణంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ట్వీట్‌ చేశారు.
శివసేన-ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ ఠాక్రేకు చెందిన ప్రియాంక చతుర్వేది ఇది మోడీ ప్రభుత్వ హోలీ కానుక అని అన్నారు. ఇదిలాఉండగా, ఏటీఎఫ్‌ ధరను 4 శాతం తగ్గించారు. దీనిప్రకారం, దిల్లీలో విమాన ఇంధన ధరలు కిలోలీటర్‌కు రూ.4,606.50 తగ్గి రూ.1,07,750.27కి చేరాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img