Friday, April 26, 2024
Friday, April 26, 2024

రగులుతున్న పోరాట స్ఫూర్తి

భారత్‌బంద్‌కు సర్వత్రా మద్దతు

కేంద్రం మెడలు వంచుదాం

మోదీ కార్పొరేట్‌ అనుకూల విధానాలు తిప్పికొడదాం
భారత్‌బంద్‌నుజయప్రదం చేద్దాం
రామకృష్ణ్ణ, శ్రావణ్‌ పిలుపు

విశాలాంధ్ర`గుంటూరు : దేశచరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సంయుక్త కిసాన్‌ మోర్చా అధ్వర్యంలో 500 రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌ చరిత్రాత్మకమైందని, బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ మెడలు వంచాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 450 కార్మికసంఘాలు, కార్మిక ఫెడరేషన్‌లు, 19 రాజకీయ పార్టీలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయని, రాష్ట్రంలోని టీడీపీ బంద్‌కు మద్దతు ప్రకటించడంతో పాటు ప్రత్యక్షంగా బంద్‌లో పాల్గొంటుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27న జరిగే భారత్‌బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ సీపీఐ నగర సమితి అధ్వర్యంలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్‌ సమావేశం గుంటూరు మల్లయ్యలింగంభవన్‌లో శనివారం జరిగింది. సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ మోదీ ఏడేళ్ల పాలనలో రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలను పట్టించుకోలేదని, కార్పొరేట్‌శక్తుల అనుకూల విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. కార్మికులు, కష్టజీవులు, రైతులు పోగుచేసిన లక్షల కోట్ల రూపాయల సంపదను అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని కేంద్రంపై నిప్పులు చెరిగారు. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయలు, పోర్టులు, చివరికి పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను సైతం ప్రైవేటుపరం చేస్తున్నదని మండిపడ్డారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీకి కట్టబెట్టిన మోదీ ప్రభుత్వం మచిలీపట్నం పోర్టును సైతం ఇచ్చేందుకు సిద్ధమైందన్నారు. ప్రజల సంపదనే కాకుండా 60 శాతం జనాభా ఆధారపడి జీవిస్తున్న వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతోందని ధ్వజమెత్తారు. రైతు సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాలు బంద్‌లో పాల్గొనాలని, వర్తక, వాణిజ్య వర్గాలు, హోటల్‌, వాణిజ్య సంస్థల యాజమాన్యాలు బంద్‌కు సహకరించాలని కోరారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదయోగ్యం కాదని ఆరోపిస్తూ రైతు సంఘాలు 300 రోజులుగా దీక్షలు చేస్తున్నాయని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని చెప్పారు. గిట్టుబాటు ధరకు కేంద్రం బాధ్యత తీసుకోకపోవడం శోచనీయమన్నారు. చట్టాలు అమలు జరిగితే మార్కెట్‌ యార్డులు నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉందన్నారు. ఆన్‌లైన్‌లో పంట అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతుందని, ఈ విధానంలో బడాపెట్టుబడిదారులు ప్రవేశించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఫసల్‌ భీమా యోజన రైతుకు ఉపయోగపడేలా లేదన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ వ్యతిరేక విధానాలు ప్రత్యక్షంగానే కనబడుతున్నాయన్నారు. రైతుకు ఎరువు దొరకదని, పండిన పంటను అమ్ముకోలేని స్థితి, కౌలు రైతుకు రుణ సౌకర్యం లేదన్నారు. అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులు ఇబ్బందులు పడుతుంటే వారితో చర్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగంశెట్టి ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సంపదను అమ్ముకునే హక్కు మోదీ ప్రభుత్వానికి లేదన్నారు. మూడు నల్లచట్టాలను, నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా మోదీ కార్పొరేట్‌ విధానాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. దేశం కోసం, దేశ సార్వభౌమత్వం కోసం జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వెలుగూరి రాధాకృష్ణమూర్తి, టీడీపీ గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్జి నజీర్‌ అహ్మద్‌, ఎంసీపీఐ(యు) జిల్లా సహాయ కార్యదర్శి కె.శ్రీధర్‌, సీపీఎం నగర కమిటీ సభ్యులు కె.శ్రీనివాసరావు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు రవి, ముస్లిం లీగ్‌ నాయకులు ఎస్‌కే నాగూర్‌ షరీఫ్‌, తెలుగు రైతు గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు కె.రాజశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ, ఏఐటీయూసీ నగర అధ్యక్షుడు రావుల అంజిబాబు, సీపీఐ నగర కమిటీ సభ్యులు ఎస్‌కే అమీర్‌వలి, నూతలపాటి చిన్న, సమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం, మంగా శ్రీనివాసరావు, ఆకిటి రామచంద్రుడు, డేవిడ్‌ రాజు, కొండయ్య, ఏడుకొండలు, భాస్కర్‌, టీడీపీ నాయకులు సత్యం, కాంగ్రెస్‌ నాయకులు అడవి ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img