Friday, April 26, 2024
Friday, April 26, 2024

విచ్చలవిడి అరెస్టులు ప్రమాదకరం

జైళ్లలో 80 శాతం విచారణ ఖైదీలు
జ్యుడీషియల్‌ మౌలిక వసతులు మెరుగుపర్చాలి
సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ

జైపూర్‌ : హడావుడిగా, విచక్షణారహితంగా అరెస్టు చేయడం ఇప్పుడు అతిపెద్ద సమస్యగా పరిణమించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. కోర్టుల్లో పెండిరగ్‌ కేసులు పేరుకుపోవడంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్ధలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతోనే కేసులు పరిష్కారానికి నోచుకోక పేరుకుపోతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి చురకలు వేశారు. జైపూర్‌లో జరిగిన అఖిల భారత న్యాయ సేవల అథారిటీస్‌ సమావేశంలో న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లేవనెత్తిన అంశాలకు ఆయన బదులిచ్చారు. న్యాయ శాఖ మంత్రి ప్రస్తావించిన అంశాలపై స్పందించడం తన బాధ్యతగా పేర్కొన్న రమణ పెండిరగ్‌ కేసుల అంశాన్ని ప్రస్తావించారు. న్యాయమూర్తులుగా తాము విదేశాలకు వెళ్లినా ఇదే ప్రశ్న అడుగుతుంటారని, ఓ కేసును పరిష్కరించేందుకు ఎన్నేళ్ల సమయం పడుతుందని అడుగుతుంటారని చెప్పారు. పెండిరగ్‌ కేసులకు కారణమేంటో మీ అందరికీ తెలుసని, దానిపై తాను సవివరంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. న్యాయవ్యవస్ధలో ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో పాటు జ్యుడిషియల్‌ మౌలిక వసతులను మెరుగుపరచకపోవడమే పెండిరగ్‌ కేసులు పేరుకుపోవడానికి కారణమని స్పష్టం చేశారు. ఇదే విషయం తాను గతంలో ప్రధాన న్యాయమూర్తులు-ముఖ్యమంత్రుల సమావేశంలోనూ తేల్చిచెప్పానన్నారు. ఈ అంశాలను పరిష్కరించేందుకు న్యాయవ్యవస్థ శ్రమిస్తోందని, ప్రభుత్వం ఖాళీల భర్తీ, కోర్టుల్లో మౌలిక వసతుల మెరుగుదలపై దృష్టి సారించాలని కోరారు. జ్యుడిషియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అథారిటీ ఏర్పాటు చేయాలని తాము సూచించామని, అయితే ఈ ప్రతిపాదన ఇంకా కార్యరూపానికి రాలేదని అన్నారు. దేశంలో 6.10 లక్షల మంది ఖైదీలు ఉంటే వీరిలో దాదాపు 80శాతం మంది విచారణ ఖైదీలేనని తెలిపారు. క్రిమినల్‌ న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పారు. క్రిమినల్‌ న్యాయవ్యవస్థలో సాగే ప్రక్రియ కూడా శిక్షలాంటిదే. విచక్షణారహితంగా అరెస్టు చేయడం మొదలు బెయిల్‌ పొందేందుకు కష్టాలు సుదీర్ఘ కాలం సాగుతుంది. కాబట్టి విచారణ ఖైదీల విషయంలో తక్షణమే దృష్టిని కేంద్రీకరించడం అవశ్యం అని రమణ అన్నారు. క్రిమినల్‌ న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచేందుకు ఆచరణసాధ్య కార్యాచరణ అవసరమని ఆయనన్నారు. విచారణ ఖైదీలకు సాధ్యమైనంత త్వరగా విముక్తి కల్పించడం మాత్రమే లక్ష్యం కాకూడదని, విచారణ లేకుండా ఇంత పెద్ద సంఖ్యలో ఖైదీలు ఉండాల్సి వస్తున్న విధానాన్ని ప్రశ్నించాలని ఉద్ఘాటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img