Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యార్థి, యువత సమరశంఖం

హోదా, విభజన హామీలపై మోదీ సర్కారు మోసం

. ప్రయోజనాల రక్షణలో జగన్‌ మొద్దునిద్ర
. ఎంపీలు రాజీనామా చేయాలి
. హామీలు అమలు చేసేదాకా పోరాటం
. బస్సుయాత్ర ప్రారంభిస్తూ రామకృష్ణ స్పష్టీకరణ

అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటు సాక్షిగా నమ్మబలికి ఇసుమంతైనా ప్రయోజనం కల్పించలేదు. హామీలు అమలు చేయకపోగా తమను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరడం సిగ్గుచేటు.
` రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

విశాలాంధ్ర`అనంతపురం అర్బన్‌: ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు సమరశంఖం పూరించాయి. హామీలు అమలు చేసేంత వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని తేల్చిచెప్పాయి. హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు బస్సుయాత్ర చేపట్టాయి. ఆ యాత్ర అనంతపురం నుంచి ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది. విద్యార్థి, యువత చేపట్టిన బస్సుయాత్రను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. రామకృష్ణ సహా ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, సీపీఎం రాష్ట్ర నాయకుడు ఓబులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జగదీశ్‌, అనంతపురం జిల్లా కార్యదర్శి జాఫర్‌, పుట్టపర్తి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్‌, స్వాతంత్య్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటు సాక్షిగా నమ్మబలికి ఓట్లు దండుకున్న బీజేపీ నాయకులు…అధికారం చేపట్టి 8 ఏళ్లు గడచినా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం కల్పించలేదని విమర్శించారు. రాష్ట్రానికిచ్చిన హామీలు అమలు చేయకపోగా తమను గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కోరడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి ఏమి చేశారని బీజేపీకి అధికారం ఇస్తారని రామకృష్ణ సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సుయాత్ర విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇందుకుగాను సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తానని చెప్పిన సీఎం జగన్‌కు నేడు 31 మంది ఎంపీలు ఉన్నారని, అయినా కేంద్రం ముందు మోకరిల్లుతున్నారని ఘాటుగా విమర్శించారు. వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయకుండా చికెన్‌ బిర్యానీ తిని పార్లమెంట్‌లో నిద్రపోతున్నారా అని రామకృష్ణ ప్రశ్నించారు. హోదాపై వౌసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. ఏపీ ప్రయోజనాలు కాపాడలేని ఎంపీలు…తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. హోదాతోపాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన సమరయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందని ప్రకటించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్‌ బాబు, శివారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్‌ బాబు, రాజేంద్ర, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు, ప్రొఫెసర్‌ సదాశివానందరెడ్డి, పీడీఎస్‌యూ నాయకుడు రాజశేఖర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భాస్కర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న, విద్యార్థి, యువజన నేతలు నరేశ్‌, సాకే నరేశ్‌, సురేశ్‌, వేమన్న, పృథ్వీ, రామన్న, కుల్లాయ్‌ స్వామి, చిరంజీవి, ఆనంద్‌, సంతోశ్‌ కుమార్‌, వీరేంద్ర ప్రసాద్‌, నరసింహారెడ్డి, అబ్దుల్‌ ఆలం తదితరులు పాల్గొన్నారు. కాగా, హోదా సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు చేపట్టిన బస్సుయాత్ర అనంతపురం నుంచి కర్నూలు, డోన్‌కు వచ్చింది. స్థానిక నాయకులు బస్సుయాత్రకు ఘనస్వాగతం పలికారు. హోదా సాధన రాష్ట్ర కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌, జిల్లాల నాయకులు ప్రసంగించారు. హోదా సాధించేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img