Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

విద్యుత్‌ సంక్షోభం కార్పొరేట్ల సృష్టే

స్వార్థపరశక్తులతో బీజేపీ కుమ్మక్కు
టాటా, అదానీల లాభార్జనే ప్రధానం

న్యూదిల్లీ : కొన్ని స్వార్థపరశక్తులు బీజేపీతో కుమ్మక్కై దేశంలో విద్యుత్‌ సంక్షోభాన్ని సృష్టించాయి. కనీసం 20రోజుల పాటు నిల్వలు వుండేలా చూసుకోవాలని మార్గదర్శకాలు ఉన్నా కేంద్రం పట్టించుకోలేదు. విద్యుత్‌ సంస్థలకు అవసరమైన బొగ్గు పరిమాణం కన్నా తక్కువ మొత్తాన్ని ఎందుకు కేటాయించాల్సి వచ్చిందనేది ఎవరికీ అంతుపట్టడంలేదు. ఇది కచ్చితంగా విధానపరమైన, పర్యవేక్షణా స్థాయిలో జరిగిన వైఫల్యమేనన్నది విశ్లేషకుల భావన. ఇందుకు కేంద్ర ప్రభుత్వమే జవాబు చెప్పాలి. నిజానికి ఏప్రిల్‌`సెప్టెంబరు మధ్యకాలంలో కోల్‌ ఇండియా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసింది. బొగ్గుకు తగ్గిన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఉత్పత్తి స్థాయిని తగ్గించేందుకు సీఐఎల్‌ అనుబంధ సంస్థలపై ఒత్తిడి వచ్చిందని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) చైర్మన్‌ ప్రమోద్‌ అగర్వాల్‌ చెప్పారు. ఈ మేరకు ఆయన స్టేట్‌మెంట్‌ను కూడా నమోదు చేశారు. పెద్ద మొత్తంలో బొగ్గు నిల్వలు కొద్దికాలం పాటు పేరుకుపోయినట్లైతే, కాలక్రమంలో అవి బూడిదగా మారిపోతాయి, నిరుపయో గమవుతాయని ఆయన తెలిపారు. దీన్నిబట్టే కృత్రిమ సంక్షోభాన్ని ఎలా సృష్టించారో అర్థమవుతోంది. సీిఐఎల్‌, ఎస్‌సీసీిఎల్‌, ఇతర ప్రైవేటు గనులు 18.4 లక్షల టన్నుల చొప్పున విద్యుత్‌ ప్లాంట్ల రోజువారీ మొత్తం బొగ్గు అవసరా లను తీరుస్తున్నాయి. ప్రస్తుతం ప్లాంట్‌ స్థాయిలో చూసినట్లైతే బొగ్గు నిల్వలు మూడు నుంచి ఐదు రోజులకు సరిపడా ఉన్నాయి. గుజరాత్‌ తీర ప్రాంతాల్లోని అదానీ, టాటా విద్యుత్‌ స్టేషన్లు, మరికొన్ని ఇతర ప్లాంట్లు దిగుమతి చేసుకున్న బొగ్గుపై ఆధారపడేవే. గతంలో కుదుర్చుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ప్రకారం రేట్లను పెంచాలని టాటా, అదానీ డిమాండ్‌ చేశారు. అంతర్జాతీయంగా బొగ్గు ధర పెరిగిన నేపథ్యంలో తమకు నష్టాలు వస్తున్నాయని పేర్కొంటూ సెప్టెంబరు మూడవ వారం నుండి పూర్తిగా ఉత్పత్తిని నిలిపివేశారు. జాతీయ టారిఫ్‌ విధానం కింద విద్యుత్‌ యూనిట్‌ ధరను రూ.9 నుండి రూ.21కి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటు సంస్థలకు ఇప్పటికే అనుమతించిందని సమాచారం. ఈ విద్యుత్‌ సంక్షోభాన్ని సాకుగా చూపి ధరలు మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదంతా చూస్తుంటే, ప్రస్తుతమున్న బొగ్గు సంక్షోభం కార్పొరేట్లు కృత్రిమంగా సృష్టించిందే తప్ప మరొకటి కాదని స్పష్టమవుతోంది. కార్పొరేట్లు తమ దీర్ఘ, స్వల్పకాల లాభాల కోసమే ఈ కొరతను సృష్టించినట్లు అర్థమవుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img