Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వివేకా హత్య కేసు: హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట

25వ తేదీ వరకు రోజూ సీబీఐ విచారణకు ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశం
ముందస్తు బెయిల్ పైన 25వ తేదీన తుది తీర్పు


కడప ఎంపీ, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డికి మంగళవారం హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టం చేసింది. 25వ తేదీ వరకు అవినాశ్ రెడ్డి కూడా రోజూ విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్ పైన తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది.అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయంతో తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పైన న్యాయమూర్తి నిన్న, ఈ రోజు వాదనలు విన్నారు. ఈ రోజు వాడిగా, వేడిగా వాదనలు జరిగాయి. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తుది తీర్పు వచ్చే వరకు అరెస్ట్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.అవినాశ్ రెడ్డికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, ఆయనను అరెస్ట్ చేయాలని సీబీఐకి అంత ఆతృత ఎందుకు అని ఎంపీ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసు రోజున మృతదేహం వద్దకు అవినాశ్ వెళ్లే వరకు చాలామంది ఉన్నారని చెప్పారు. సాక్ష్యాలు తారుమారు చేసే ఆలోచన లేదన్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలు, వ్యాపార తగదాలు కావొచ్చునని, రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని వాదనలు వినిపించారు. అవినాశ్ కు మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు.మరోవైపు, సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవని కోర్టుకు తెలిపారు. అవినాశ్ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేశారని కోర్టుకు తెలిపారు. వైయస్ వివేకా కూతురు సునీత కూడా ఇంప్లీడ్ అయి తన వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పును 25వ తేదీకి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img