Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మూసివేతకు కుట్ర

సీఎండీ వల్లే కోకింగ్‌ కోల్‌ కొరత
బకాయిల కోసం విద్యుత్‌శాఖ నోటీసులు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిశ్రమ మూసివేతకు మోదీ సర్కారు కంకణం కట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. ఓ పక్క బొగ్గు సరఫరా లేదు. అదానీ గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనతో బొగ్గు అందుబాటులో లేదు. ఆ కార్మికుల సమస్యను పోర్టు యాజమాన్యం పట్టించుకోవడం లేదు. మరోవైపు మూలిగేనక్కపై తాటికాయ పడినట్లు విద్యుత్‌ బకాయిలు చెల్లించాలని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు విద్యుత్‌ శాఖ నోటీసులు పంపింది. ఇది మరింత ఆందోళనకరంగా మారింది. బొగ్గు లేక కొట్టుమిట్టాడుతున్న స్టీల్‌ప్లాంట్‌కు విద్యుత్‌ బకాయిలు మరింత భారంగా మారాయి. దాదాపు రూ.100 కోట్ల బకాయి తక్షణమే చెల్లించకపోతే శుక్రవారం నుండి విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని విద్యుత్‌ శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలుగజేసుకోకుండా ఎన్నికల సమయంలో స్టీల్‌ప్లాంట్‌ మూతకు కుట్ర చేస్తున్నట్లు అర్థమవుతోంది.
గంగవరం పోర్టు కార్మికులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల మధ్య చిచ్చుపెట్టి స్టీల్‌ప్లాంట్‌ను మూసివేయాలని అదానీ కుట్ర పన్నినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా అధికారులు కూడా జోక్యం చేసుకోవడం లేదు. గంగవరం పోర్టు కార్మికుల ఆందోళనపై ఉక్కుపాదం మోపుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభించిన గత 33 ఏళ్లలో ఎన్నడూలేని విధంగా ప్లాంట్‌లోని మొదటి విభాగం కోక్‌ఓవెన్‌కు అవసరమైన కోకింగ్‌ కోల్‌ కొరతను స్వయానా యాజమాన్యం సృష్టించింది. దీనికి బాధ్యులైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ సీఎండీని వెంటనే తొలగించాలని కార్మికసంఘాల నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈనెల 21వ తేదీ ఆదివారం స్టీల్‌ప్లాంట్‌ వద్ద జరిపే కార్మిక గర్జనను విజయవంతం చేయాలని ఉక్కు ఉద్యోగులకు పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కోక్‌ఓవెన్‌ డిపార్ట్‌మెంట్‌ జీవనాడి వంటిది. స్టీల్‌ప్లాంట్‌ బ్యాటరీల నుండి ఉత్పత్తి అయ్యే కోక్‌ ద్వారా స్టీల్‌ ఉత్పత్తి అవుతుంది. కోక్‌ఓవెన్‌ నుండి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అంతా నడుస్తుంది. కోక్‌ ఓవెన్‌లో ముడిసరుకు అయిన కోకింగ్‌ కోల్‌ను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. ఆ విధంగా దిగుమతి అయిన 30 వేల టన్నుల కోకింగ్‌కోల్‌ గంగవరం స్టాక్‌ యార్డ్‌లో ఉంది. ఆస్ట్రేలియా నుంచి 2 షిప్‌లలో వచ్చిన 1.5 లక్షల టన్నుల కోకింగ్‌ కోల్‌ గంగవరం పోర్టులో ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు, గంగవరం పోర్టుకు మధ్య గోడే అడ్డు. గంగవరం పోర్టులో ఉన్న కోకింగ్‌ కోల్‌ను విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ఎందుకు రప్పించలేకపోయారు? దీనికి బాధ్యత యాజమాన్యం వహించాలి. సకాలంలో ముడిఖనిజం తెప్పించలేని అసమర్ధ సీఎండీని తొలగించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. గత ఆరు రోజుల్లో కోక్‌ఓవెన్‌ ఉత్పత్తి 320 పుస్సింగ్‌ల నుంచి నేటికి 140 పుస్సింగ్‌లకు పడిపోయింది. మొత్తం స్టీల్‌ప్లాంట్‌లో ఐదు బ్యాటరీల్లో 1,3 బ్యాటరీలు కోకింగ్‌ కోల్‌ లేనందువల్ల ఉత్పతి నిలిపివేశాయి. దీని ప్రభావంతో ప్లాంట్‌ ఉత్పత్తి 80 శాతం పడిపోతుంది. అన్నింటికంటే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కోక్‌ఓవెన్‌ విభాగం కోమాలోకి వెళ్లింది. ఈ విభాగాల మరమ్మతుకు కనీసం 60 రోజులకు పైగా పడుతుంది. ఈ కాలంలో ఉత్పత్తి పూర్తిగా పడిపోతుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పూర్తిగా దెబ్బతియ్యడానికి మోదీ ప్రభుత్వం, గంగవరం పోర్టు యాజమాన్యం కలిసి చేసిన కుట్ర అని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు.
అదానీ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే గంగవరం పోర్టు కార్మికులకు సమస్యలు సృష్టించింది. నిర్వాసితులతో 2006లో జరిగిన ఒప్పందం ప్రకారం కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలి. కానీ 15 ఏళ్లు దాటినా గంగవరం దిబ్బపాలెం నిర్వాసితులను పట్టించుకోలేదు. గంగవరం పోర్టులో బెర్త్‌ల వద్ద పనిచేసే 15 మంది కంపెనీ ఆపరేటర్లకు నెలకు లక్ష రూపాయల జీతం చెల్లిస్తున్నారు. 200 మంది స్టాక్‌యార్డ్‌లో అదే పనిచేస్తున్న స్థానిక ఆపరేటర్లకు నెలకు రూ.15 వేలు మాత్రమే ఇస్తున్నారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. గంగవరం పోర్టు కార్మికులు ఇప్పటి వరకు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నారు. వారిని రోజుకు 12 గంటలు పనిచేయించాలని పోర్టు యాజమన్యాం కుట్ర పన్నుతోంది. ఇప్పటికే రైల్వే, వేయింగ్‌ డిపార్ట్‌మెంట్‌లలో రోజుకు 12 గంటల పని ప్రవేశపెట్టింది. గంగవరం యాజమాన్యం కావాలనే సమస్యలు సృష్టించి పోర్టులోని ముడిఖనిజం స్టీల్‌ప్లాంట్‌కు రాకుండా అడ్డుకుంటున్నదని కార్మికసంఘాల నేతలు మండిపడుతున్నారు. గంగవరం పోర్టు యాజమాన్యం చిత్తశుద్ధితో సమస్య పరిష్కరించాలనుకుంటే…ఒక్క రోజులో కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరికి నిరసగా ఈ నెల 21న జరిగే కార్మిక గర్జనకు మద్దతివ్వాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img