Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల… మొదలైన నామినేషన్ల ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు సంబంధించి మరో కీలక ఘట్టం మొదలైంది. కాసేపటి క్రితమే ఏపీలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్ధానాలకు ఎన్నికల నిర్వహణపై నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు గురువారం ఉదయం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అవడంతో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. నేటి నుంచి ఈనెల 25 వరకూ నామినేషన్ల స్వీకరణ జరుగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లకు సమయం కేటాయించారు. ఈనెల 26 నామినేషన్ల పరిశీలన ఉండనుండగా.. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 29. అలాగే.. మే 13న పోలింగ్ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరుగనున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. జూన్ 4వ తేదీన ఫలితలు వెల్లడికానున్నాయి.

మరోవైపు… పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్‌లలో, అసెంబ్లీ స్థానాలకు ఆయా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం జరుగనుంది. నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల వాహనాలను రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్న కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే నిలిపివేస్తారు. అలాగే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా అధికారులు వీడియో రికార్డింగ్ చేయనున్నారు. అలాగే పబ్లిక్ హాలీడేస్, ఆదివారం రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. రేపు (శుక్రవారం), ఈనెల 22, 25 తేదీలు మంచి రోజులు కావడంతో ఎక్కువ నామినేషన్‌లు వేసే అవకాశం ఉంది. కాగా… నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో సర్వేలకు ఫుల్ స్టాప్ పడనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img