Friday, April 26, 2024
Friday, April 26, 2024

వెనక్కి తగ్గం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తాం
ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత లేదు
అవసరమైతే తొలగిస్తాం
రాజకీయ లబ్ధికే లక్ష్మినారాయణ పిటిషన్‌
హైకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

అమరావతి : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. నూటికి నూరుశాతం ప్రైవేటీకరణ చేసి తీరుతామని మోదీ సర్కారు తేల్చిచెప్పింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత లేదని, అవసరమైతే ఉద్యోగులను తొలగిస్తామని నిస్సిగ్గుగా చెప్పింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కేంద్రం బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేసింది. తన అఫిడవిట్‌లో కీలక అంశాలను పొందుపరిచింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై వ్యాజ్యం దాఖలు చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విశాఖపట్నం లోక్‌సభకు పోటీ చేశారని, ఆయన రాజకీయ లబ్ధి కోసమే కోర్టులో పిటిషన్‌ వేశారని కౌంటర్‌లో పేర్కొంది. అందువల్ల లక్ష్మీనారాయణ పిల్‌కు విచారణార్హత లేదని తెలిపింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని స్పష్టంచేసింది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రైవేటీకరణ ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని, ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలపై విచారణ తగదని ప్రస్తావించింది. పెట్టుబడుల ఉపసంహరణపై సుప్రీం కోర్టు తీర్పులున్నాయని గుర్తు చేసిన కేంద్రం.. ప్రక్రియను అనుభవజ్ఞులైన ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img