Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

‘సిరివెన్నెల’కు ప్రముఖుల నివాళి

సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అంతిమయాత్ర మొదలైంది. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్‌ఛాంబర్‌లో ఉంచి ఆయన భౌతికకాయాన్ని మహాప్రస్థానానికి తరలిస్తున్నారు. సిరివెన్నెల అంతిమయాత్రను చూసేందుకు రోడ్డుపై జనాలు బారులు తీరారు. ఈ క్రమంలో రాజకీయ, సినీ ప్రముఖులు ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకుని ఆయన పార్థివదేహానికి కన్నీటి నివాళులు అర్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీయార్‌, జగపతిబాబు, నాగబాబు, శ్రీకాంత్‌, రాజశేఖర్‌, అల్లు అర్జున్‌, నాని, రానా దగ్గుబాటి, శర్వానంద్‌ తదితరులు సిరివెన్నెలకు నివాళులర్పించారు. ఇక రాజమౌళి, కీరవాణి, మణిశర్మ, గుణశేఖర్‌, క్రిష్‌ జాగర్లమూడి, మారుతి, పరుచూరి గోపాలకృష్ణ, ఆచంట గోపీనాథ్‌, ఎస్వీ కృష్ణారెడ్డి, కే అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, రావు రమేష్‌, నిర్మాతలు అల్లు అరవింద్‌, ప్రసాద్‌, కేఎల్‌ నారాయణ, చోటా కే నాయుడు, సింగర్‌ సునీత తదితరులు సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహానికి నివాళులర్పించారు.

సిరివెన్నెల మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటు: హరీష్‌రావు
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తెలుగు సినీ పరిశ్రమ, సాహిత్య కవులకు తీరని లోటు అని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. పండితులు, పామరులను ఆయన రచనలు మెప్పించాయన్నారు. సమాజంలో గొప్ప చైతన్యం కలిగించడానికి పాటలు రాశారని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమైన రోజు : తలసాని
సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణించటం తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి విషాదకరమైన రోజని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

సిరివెన్నెల లేని లోటు ఎవరూ కూడా భర్తీ చేయలేరు : చిరంజీవి
చిత్ర పరిశ్రమకు సిరివెన్నెల లేని లోటు ఎవరూ కూడా భర్తీ చేయలేరని మెగాస్టార్‌ చిరంజీవి తెలిపారు. సమాజాన్ని మేల్కొలిపే సమాజం ఆలోచింపజేసేలా ఆయన మాటలు పాటలు ఉండేవన్నారు. కొద్ది రోజుల క్రితమే తన అనారోగ్య సమస్యలు తెలుసుకుని చెన్నై వెళ్లి ట్రీట్మెంట్‌ తీసుకోవాలని చెప్పాను. తాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత చెన్నై వెళ్దామని సిరివెన్నెలకు చెప్పానన్నారు. ఇంతలోనే ఇలాంటి వార్త వింటామని ఊహించలేదన్నారు. పుట్టిన వెంటనే ఎవరు కూడా మెగాస్టార్‌ కాలేరని చాలా సందర్భాల్లో తనతో అనేవారన్నారు.

మిత్రమా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు : నాగార్జున
‘సీతారామశాస్త్రిగారితో స్నేహం ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు వెళ్లి కలిసినా ‘మిత్రమా ఏం చేస్తున్నావు’ అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’

ఊహించడానికే కష్టంగా ఉంది..: మహేష్‌బాబు
‘సిరివెన్నెల సీతారామశాస్త్రి లేకుండా తెలుగు సినిమా పాటలు ఎలా ఉండబోతున్నాయనేది ఊహించడానికే కష్టంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా..’ అని అన్నారు.

చాలా బాధించింది..: పవన్‌కల్యాణ్‌
‘సీతారామశాస్త్రిగారి మరణం చాలా బాధించింది. కొన్ని దశాబ్దాలు ఉండి తెలుగు చిత్ర పరిశ్రమకు సేవ చేయల్సిన వ్యక్తి..కన్నుమూయడం దురదృష్టకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా..’

ఎలా వ్యక్తపరచాలో మాటలు రావడం లేదు: జూ.ఎన్టీఆర్‌
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి నటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో సిరివెన్నెల పార్ధివదేహాన్ని సందర్శించి అంజలి ఘటించారు. అనంతరం జూ.ఎన్టీఆర్‌ మాట్లాడుతూ…బాధను ఎలా వ్యక్తపరచాలో కూడా మాటలు రావడం లేదని… అలాంటి మాటలను వర్ణించడంలో కూడా ఆయనే అని తెలిపారు. తెలుగు జాతి, భాష బతికున్నంత కాలం ఆయన సాహిత్యం బతికి ఉంటుందన్నారు. సిరివెన్నెల సీతారామాశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆకాంక్షించారు.

ఏపీ మంత్రి పేర్నినాని నివాళులు
సిరివెన్నెల సీతారామాశాస్త్రికి ఏపీ మంత్రి పేర్నినాని నివాళులు అర్పించారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో సిరివెన్నెల పార్థివదేహాన్ని సందర్శించిన మంత్రి… సిరివెన్నెల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీ ప్రభుత్వం తరపున సిరివెన్నెల అంత్యక్రియల్లో మంత్రి పేర్నినాని పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img